అంతర్జాతీయ వేదికపై ట్రాన్స్ జెండర్ల అస్తిత్వ గొంతుక

 హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆహ్వానం అందుకున్న కల్కి సుబ్రమణ్యం

అంతర్జాతీయ వేదికపై ట్రాన్స్ జెండర్ల అస్తిత్వ గొంతుక

Tuesday January 24, 2017,

1 min Read

కల్కి సుబ్రమణ్యం. ఒక్క తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆడ మగ కాని భౌతిక సంఘర్షణ. సమాజ పరంగా మానసిక సంఘర్షణ. నిప్పుల కొలిమిలాంటి రెండు కోణాల్లోంచి ఫీనిక్స్ పక్షిలా రెక్కలు విప్పార్చి నింగికెగసింది. పుట్టుకనే తిరగ రాసుకుని ఛీకొట్టిన సమాజాన్ని గల్లాపట్టి నిలదీసింది. సహోదరి ఫౌండేషన్ స్థాపించి తనలాంటి వారెందరికో ఆర్ధికంగా, సామాజికంగా అండగా నిలబడింది.

తొలి ట్రాన్స్ జెండర్ వ్యాపార వేత్తగా నిరూపించుకొంది కల్కి. మంచి డాన్సర్ గా పేరుతెచ్చుకుంది. మాస్ కమ్యూనికేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిoది. తనలోని రచయితనూ ప్రపంచానికి పరిచయం చేసింది. నర్తగి అనే తమిళ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. లెక్కలేనన్ని సభలూ సమావేశాలు, సెమినార్లు నిర్వహించింది. 

image


నర్తకిగా నటిగా, రచయితగా, యాక్టివిస్టుగా, ఫిలింమేకర్ గా, జర్నలిస్టుగా, ఆంట్రప్రెన్యూర్ గా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో కల్కి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ట్రాన్స్ జెండర్ల ఉద్యమకారిణిగా, వారి తరపున మాట్లాడాలని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆహ్వానం అందుకుంది.

కల్కి సుబ్రమణ్యంతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఆమె మాటలు సమాజంపై బలంగా నాటుకున్నాయి. ఆ వాగ్ధాటి, చతురత, లాజిక్, ప్రశ్నించే తత్వం ఆమెను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం, వారి సంక్షేమంకోసం నినదించే ఆమె వాయిస్.. ఇప్పుడు అంతర్జాతీయంగా మార్మోగబోతోంది. ఈ పిలుపు తనకు మాత్రమే దక్కిన అవకాశంగా కల్కి భావించడం లేదు. మొత్తం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకే దక్కిన గౌరవంగా భావిస్తోంది.

అంతర్జాతీయ వేదిక మీద ట్రాన్స్ జెండర్ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయంపై ట్రాన్స్ జెంబర్ల ప్రతినిధిగా ఎలుగెత్తి చాటబోతోంది. జనవరి1న కల్కికి ఇన్విటేషన్ వచ్చింది. మొదట ఆశ్చర్యమేసినా, ఇన్నాళ్లకు తమ గొంతు ప్రపంచానికి వినిపించబోతోందని సంబరపడింది. తమ అస్తిత్వ పోరాటాన్ని చాటిచెప్పే అవకాశమొచ్చిందని ఒకింత గర్వపడింది. ఈ చారిత్రక అవకాశాన్ని స్ఫూర్తివంతంగా మలుస్తానని అంటోంది.