అన్నయ్య మరణం సోషల్ ఆంట్రప్రెన్యూర్‌ను చేసింది

అన్నయ్య మరణం సోషల్ ఆంట్రప్రెన్యూర్‌ను చేసింది

Tuesday September 01, 2015,

5 min Read

డ్రగ్స్‌కి బానిసై సోదరుడి మరణం.

CAN పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు.

పేద పిల్లలు స్కూల్ మానేయకుండా అవగాహన.

ఈశాన్య రాష్ట్రంలో అద్భుత ఫలితాల కోసం నాగాలాండ్ యువకుడు ప్రయత్నం.


పసితనం నుంచి టీనేజ్ వరకూ జెంపూ రోంగ్‌మీని కష్టాలే వెంటాడేవి. అతని తండ్రి మద్యానికి బానిసై.. తల్లిని చిత్రహింసలు పెట్టేవాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా.. కాలేజ్‌ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. మత్తు పదార్ధాలకు విపరీతంగా అలవాటు పడి.. చివరకు తమ సోదరుడు డేవిడ్ చనిపోవడం ఇతని కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది.

ఇన్ని గడ్డు పరిస్థితులూ జెంపు మనోధైర్యాన్ని దెబ్బ తీయలేకపోయాయి. ఎంత కష్టమైనా సరే అధిగమించాల్సిందే అనే పట్టుదలతో... ఎట్టకేలకు సరైన మార్గాన్ని ఎంచుకోగలిగాడు. భవిష్యత్‌పై ఆశలు, అంచనాలతో లీడర్‌గా ఎదిగాడు.

జెంపు రోంగ్‌మీ

జెంపు రోంగ్‌మీ


కమ్యూనిటీ అవెన్యూ నెట్వర్క్(CAN) ప్రారంభించి, దాన్ని నిర్వహిస్తున్న జెంపు వయసు ప్రస్తుతం 30 ఏళ్లు. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఉన్న దిమాపూర్‌ కేంద్రంగా నడుస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఇది. హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్న చిన్నారులకు నైతిక మద్దతు ఇవ్వడమే కాకుండా... అవసరమైన సామగ్రినీ సరఫరా చేస్తుంది. పేదవర్గాల్లోని యువత, పలు కాలేజ్‌లు-గ్రామాలకు చెందిన వాలంటీర్లకు వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా... సమాజ సేవ చేసేలా వారిలో మార్పు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం నాగాలాండ్ అలయన్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ విమెన్ రైట్స్‌కు ఇన్‌ఫర్మేషన్ సెక్రటరీగా కూడా ఉన్నారు జెంపు.

“నా గతమే నాకు ప్రేరణ. నేనెన్ని కష్టాలు అనుభవించానో నాకు తెలుసు. ఒక సోదరుడిని కోల్పోతే ఎలా ఉంటుందో ఆ బాధ వర్ణణాతీతం. ఆ బాధ నన్నెపుడూ వెంటాడుతూనే ఉంటాంది. ఇలా బాధపడే యువతను ఈ సమాజంలో చాలామందిని చూశాను. అందుకే గతాన్ని పక్కన పెట్టేసి, అది ఇచ్చిన అనుభవాలతో కొత్త దారులు వేసుకునేలా ప్రేరణ పొందాను”- జెంపు రోంగ్‌మీ

“కమ్యూనిటీ ఎవెన్యూ నెట్వర్క్ కోసం పని చేసేవారు అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది నాకు సాయం చేసినట్లే. కొత్త విషయాలు తెలుసుకోవడంతో నాకు ఎంతో ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. నాయకత్వంలో అసలు అర్ధమేంటో నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఇలా అడిగిన ప్రతీ అంశానికీ ఓపికగా సమాధానం చెబ్తుండడంతో... మిగిలినవారంతా ఎంతో అభిమానంగా ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈశాన్యరాష్ట్రాలకు, మిగిలిన భారత దేశానికి మధ్య అనేక సమస్యలున్నాయి. కానీ అక్కడి వారు కూడా నాతో ఎంతో స్నేహంగా ఉంటారు. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు, ఇండియాకు మధ్య వారధిగా మారింది మా సంస్థ”అంటున్నారు జెంపు.

CAN యూత్

సోదరుడు మత్తు పదార్ధాలకు బానిసగా మారడం, అనుకోకుండా మరణించడంతో.. ఈ సమస్యపై యుద్ధం చేయాలనే ఆలోచన మొదలైంది జెంపులో. “స్కూల్ పూర్తైన రోజుల్లోనే డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్న అనేకమంది విద్యార్ధులను ప్రత్యక్షంగా చూశాను. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిందించాలా ? ఇలా మత్తుపదార్ధాలను సేవించేవారిని నిందించాలా? అనే ఆలోచన వచ్చింది. ఇప్పటికైనా ఏదైనా చేసి.. మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలని అనుకన్నారు. అలా మొదలైందే CAN”అని చెప్పారు జెంపు.

నిజానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీయడంతోనే పరిస్థితి ఇక్కడివరకూ వచ్చింది. CAN ప్రారంభించినపుడు.. అతని దగ్గర డబ్బులు లేవు. అయినా ఈ సమస్య తీవ్రత కారణంగానే... వెంటనే ప్రారంభించక తప్పలేదు. “ కొంతమంది వ్యక్తులను నియమించుకుని.. వారిని స్కూల్ డ్రాపౌట్స్ దగ్గరకు పంపించడం ప్రారంభించాను. అప్పుడు వాళ్లు చాలా ఆందోళనలో ఉంటారు. అనేక నేరపూరిత ప్రవర్తనలకు మూల కారణం ఇదే. స్వయంగా నేను కూడా ఓ డ్రాపౌట్‌ని కావడంతో.. ఇలాంటివారి ప్రవర్తన, అలవాట్లు ఎక్కడివరకూ వెళ్తాయో నాకు తెలుసు“ అంటున్నారు జెంపు.

సోదరుడి మరణం ఒక్కటే కాదు.. ఈ సంస్థను ప్రారంభించడానికి మరో మఖ్య కారణం కూడా ఉంది. “ 2011 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం నాడు.. చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. దీనికి అనేక మంది ప్రజలు, మంత్రులు హాజరవగా.. స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి. ఆ సమయంలో పిల్లలను దగ్గరపెట్టుకుని విషాదంలో ఉన్న ఓ జంటను చూశాను. ఎందుకంత బాధపడుతున్నారని, పిల్లలు అంత నీరసంగా ఉండడానికి కారణమేంటని వారిని అడిగాను. ఆ పిల్లలు హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పారు వాళ్లు. ప్రభుత్వం యాంటి రెరోవైరల్ థెరపీ అందించినా... మందులు కొనేందుకు వారికి స్తోమత లేదని చెప్పారు. ఇది చూసి నేను చలించిపోయాను. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాను. ఈ దేశంలో పుట్టిన ప్రతీ పసికందుకీ జీవించే హక్కు, చదువుకునే హక్కు ఉన్నాయని ప్రచారం చేయడం ప్రారంభించాను. అందుకోసం నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే కమ్యూనిటీ అవెన్యూ నెట్వర్క్” అని చెప్పారు జెంపు.

జెంపు బాధ్యత తీసుకున్న 25మంది చిన్నారుల్లో వీరిద్దరు

జెంపు బాధ్యత తీసుకున్న 25మంది చిన్నారుల్లో వీరిద్దరు


హెచ్ఐవీ బాధిత చిన్నారులకు వారి ఇంటిలోనే సౌకర్యాలు

ఇలా చిన్నారుల బాధ్యత తీసుకోవడం కోసం... ఎలాంటి వసతి గృహాలు నడపడం లేదు జెంపు. వీరిలో చాలామందికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే బతికి ఉంటారు. కొందరికి ఇద్దరూ మరణించి ఉంటారు.

“సాధారణంగా ఇలాంటి పిల్లల తల్లి కానీ, తండ్రి కానీ చనిపోతే.. వారిని అనాథ శరణాలయాల్లో వదిలేస్తూ ఉంటారు. అప్పటికే ఆయా కుటుంబాలకు అనేక కష్టాలు, ఖర్చులు ఉంటాయి. ఈ హెచ్ఐవీ బాధిత బాలల కోసం అదనపు ఖర్చు చేసే స్తోమత ఉండడం లేదు. ఇది కూడా వీరిని అనాథ శరణాలయాల్లో వదిలేయడానికి కారణం అవుతోంది”

ఇలాంటి పిల్లలను ఇంటిలోనే ఉంచుకోవాలని... ఆయా కుటుంబాలను కోరతారు జెంపు. విద్య, వైద్యం, పోషకాహారంతో సహా.. ఆర్థిక అవసరాలన్నిటికీ తనే చూసుకుంటారు. 2012లో 9మంది చిన్నారులతో ఈ ప్రయాణం మొదలుపెట్టగా.. ఇప్పుడు వారి సంఖ్య 25కు చేరుకుంది.

వెదురు వస్తువుల తయారీ నేర్చుకుంటున్న బాలురు

వెదురు వస్తువుల తయారీ నేర్చుకుంటున్న బాలురు


స్కూల్ డ్రాప్‌అవుట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం.. కొన్ని ప్రైవేట్ ఏజన్సీలను సంప్రదించాడు జెంపు. ఈ నవతరం యువకుల జీవితం గురించి చెప్పి... సహాయం చేయాల్సిందిగా కోరాడు. చాలామంది ఇందుకు అంగీకరించకపోయినా... ఇప్పటికీ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుండడం విశేషం.

సాయం చేసే చేతికి ఎదురైన సవాళ్లు

వీలైనంత మందిని కలిసి తను చేసే పనులు వివరించి సాయం చేయమని కోరతాడు జెంపు. “ఇలాంటి పిల్లలు, టీనేజర్ల గురించి చెప్పి... వారికోసం సహాయం చేయమంటాను. సాధారణంగా నేను 40 మందిని కలిస్తే.. ముగ్గురు నలుగురు ఇందుకు అంగీకరిస్తార”ని చెప్పారు జెంపు.

తగినన్ని నిధులు లేకపోవడం నిరంతరాయంగా వేధిస్తున్న సమస్య. తానుండే సమాజం నుంచి ఇంకా పూర్తిగా మద్దతు లభించలేదు ఇతనికి. “నేను దీన్ని సవాల్‌గా తీసుకున్నాను. నేనేం సాధించాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. దాన్ని అందుకునేందుకు తగిన వ్యూహాలు కూడా నా దగ్గరున్నాయి. ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోను”-జెంపు రోంగ్‌మీ.

image


“ఒక సంస్థ విజయవంతంగా నడవాలంటే ఎక్కువమంది అందులో భాగస్వామ్యం అవాల్సి ఉంటుంది. మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతోందో అందరికీ తెలియాల్సి ఉంది. వాస్తవ దృష్టితో అర్ధం చేసుకోవాల్సిన అవసరముంది”అంటారు జెంపు.

ఇలాంటి సేవలు అందిస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థ, సామాజిక సంస్థలతో జత కట్టేందుకు జెంపు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి CANకు ఎలాంటి ప్రభుత్వ సహకారం అందడం లేదు.

సమస్యను మూలం నుంచి తుడిచేయగలగాలంటారు జెంపు. “యువత నిరుద్యోగులుగా ఉంటూ... బలాదూర్ తిరుగుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటారు. కానీ స్కూల్ డ్రాప్‌అవుట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. నాగాలాండ్ ఓ తిరుగుబాటు రాష్ట్రం. అక్షరాస్యత సరిగా లేకపోవడం, ఇప్పటివరకూ వారు ఎదుర్కున్న పరిస్థితులపై కోపం వంటివాటితో.. సమాజ వ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు యువత. ఇలా పిల్లలు స్కూల్ మానేయడం వారి ఇష్టంతో జరుగుతున్నది కాదు. వారు చూస్తున్న పరిస్థితులు వారినలా నడిపిస్తున్నాయనే సంగతిని మర్చిపోకూడదు”- జెంపు రోంగ్‌మీ

బిగ్ డ్రీమ్

సమాజంలో అన్ని వర్గాల వారికి విద్య, ఉద్యోగావకాశాలు సమానంగా ఉండాలన్నదే జెంపు ప్రాథమిక లక్ష్యం. “మనం సమాజ శ్రేయస్సు కోరుకునేవారమే అయితే.. స్కూల్ డ్రాపవుట్స్, పేదరికంలో మగ్గిపోతున్న పిల్లలు, హెచ్ఐవీ బాధిత చిన్నారులకు కూడా సమాన అవకాశాలు కల్పించి... వారి శ్రేయస్సుకు, అభివృద్ధికి తోడ్పడాల్సి ఉంది. వారు కూడా మన సమాజంలో ఉన్నవారే అని అంగీకరించాలి. కొంతమందిని వదిలేసి.. దేశ శ్రేయస్సుకోసం పాటుపడతున్నాం అనడంలో అర్ధం లేదం“టూ తన ఉద్దేశ్యాన్ని... ఘాటుగానే చెప్పారు జెంపు.

తన లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమేనంటారాయన. 'ఇది చాలా సులభమైన అంశం. మొదట్లో ఎదురైన అపజయంతో నిరుత్సాహపడితే.. ఏం సాధించలేం. నేను ఎంత చేయగలనో... అంతా చేస్తాను. మార్పు తప్పకుండా వస్తుందని నా హృదయం చెబుతోంది. నేను మరణించాకైనా సరే ఇది సాధ్యపడుతుంది. అనేక సమాజాల నుంచి వచ్చినవారు.. ఇప్పుడు నేను ప్రారంభించిన విషయాలపై మాట్లాడుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు చదువు ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటున్నారు. ఇదో సానుకూల పరిణామం'అంటూ తన ప్రయత్నాలతో సాధించిన ప్రగతిని జెంపు రోంగ్‌మీ వివరించారు.