అందని వాటి కోసం వేసే అడుగే అందలం ఎక్కిస్తుంది !

0

నేను, బెంగళూరులో పది కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు గంటకు 10 కిమీ. వేగంతో వెళ్తున్నాను. నేను ప్రయాణిస్తున్న కారు నత్తతో పోటీపడుతోందా అని నాకు అనిపించింది. ఈ మధ్యలో కాలాన్ని ఎందుకు వృధా చేయాలి అనే భావనతో కొంత మందికి ఫోన్ చేయాలని అనుకున్నాను. అయితే నెట్వర్క్ కారణంగా కాల్ డ్రాప్స్‌తో ఫోన్లు కలవడం లేదు. ఎంతో స్పీడ్ అని చెప్పుకునే 3జి స్పీడ్ డేటా కనెక్టివిటీ కూడా ఒక్క ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. అది కూడా దేశమంతా గర్వంగా కీర్తించే టెక్ క్యాపిటల్‌లోనే ఇది జరిగింది !

మన దేశంలో ఓ ఆంట్రప్రెన్యూర్ కావడమేనేది నాటకీయంగా జరుగుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచో.. లేదా మరో కారణం వల్లనో.. ఎప్పుడు ఏ సమస్య మనల్ని ఇబ్బందికి గురిచేస్తుందో చెప్పలేం. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యం మౌలిక సదుపాయాల కొరత. వీటిల్లో చైనాతో పోలిస్తే.. మనం ముప్పావు వంతే ఉండొచ్చు. కానీ జనాభాలో మాత్రం వాళ్లతో పోటీపడ్తున్నాం.

వీటన్నింటి గురించి ఆలోచిస్తూ.. అందరిలానే నేను కూడా కొన్నిసార్లు చికాకుపడ్తాను, ఆందోళనకు గురవుతాను.

నమ్మకం కుదరడం లేదా ? నేను మీకు ఓ కథ చెబుతాను (ఈ పనిని నేను అత్యద్భుతంగా చేయగలను). సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరేందుకు నేను పాట్నా నుంచి ఢిల్లీకి మారాను. అక్కడ డిబేటింగ్ (చర్చలు) నిర్వహించే సొసైటీలో భాగమయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నాను. పాట్నాలో అప్పటికే నేను ఇంటర్ స్కూల్ డిబేట్స్‌లో అనేక సందర్భాల్లో విజయం సాధించాను. ఆ అనుభవంతో ఇక్కడి ఎంపిక సులువని భావించాను. కానీ వాళ్లు అనుకున్న నిబంధనలను నేను పాటించకపోవడం వల్ల ఎంపిక కాలేదు. ఒక చర్చను ప్రారంభించి, ఓ సందర్భాన్ని వివరించేటప్పుడు ఓ ప్రత్యేకమైన శైలిని, ఓ తరహా విధానాన్ని అవలంభించాలని వారు కోరుకున్నారు. అయితే నాకు వాటి గురించే ఎలాంటి అవగాహనా లేకపోవడంతో నేను సెలక్ట్ కాలేదు. నాకు చాలా బాధగా అనిపించి కుంగిపోయాను.

కొద్దికాలం తర్వాత పాట్నా వెళ్లాను. నేరుగా మా స్కూల్ టీచర్ రేఖా శ్రీవాస్తవ దగ్గరికి వెళ్లి నా అనుభవాలను ఆమెతో పంచుకున్నాను. పాట్నాలో ఉన్న ఒక మంచి స్కూల్.. తన విద్యార్థులకు డేబేటింగ్‌లోని ప్రాధమిక విషయాలను కూడా నేర్పించడంలో ఎలా వెనుకబడిందనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లాను.

ఆమె చాలా సేపు నా ఆవేదనను ఓర్పుగా విన్నారు. '' నీకు దక్కనిదే.. నిన్ను దౌడు తీయిస్తుంది '' (What you lack will make you run.) అని నవ్వుతూ చెప్పారు.

మన దగ్గరి లేనిది, మనం నేర్చుకోనిది, మనకు దక్కనివే మనలో జ్వాలను రగిల్చి విజయానికి దగ్గరికి చేస్తాయి.

ఇవే 1999 నుంచి నా వెంట ఉన్నాయి. నాకు తెలియని, చేతకాని విషయాలను నిత్యం తెలుసుకునేలా చేస్తూ నన్ను ముందుకు నడిపించాయి.

బాధ అనే అనుభవమే లేకపోతే.. సుఖాన్ని ఎలా ఆస్వాదించగలం ? ఓడిపోవడమే తెలియకపోతే విజయంలో ఉన్న ఆనందాన్ని ఎలా అనుభవిస్తాం ? మన దగ్గర లేని వాటిని పొందినప్పుడు కలిగే సంతోషాన్ని ఎలా తెలుసుకోగలం ?

ఆంట్రప్రెన్యూర్స్‌కు, కాబోయే ఆంట్రప్రెన్యూర్స్‌కు నేను చెప్పేది ఒక్కటే - మన భారత దేశం అవకాశాల గని. ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది. వీటి నుంచే మనం అవకాశాలను వెతుక్కోవాలి. మనకు కావాల్సిన వాటిని దక్కించుకోవాలని చేసే ప్రయత్నమే మనల్ని ముందుకు నడిపిస్తుంది.

మనందరిలో దాగి ఉన్న ఆ బలీయమైన కాంక్ష... దేశంలోని వంద కోట్ల మంది జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలదో ఊహించండి. మన దేశంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం చూపి.. ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఉబలాట పడేవాళ్ల కంటి ముందు అంత పెద్ద మార్కెట్ కనిపిస్తూనే ఉంది. మనం చూపే ఆ పరిష్కారాన్ని అందిపుచ్చుకునేందుకు వంద కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. మారేందుకు ఉన్న అవకాశాలు, ఉన్నతివైపు మనం వేసే అడుగు - నిజంగా అద్భుతమే.

సారే జహాసే అచ్చా ... అనేది.. మన హిందుస్తాన్‌లో ఉన్న అపార అవకాశాలను సూచిస్తోంది.

రండి, వేడుక చేసుకుందాం. మన దగ్గర కొరవడిన, అపారంగా ఉన్న వాటిని అందరం కలిసి టెక్ స్పార్క్స్‌లో పంచుకుందాం.


(ఈ ఆర్టికల్‌ను ఇంగ్లిష్‌లో యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్, ఫౌండర్ శ్రద్ధా శర్మ రాశారు)