చౌక ధరలో సౌరవిద్యుత్ అందిస్తున్నఐఐటి ప్రొఫెసర్

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వెనుకబడి ఉన్న రంగం ఏదంటే విద్యుత్ రంగమేనని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోతున్నాం. పండుగ నాడు సైతం విద్యుత్ కోత‌ల‌ను దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. కొన్ని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ అంటే ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యను తీర్చేందుకు ముందుకొచ్చారు బాంబే ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ చేత‌న్ సింగ్ సోలంకి. తక్కువ వ్యయంతో సౌరశక్తిని తయారుచేస్తూ విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నారు.

చౌక ధరలో సౌరవిద్యుత్ అందిస్తున్నఐఐటి ప్రొఫెసర్

Saturday May 02, 2015,

3 min Read

చేత‌న్ సింగ్ సోలంకి.. బాంబే ఐఐటీలో ప్రొఫెసర్. ఈయన సౌరశక్తితో తక్కువ వ్యయానికే విద్యుచ్ఛక్తి అందిస్తున్నారు. కే వాట్ సొల్యూషన్స్ పేరుతో ఓ సంస్థను ఆరంభించి... సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు.

భ‌విష్య‌త్‌లో భార‌త్‌ను సౌరశక్తి దేశంగా చేయాలన్న లక్ష్యంతో 2013 సెప్టెంబర్లో కేఎస్‌పీఎల్‌ను స్థాపించారు చేతన్. ఆరుగురు బాంబే ఐఐటీ గ్రాడ్యూయేట్స్ సహకారం, బలమైన టెక్నికల్ బృందం సాయంతో కస్టమర్లకు డిజైనింగ్, ఇంజినీరింగ్, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో సమగ్ర సోలార్ ఎనర్జీ సొల్యూష‌న్స్‌ను అందిస్తున్నదీ సంస్థ. అలాగే సోలార్ ఇండస్ట్రీపై ఆసక్తి చూపే వారికి ట్రైనింగ్ కూడా ఇస్తోంజి KSPL. కిలోవాట్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల అవసరాలను తీర్చాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ఆరంభించారు చేతన్. తాము ఎలాంటి సేవలు అందిస్తున్నామో ఆ భావన కనిపించేలా కంపెనీ పేరును కూడా కిలోవాట్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గానే పెట్టడం గమనార్హం. సోలార్‌పార్క్ అనే భావనను తిరిగి నిర్వహించి, ప్రస్తుతం మెగావాట్ రంగంలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు.

image


ప్రొఫెసర్ టూ ఆంట్రప్రెన్యూర్‌..

డైనమిక్ పర్సన్ అయిన చేత‌న్ సింగ్ సోలంకి.. దేశంలో సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీకి ప్రోత్సాహం కలిగించిన వారిలో ఒకరు. సోలార్ ఎనర్జీ రంగంలో లోతైన అనుభవం ఈయన సొంతం. బాంబే ఐఐటీలో ఎనర్జీ సైన్స్ ఇంజినీరింగ్‌ బోధించే చేతన్ కిట్టిలో నాలుగు యూఎస్ పేటెంట్స్ ఉన్నాయి. పోరస్ సిలికాన్, సోలార్ సెల్ అప్లికేష‌న్స్‌లో ఈ పేటెంట్లను ప్రొఫెసర్ సాధించారు. 2009లో ఐఐటీ బాంబే నుంచి యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డును, 2003లో యూరోపియన్ మెటిరియల్ రీసెర్చ్ సొసైటీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డును ఫ్రాన్స్‌లో అందుకొన్నారు. అలాగే నాలుగు పుస్తకాలను కూడా రచించారు. 'సోలార్ ఫోటో వొలటాయిక్స్: ఫండమెంటల్స్, టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్' అనే పుస్తకం ఇండియాతోపాటు విదేశాల్లో కూడా రిఫరెన్స్ పుస్తకంగా గుర్తింపు పొందింది. చేతన్ రాసిన 40కిపైగా సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లు వివిధ జాతీయ, అంతర్జాతీయ జ‌ర్న‌ల్స్‌లో ముద్రితమయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ ఫొటోవాలటాయిక్స్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎన్సీపీఆర్ఈ) ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లలో చేతన్ కూడా ఒకరు.

ఫ్రీ కన్సల్టెంట్..

బాంబే ఐఐటీ ప్రొఫెస‌ర్‌గా ఎంతోమందికి చేతన్ మార్గదర్శకుడిగా వ్యవహరించారు. సోలార్ ఎనర్జీలో సాంకేతిక సలహాలు అవసరమైన వారికి ఫ్రీ కన్సల్టెంట్ గా సేవలు అందించారు. సౌరశక్తికి అవసరమైన వ్యవస్థను స్థాపించడం, అవసరమైన పదార్థాలు, వస్తువుల సేకరణ, మార్కెట్ సోర్సింగ్ వంటి అంశాల్లో ఎంతోమంది చేత‌న్‌ను కలిసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తన వద్దకు వచ్చిన వారికి అవసరమైన సమాచారాన్ని ఇచ్చి సాయం చేశారు. తాను అందరికి మరింతగా ఉపయోగాపడాలన్నదే చేతన్ ఉద్దేశం. కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ పూర్తిగా అమలయ్యేవరకు వారికి సాయం చేయాలని తపన పడతారు. ఈ ఆలోచన కారణంగానే కేఎస్పీఎల్ పురుడుపోసుకుంది. బాంబే ఐఐటీతో కలిసి పనిచేయడం వల్ల సోలార్ ఎనర్జీలో కొత్త కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నది చేతన్ భావన. మూడు అంశాలతో కేఎస్పీఎల్ ఏర్పడింది. సోలార్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, ప్రొఫెష‌న‌ల్స్‌కు సోలార్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తున్నారు. దీనికి తోడు సోలార్ ఎనర్జీ సెంటర్ కమ్ రిక్రియేషనల్ రిసార్టును కూడా కేఎస్పీల్ డిజైన్ చేసింది. తాము తయారు చేసిన అప్లికేషన్ల ద్వారా సౌరశక్తి నేరుగా వినియోగించుకునేందుకు ఈ సెంటర్ ద్వారా అవకాశం ఉంటుంది. ఇక రెండోది వివిధ రకాల సోలార్ ఉత్పత్తులను కూడా కేఎస్పీఎల్ తయారుచేసింది. సోలార్ స్ట్రీట్ లైట్స్‌, ఫౌంటెన్స్, సోలార్ వాటర్ హీటర్స్ వంటి వాటిని కూడా రూపొందించింది. అలాగే సోలార్ ఎంటర్ప్రెన్యూర్ నెట్‌వ‌ర్క్‌ సృష్టించేందుకు ఈ కేఎస్పీఎల్ టీమ్ ప్రయత్నిస్తున్నది. ఎంట‌ర్‌ప్రెన్యూర్స్‌కు కావాల్సిన శిక్షణ, బిజినెస్ మోడ‌ల్‌ను ఈ నెట్‌వ‌ర్క్‌ ద్వారా అందిస్తారు. ఇక మూడోది, ఎవరైనా పెట్టుబడిదారులు ముందుకు వస్తే ప్రపంచస్థాయి సోలార్ పార్క్ అందించేందుకు చేతన్ బృందం సిద్ధంగా ఉంది. వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండేలా ఈ సోలార్ పార్క్‌లో ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీతోపాటు పీవీ ప్లాంట్స్‌కు తీసుకెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతులు రెడీగా ఉంటాయి.

image


టార్గెట్ 100 గిగావాట్..

ఆరంభమైన ఏడాదిన్నరలోనే కేఎస్పీఎల్ ఎన్నో ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసింది. కిలోవాట్ రేంజ్లో 50కిపైగా ఇళ్లలో, ఇండస్ట్రీల్లో విద్యుత్ కాంతులను వెదజల్లింది. తాజాగా ముంబైలోని ఎస్వీసీ బ్యాంక్లో 22.5 కిలోవాట్ గ్రిడ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆరంభంలో రెండు కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీకి 2013లో కేవలం ముగ్గురు మాత్రమే ఉద్యోగులుండేవారు. ఇప్పుడు 30 మంది వివిధ విభాగాల్లో కస్టమర్లకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం కేఎస్పీఎల్ టర్నోవర్ రూ. 2.5 కోట్లకు పైమాటే. దేశంలో సోలార్ ప‌వ‌ర్‌కు కిలోవాట్, మెగా వాట్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సంస్థ మరింత వృద్ధి చెందుతుందని చేత‌న్ చెప్తున్నారు. ఆంట్రప్రెన్యూర్ నెట్‌వ‌ర్క్‌ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా కేంద్రం ఆశిస్తున్నట్టుగా 2022 కల్లా 100 గిగా వాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన నిపుణులను తయారు చేయొచ్చని ఈ బాంబే ఐఐటీ ఫ్రొఫెసర్ అంటున్నారు. మరి ఆయన ఆశయాలు నిజం కావాలని కోరుకుందాం..