లాస్ట్ మినిట్ డీల్స్ ఏం ఉన్నాయో చెప్పేసే 'రెస్సీ'

సామర్థ్య నిర్వహణకు చక్కని వేదిక భోజన ప్రియులూ డిస్కౌంట్లను తెలుసుకోవచ్చు రెస్సీ యాప్స్‌ను రూపొందించిన పుణే స్టార్టప్

లాస్ట్ మినిట్ డీల్స్ ఏం ఉన్నాయో చెప్పేసే 'రెస్సీ'

Saturday May 09, 2015,

3 min Read

చక్కని ప్రణాళిక లేకపోతే ఏమవుతుంది.. ఫలితం అందరికీ తెలిసిందే. ఈ సూత్రం ప్రతీ వ్యాపారానికీ వర్తిస్తుంది. రెస్టారెంట్ల విషయంలో అయితే ప్రణాళిక బద్ధంగా వెళ్లకపోతే వంటకాలు, ఆహార పదార్థాలు పాడవుతాయి. కస్టమర్లు ఎంత మంది వస్తారో ముందే ఊహించి వ్యూహాత్మకంగా వ్యవహరించే వీలుంటే ఎంత బావుంటుందో కదా ! అలాగే కస్టమర్లతో రెస్టారెంట్ కళకళలాడాలంటే.. ఇదుగో పుణేకు చెందిన స్టార్టప్ కంపెనీ రెస్సీ పేరుతో ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. రెస్టారెంట్ల కోసమేనా.. కాదు కాదు ఈ సంస్ధలు ఇచ్చే డిస్కౌంట్లూ తెలుసుకునేందుకు కస్టమర్లకూ ఒక యాప్‌ను తీసుకొచ్చింది.

ఇద్దరు స్నేహితులు కలిసి..

రెస్సీని సాగర్ పాటిల్, కౌస్తభ్ రాజపంధర ప్రారంభించారు. ఇరువురిదీ 15 ఏళ్ల స్నేహం. ఫుడ్, బెవరేజ్ రంగంలో కౌస్తభ్‌కు ఆరేళ్ల అనుభవం ఉంది. టైనీ ఓల్, గ్రూప్‌ ఆన్, డీల్స్‌అండ్‌యూ.కామ్ వంటి కంపెనీల్లో మార్కెటింగ్, సేల్స్ బాధ్యతలను చేపట్టారు. టెకీ అయిన సాగర్ 2009లో మాస్టర్ వర్క్స్ పేరుతో మీడియా ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీని అంతర్జాతీయ క్రియేటివ్ డిజైన్ ఏజెన్సీ మల్టియా 2013లో కొనుగోలు చేసింది. ఇరువురుకి రెస్సీ తొలి స్టార్టప్ కంపెనీ.

సాగర్ పాటిల్, కౌస్తభ్ రాజపంధర

సాగర్ పాటిల్, కౌస్తభ్ రాజపంధర


ఇలా పుట్టిందీ యాప్..

రెస్టారెంట్లకు సామర్థ్య నిర్వహణ ప్రణాళిక అతి పెద్ద, పరిష్కరించలేని సమస్యగా గుర్తించాను. ఇందుకు జవాబుగా యాప్‌కు రూపకల్పన చేశామని అంటున్నారు కౌస్తభ్. రెస్సీ అధ్యయనం ప్రకారం రెస్టారెంట్ల సామర్థ్యంలో 60-70 శాతం మాత్రమే ప్రతి వారం వినియోగమవుతోంది. దీంతో ప్రతిరోజు 40-50 శాతం నష్టం వస్తోంది. ఇక్కడ ముఖ్య విషయమేమంటే రెస్టారెంట్లు మాంసం, కూరగాయలు, పాలు, పాల పదార్థాల వంటి ఉత్పత్తులను ముందస్తుగానే కొనుగోలు చేస్తాయి. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసినా దాని పర్యవసానంగా 25 శాతం మేర రెస్టారెంట్లకు ప్రయోజనం కలుగుతుంది. అయితే నష్టాన్ని దూరం చేసేందుకే యాప్‌ను తీసుకొచ్చామని ఈ యువకులు చెబుతున్నారు. యజమానులు తమ రెస్టారెంట్ల సామర్థ్యాన్ని.. అంటే ఆ రోజు వండిన వంటకాలను సద్వినియోగం చేసుకునేందుకు చివరి నిముషంలో ఆఫర్లు డిజైన్ చేసుకునేందుకు వీలుగా యాప్‌కు రూపకల్పన చేశామని అంటున్నారు సాగర్.

రెస్సీ యాప్

రెస్సీ యాప్


రెస్సీ మర్చంట్ యాప్

తమ కస్టమర్లకు రియల్ టైం డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చేందుకు రెస్టారెంట్ల యజమానులకు ఇది చక్కగా దోహదం చేస్తుంది. వారంలో లేదా వారంతంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఏ ఫుడ్‌పైన ఎంత డిస్కౌంట్ ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు రెస్టారెంట్ల యజమానులే యాప్‌కు ఇచ్చిన తమ సమాచారాన్ని అంటే డీల్స్ వివరాలు, డిస్కౌంట్ కూపన్లు ఎన్ని ఇచ్చేది ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. అంతే కాదండోయ్ సందడి పెద్దగా ఉండని సమయాల్లో టేబుళ్లను కస్టమర్లతో నింపేందుకు, రెస్టారెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకూ ఈ యాప్ చక్కగా వాడుకోవచ్చు.

రెస్సీ కస్టమర్ యాప్

కస్టమర్ల కోసం రూపొందించిన రెస్సీ యాప్‌తో సమీపంలో ఏఏ రెస్టారెంట్లు ఉన్నాయి, అవి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఏదైనా రెస్టారెంట్‌కి వెళితే అక్కడ లభించే డిస్కౌంట్‌ను తెలుపుతుంది. ప్రతి రూ.1,000 వ్యయంపై కస్టమర్లు రూ.50 విలువైన లాయల్టీ పాయింట్లు పొందొచ్చు. ఈ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌కు, బుక్‌మైషోలో టికెట్ల కొనుగోలుకు, ఫోన్ బిల్లుల చెల్లింపుకు వాడొచ్చు. కస్టమర్ కావాలంటే ఉబర్ వాహనంలో రెస్టారెంట్‌కి వెళ్లి వచ్చేందుకూ యాప్‌లో ఏర్పాట్లు ఉన్నాయి.

విస్తరణ దిశగా రెస్సీ

గూగుల్ ప్లే స్టోర్‌లో రెస్సీ యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం పుణేలో రెస్సీ అడుగుపెట్టింది. 40కిపైగా ప్రముఖ రెస్టారెంట్లతో చేతులు కలిపింది. సెప్టెంబరుకల్లా 500 రెస్టారెంట్లు, 40,000 కస్టమర్లను దక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. 18 నెలల్లో మరో 11 నగరాల్లో ప్రవేశించనుంది. తద్వారా 5,000 రెస్టారెంట్లు, 10 లక్షల మంది కస్టమర్లకు చేరుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. నిధుల సమీకరణలోనూ నిమగ్నమైంది. బెంగ ళూరులో జరిగిన లెస్‌వెంచర్ నిర్వహించిన లెట్స్‌ఇగ్నైట్ స్టార్టప్ కాంపిటీషన్‌లోనూ ప్రెజెంటేషన్ ఇచ్చింది.

జోరుమీదున్న మార్కెట్

ఫుడ్, బెవరేజ్ సేవల మార్కెట్ పరిమాణం దేశంలో 48 బిలియన్ డాలర్లుంది. రెస్టారెంట్ డిస్కవరీ విభాగంలో జొమాటో, ఫుడ్ డెలివరీ రంగంలో ఫుడ్ పాండా అగ్రస్థాయిలో ఉన్నాయి. చాలా కంపెనీలే ఉన్నా చివరి నిముషంలో డిస్కౌంట్లను ప్రకటించే సౌకర్యంపై ఎవరూ దృష్టిసారించలేదని సాగర్ చెబుతున్నారు.