ఏడాదిలోనే కోటి రూపాయల ఆదాయం చూసిన లాజిస్టిక్స్ సంస్థ 'షిప్‌డెస్క్'

ఏడాదిలోనే కోటి రూపాయల ఆదాయం చూసిన లాజిస్టిక్స్ సంస్థ 'షిప్‌డెస్క్'

Sunday October 25, 2015,

2 min Read

కాలికి తొడిగే చెప్పుల నుంచి నెత్తిన పెట్టుకునే హెల్మెట్ వరకు అంతా ఆన్ లైన్ అయిపోయిందిప్పుడు. ఏం కావాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికి తెచ్చుకుంటున్నారు కస్టమర్లు. ఫలితంగా ఆన్‌లైన్ రీటైల్ పరిశ్రమ ఓ రేంజ్‌లో ఊపందుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ఈ-కామర్స్ లాజిస్టిక్స్‌లోనూ వృద్ధి కనిపిస్తోంది. 2018 నాటికి భారతదేశంలో ఆన్ లైన్ రీటైల్ వ్యాపారం లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. 2019 నాటికి ఈ-కామర్స్ లాజిస్టిక్స్ 13 నుంచి 15 వేల కోట్లకు చేరుకుంటుందని మరో అంచనా. ఈ-కామర్స్ బిజినెస్ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలు. ఆర్డర్లు తీసుకోవడమే కాదు... వాటిని సమర్థవంతంగా కస్టమర్లకు అందజేసే లాజిస్టిక్స్ ప్రక్రియపై కంపెనీలన్నీ ప్రధానంగా దృష్టిపెట్టాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని, కొత్తకొత్త పద్ధతుల ద్వారా సరఫరా ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పలు కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే ఈ-కామర్స్ పై ఆధారపడ్డ లాజిస్టిక్స్ రంగం అస్తవ్యస్తంగా ఉంది. అయితే టెక్నాలజీ సాయంతో లాజిస్టిక్స్‌ని సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమంటోంది షిప్ డెస్క్. డిసెంబర్ 2014లో షిప్ డెస్క్‌ను ప్రారంభించారు లిప్జో జోసెఫ్, శ్రీకృష్ణ బీవీ. క్లౌడ్ బేస్డ్ షిప్పింగ్ సొల్యూషన్‌తో ఆన్ లైన్ వ్యాపారులకు సేవలందిస్తున్న సంస్థ ఇది.

"షిప్ డెస్క్‌తో ఆన్ లైన్ వ్యాపారులు భాగస్వాములైతే, ఆన్ లైన్ ఆర్డర్లకు సంబంధించిన సమాచారమంతా క్లౌడ్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది లాజిస్టిక్స్ కంపెనీలకు ఉపయోగకరంగా ఉంటుంది. షిప్పింగ్ కోసం వారి టీంను వెంటనే పంపొచ్చు. ఇది షిప్పింగ్‌ని సులభతరం చేసి వ్యాపారులకు లాభాలను అందిస్తుంది" అంటారు లిప్జో.

షిప్పింగ్ ధరలను తక్కువగా ఆఫర్ చేసే సంస్థల్నే కస్టమర్లు ఎంచుకునే అవకాశం ఉంటుందిక్కడ. అంతేకాదు... ఆర్డర్ ట్రాకింగ్, డాటా ఫుల్‌ఫిల్‌మెంట్ లాంటివన్నీ రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది. షిప్పింగ్ కోసం సమయం, డబ్బు ఆదా చెయ్యడం, పోస్టల్ ఎర్రర్స్‌ని తగ్గించడం, కొనుగోలుదారులకు సమాచారం ఇవ్వడం లాంటివన్నీ షిప్ డెస్క్ ద్వారా అందే సేవలు.

image


ఏడాది తిరక్కుండానే కోటి రూపాయల ఆదాయం

ఇప్పటి వరకు షిప్ డెస్క్‌కి 550 మంది యూజర్లున్నారు. నెలనెలా 150 మంది కొత్తగా చేరుతున్నారు. Zingohub, Frekart, Budli.in, Dailycatcher, Nivysfashion, Kamalsbotique, Zarasbotiques లాంటి ఆన్ లైన్ సెల్లర్స్ భాగస్వాములుగా ఉన్నాయి. నెలనెలా 40 శాతం వృద్ధి కనిపిస్తోంది. కోటి రూపాయల పెట్టుబడితో ప్రారంభమైందీ సంస్థ. సేల్స్, మార్కెటింగ్, టెక్నాలజీ వనరుల కోసమే పెట్టుబడిలో ఎక్కువగా ఖర్చుచేశారు. వీరికి రెండు రెవెన్యూ మోడల్స్ ఉన్నాయి. ఒకటి షిప్‌మెంట్స్ పై వచ్చే మార్జిన్, మరొకటి సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూ. ఏడాది తిరక్కుండానే కోటి రూపాయల వార్షికాదాయాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఆన్ లైన్ రీ-సెల్లర్స్‌పై దృష్టిపెట్టిన షిప్ డెస్క్... త్వరలో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటోంది.

సవాళ్లు, భవిష్యత్తు వృద్ధి

సామర్థ్యం, ఒకే తరహా డిమాండ్ లేకపోవడం, అసమర్థత లాంటివి లాజిస్టిక్స్ రంగంలో ప్రధాన సవాళ్లు. ఇండియాలో పది లక్షల ఆన్ లైన్ సెల్లర్స్ ఉన్నారు. వాటి ద్వారా షిప్ డెస్క్ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటోంది. ఈ సొల్యూషన్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. సింఘీ అడ్వైజర్స్ ఇటీవల ఇచ్చిన లాజిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం గత ఐదేళ్లలో వృద్ధి రేటు 16 శాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ వ్యాపారం 2013లో నాలుగు ట్రిలియన్ల యూఎస్ డాలర్ల వ్యాపారం చేసిందని అంచనా. అంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ఇది పదిశాతం అన్నమాట. ఫెడెక్స్, బ్లూడార్ట్, డెల్హీవరీ, ఇకామ్ ఎక్స్ ప్రెస్, ఇకార్ట్, గోజావాస్ తో పాటు లోకల్ కొరియర్ కంపెనీలు పోటీదారులు. కాంపిటీషన్ ను, సవాళ్లను ఎదుర్కొవడానికి తమ దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉందంటారు జోసెఫ్. ఇటీవల మొబైల్ యాప్ లాంఛ్ చేసిన షిప్ డెస్క్ విస్తరణకు మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది.