మాటల్లేవ్..! మాట్లాడుకోవడాల్లేవ్..!! చేతల సమయం ఆసన్నమైంది!

అట్టహాసంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం

మాటల్లేవ్..! మాట్లాడుకోవడాల్లేవ్..!! చేతల సమయం ఆసన్నమైంది!

Saturday January 21, 2017,

2 min Read

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పట్టాభిషేకం అతిరథమహారథుల మధ్య అట్టహాసంగా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ చారిత్రక సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్‌ పెన్స్‌ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశాధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అమెరికన్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ట్రంప్ అన్నారు. ప్రజా పాలన తిరిగి వచ్చిందని.. వారికే అధికారాన్ని బదిలీ చేస్తామని తెలిపారు. అమెరికా గమ్యస్థానాన్ని అందరం కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. మనదంతా ఒకే దేశం- ఒకే హృదయం అని పేర్కొన్నారు. ఇది మీరోజు.. ఈ విజయం మీది.. అమెరికా మీ దేశం అని ట్రంప్ అనగానే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు మిన్నంటాయి.

image


అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉంటుందని ట్రంప్‌ చెప్పారు. ఇకనుంచి తీసుకునే ప్రతీ నిర్ణయం అమెరికా ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఉంటుందన్నారు. అమెరికన్ల శ్రామికులతోనే అమెరికా పునర్‌ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుదామన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని, పక్క దేశాల చొరబాట్ల నుంచి మన సరిహద్దులను రక్షించుకుందామని ట్రంప్ పిలుపునిచ్చారు.

ఇకపై వేసే ప్రతీ అడుగూ గెలుపు దిశగానే ఉంటుందని అన్నారు. అమెరికన్లకే ఉద్యోగాలిద్దాం.. అమెరిక్ వస్తువులనే కొనుగోలు చేద్దాం అని తెలిపారు. ఇక మాటల్లేవు.. చేతలే మిగిలాయని అన్నారు. ఇక నుంచి ప్రజలే పాలకులు.. మిమ్మల్ని ఎప్పుడూ తలదించుకోనివ్వను అని ట్రంప్ ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు దాదాపు 10 లక్షల మంది వాషింగ్టన్‌కు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి బరాక్ ఒబామాతో పాటు మాజీ అధ్యక్షులు బుష్, క్లింటన్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్ వీధులను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.

ఇదిలావుంటే, ట్రంప్‌ వ్యతిరేకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మాకోద్దీ అధ్యక్షుడు అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల ఉద్రిక్తత నెలకొనడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.