పోకర్ ప్లేయర్ నేర్పే సక్సెస్ సీక్రెట్స్..

"లక్ బై చాన్స్" తో సక్సెస్ రాదంటున్న కావ్లీన్ డిసౌజా

పోకర్ ప్లేయర్ నేర్పే సక్సెస్ సీక్రెట్స్..

Saturday April 02, 2016,

5 min Read


"విజయం అంటే ఆశించిన దాన్ని సాధించడం కాదు..సాధించాల్సిన దాన్ని ఆశించడం" విజయ తీరానికి చేరుకున్నావంటే దానికి కారణం అదృష్టంతోడు రావడం కాదు... నీ కృషి, పట్టుదల, ప్రతిభని పూర్తి స్థాయిలో వినియోగించడం...అది గ్యాంబ్లింగ్ అయినా అంట్రప్రెన్యూర్ షిప్ అయినా"

పోకర్ ఆటని అందరూ గ్యాంబ్లింగ్ గా భావిస్తారు. అదృష్టానిదే పెద్ద పీట అంటారు. మనకు స్కిల్స్ లేకపోయినా ఏదో ఒక నెంబరునో, అక్షరాన్నో కళ్లు మూసుకుని చెప్పేసి.. వస్తే లక్. లేకపోతే బ్యాడ్ లక్ అనుకుంటారు. చాలామంది స్టార్టప్ ప్రారంభిస్తున్న అంట్రపెన్యూర్లు లక్ మీదే ఎక్కువ ఆధారపడతారు. కష్టాన్ని నమ్మేవారు చాలా తక్కువ మంది. జీవితాన్ని పణంగా పెట్టి ప్రారంభించిన అంట్రప్రెన్యూర్ షిప్ గేమ్ లో లక్ నే నమ్ముకుంటే విజయం ఎలా దగ్గరకు వస్తుంది..?. ఓ మంచి బిజినెస్ మెన్ తన ప్రయత్నాలను సంపూర్ణంగా విశ్వసించి ఆచరణ ప్రారంభిస్తాడు. ప్రతి ముందడుగునూ తన ముద్ర చూపిస్తాడు. విజయం సాధించేవరకూ వెనక్కి తిరిగి చూడడు.

ఓ పోకర్ ప్లేయర్ స్టార్ గా మారడానికి... ఓ స్టార్టప్ అంట్రపెన్యూర్ ... విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదగడానికి మధ్య అదృష్టానికి ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరిది ఒకటే దారి... "ప్రతిభను నమ్ముకుని పయనం సాగించడం"

ఇరవై ఆరేళ్ల క్లావిన్ డిసౌజా... ఇప్పుడు పోకర్ గేమ్ లో పేరున్న ప్లేయర్. సూపర్ నోవా స్టేటస్ కు దగ్గరైన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్. 2008లో ఆట ప్రారంభించిన దగ్గర్నుంచి ఇప్పటికి 35 టైటిల్స్ గెలిచాడు. నిర్ణయాలే గెలిపిస్తాయి కానీ అదృష్టం కాదని కుండబద్దలు కొట్టి చెబుతారు డిసౌజా. అదృష్టమనే మాటనే నమ్మని... క్లావిన్ డిసౌజా ... పోకర్ గేమ్ సక్సెస్ క్రెడిట్స్ లో కొన్ని పాయింట్స్...

image


మొదటి అడుగు

క్లావిన్ డిసౌజా పోకర్ లో ఇప్పుడు పేరు మోసిన ఆటగాడే. కానీ ప్రత్యేకంగా తీసుకున్న శిక్షణ ఏమీ లేదు. మొదట్లో ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. స్కూల్ సమయంలో గంటల తరబడి ప్రాక్టీస్ కూడా చేసేవారు. కానీ తన వయసులో ఉన్న పిల్లలు ఎంతో మంది అప్పటికే అనుభవజ్ఞుల దగ్గర ట్రైనింగ్ పొంది... తనను దాటిపోయారని తెలుసుకునేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. తొమ్మిదో తరగతి వరకు మ్యాథ్స్ అంటే డిసౌజాకు అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్. కానీ సంధ్యారామన్ అనే సహ విద్యార్థిని ఫ్రెండ్ గా మారిన తర్వాత క్లావిన్ కు మ్యాథ్స్ ఓ గేమ్ లా మారింది. బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీలో బీబీఎస్ చదువుతున్నప్పుడు ఫేస్ బుక్ లో పోకర్ గేమ్ పరిచయం అయింది. యూనివర్శల్ గా ప్రతిభ చూపే అవకాశం ఆ గేమ్ ద్వారా వస్తుందని భావించాడు. ఆన్ లైన్ లోనే బేసిక్ స్ట్రాటజీస్ ను నేర్చుకుని ఆట ప్రారంభించాడు. మొదట్లో ఆటలోని ఒక్క పదం అర్థం కాకపోయినా ... పట్టుదలగా ముందుగా సాగాడు. సైకాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్ లను పోకర్ లోకి అన్వయించి తనలోని పోటీ తత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించేవాడు. మిలియన్ ప్లే చిప్స్ సాధించడానికి గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని పోకర్ ఆడుతూనే ఉండేవాడు.

పరాజయం నేర్పిన పాఠం

ఫేస్ బుక్ యాప్ లో మిలియన్ ప్లే చిప్స్ సాధించిన తర్వాత విజయం తన ముంగిటే ఉందనుకున్నాడు క్లావిన్. అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా మనీతో గేమ్ లోకి దిగిపోయాడు. కానీ మొదటి గేమ్ లో ఉన్నది మొత్తం ఊడ్చుకుపోవడానికి ఎక్కువ సేపు పట్టలేదు. అప్పుడు కానీ తను పోకర్ గేమ్ లో ఏ స్థాయిలో ఉన్నది అర్థం కాలేదు. కొన్ని వేల స్టెప్స్ ఉన్న పోకర్ గేమ్ లో తానింకా మొదటి మెట్టుపైనే ఉన్నట్లు గుర్తించాడు. అవి ఎక్కడానికి కావాల్సింది అదృష్టం కాదని.. ప్రావీణ్యం సంపాదించడమేనని గుర్తించాడు. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు..ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుందనే మాటను క్లావిన్ డిసౌజా గుర్తించాడు. అందుకే తొలిసారి ఎదురైన ఘోరపరాజయం క్లావిన్ మనసులో మరో ఆలోచన రానీయలేదు. పోకర్ గేమ్ రహస్యాలు దాగి ఉన్న కోడ్ ని క్రాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆన్ లైన్ లో పోకర్ ప్లేయర్స్ కోసం పెట్టే గేముల్ని ఆడేవాడు. వాటి కోసం ఆన్ లైన్ లో స్ట్రాటజీలు వెతికి స్ట్రాంగ్ ఫౌండేషన్ రూపొందించుకునేవాడు. ఇలా పోకర్ గేమ్ లో నైపుణ్యాన్ని స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నాడు.

దారి చూపిన నిర్ణయం

పోకర్ లో మొట్టమొదట ఎదురైన పరాజయం తర్వాత నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు క్లావిన్. తను రాణించగలనని నమ్మకం పెరిగిన తర్వాత 2008లో ఓ కంపెనీలో బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ప్రొఫెషనల్ గా మారాడు. నిజానికి పోకర్ ని బారత్ లో ప్రొఫెషనల్ గా స్వీకరించడానికి సిద్ధపడిన మొట్టమొదటి ప్లేయర్ క్లావిన్ డిసౌజా. ఆ నిర్ణయం తీసుకున్న రోజున డిసౌజా ఏ మాత్రం కంగారు పడలేదు. పోకర్ లో తాను సాధించిన స్కిల్స్ ..తన హార్డ్ వర్క్ పై ఎంతో నమ్మకముంచాడు. అది వమ్ము కాలేదు కూడా. ఆట ప్రారంభించిన పద్దెనిమిది నెలల్లోనే రూ. 10లక్షల రూపాయలు గెల్చుకున్న పోకర్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. విజయరహస్యం అనేది అర్థం లేని మాట.. విజయం వెనుక రహస్యాలుండవు.. వైఫల్యాలు మాత్రమే ఉంటాయని నిరూపించారు క్లావిన్ డిసౌజా.

image


అడ్డంకులు

పోకర్ గేమ్ అంటే ఇండియాలో ఇప్పటికీ జూదమనే అభిప్రాయం ఉంది. గేమింగ్ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. అయితే కర్నాటక, బెంగాల్, గోవా, సిక్కిం రాష్ట్ర హైకోర్టులు పోకర్ స్కిల్డ్ గేమ్ అని స్పష్టంగా ప్రకటించాయి. అయితే పేకముక్కలతో ఆడే ప్రతీ ఆట పేకాటగానే భావిస్తున్నారు ప్రజలు. పేకాట అంటే గ్యాంబ్లింగ్ గా ఫిక్సైపోయారు. అయితే యువతరంలో మాత్రం ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మార్పు కనిపిస్తోంది. పోకర్ ఆటలో మొదట 80 శాతం స్కిల్ ...20 పర్సెంట్ లక్ కి ప్రాధాన్యం ఉంటుంది. కానీ అనుభవం పెరిగిన తర్వాత వందశాతం స్కిల్ ఆధారంగానే ఆడాల్సి ఉంటుంది. ఈ గేమ్ చెస్ లాంటిదే అనుకుంటాడు క్లావిన్ డిసౌజా. గేమ్ ఫలితం అంతా నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుందంటారు. రిజల్ట్ ఒరియెంటెడ్ కాదని... డెసిషన్ ఒరియెంటెడ్ గేమ్ అంటారు క్లావిన్. యువత ఆలోచనల్లో వస్తున్న మార్పు కారణంగా పోకర్ కి గ్రేట్ ఫ్యూచర్ ఉందని నమ్ముతున్నారు. స్పార్టాన్, పోకర్ హై, బాజీ లాంటి పోకర్ గేమింగ్ వెబ్ సైట్లు పోకర్ కి ఆదరణ పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటున్నారు.

గెలుపుబాట

పోకర్ ప్రొఫెషనల్ గా మారిన తర్వాత క్లావిన్ ఓ రోజులో గెలుచుకున్న మొత్తం రెండున్నర లక్షల రూపాయలు. 2012లో కేవలం యాభై రూపాయల స్టేక్స్ తో ఏషియన్ పోకర్ టూర్ లో పాల్గొన్నాడు. ఓ రోజు గేమ్ లో రెండున్నర లక్షల రూపాయల స్టేక్స్ తో బయటకు వచ్చాడు. అతి తక్కువ స్టేక్స్ తో గేమ్ ప్రారంభించిన వారికి ఇలాంటి విజయం కల నిజమవడం లాంటిదేనంటారు డిసౌజా. ఈ విజయం పోకర్ సైట్లను సైతం ఆకర్షించింది. అందుకే ఓ అంతర్జాతీయ గేమింగ్ సైట్.. క్లావిన్ తో కోచ్ పదవి కోసం ఒప్పందం చేసుకుంది. దీంతో క్లావిన్ యూరప్ అంతా తిరిగి.. పోకర్ గేమ్ పై పాఠాలు చెప్పాడు. ఇండియన్ పోకర్ గేమ్స్ లో అయితే రోజుకు ఒక లక్ష స్టేక్స్ సంపాదించడం మహా గగనం. గత ఆరు నెలల్లో గోవాలో రెండు సార్లు ఈ ఘనత సాధించాడు క్లావిన్. ప్రస్తుతం గోవాలోని ప్రసిద్ధ క్యాసినో డెల్టిన్ రాయల్ లో జరుగుతున్న ఇండియన్ పోకర్ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. ఇంట్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు గేమింగ్ వెబ్ సైట్స్ లో పోకర్ ఆడుతూంటారు.

" ఆట కాకుండా... పోకర్ లో ఉండే విభిన్న పరిస్థితుల మధ్య ఉండే మేథమేటిక్స్ ను అంచనా వేయడానికి రోజుకు కొంచెం సమయం కేటాయిస్తూంటాను. వచ్చే ఏడాది వరల్డ్ పోకర్ సిరీస్ కు సిద్ధమవుతున్నాను" క్లావిన్ డిసౌజా

పోకర్ పాఠాలు

భారత్ లో జూదంగా భావించే ఆటలో స్కిల్స్ తోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్లావిన్ డిసౌజా... ఇప్పుడు యువతరానికి పాఠాలు చెబుతున్నారు. ఓ చిన్న స్థాయిలో పోకర్ కోచింగ్ ను ప్రారంభించారు. భారత్ లో పోకర్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ను తయారు చేయడమే తన లక్ష్యమంటున్నారు. తన ఆన్ లైన్ పోకర్ స్కూల్లో యువ ప్లేయర్స్ కు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే వ్యక్తిగతంగా కూడా కోచింగ్ ఇస్తున్నారు. ఎనిమిది సెషన్స్ లో ఒక కొత్త అయిన ఆటగాడిని విన్నర్ రేంజ్ కి తీసుకెళ్లేలా స్టక్చర్డ్, ఆర్గనైజింగ్ వ్యవస్థతో కోచింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆన్ లైన్ కోచింగ్ స్కూల్ ఉచితమే. కానీ మున్ముందు మెంబర్ షిప్ ఫీజు వసూలు చేసే ఆలోచనలో ఉన్నారు. స్ట్రాటజీ ఆర్టికల్స్, వీడియోలను తన ఆన్ లైన్ క్లాసుల్లో పెడుతున్నారు.

పోకరైనా... స్టార్టప్ అయినా నిరంతరం స్కిల్స్ ను డెలవప్ చేసుకోవడమే విజయానికి దగ్గరి దారి అని నిరూపించారు క్లావిన్. అదృష్టానిది మాట మాత్రమేనంటారు. నిజమే కదా..!