పారేసిన సిగరెట్ పీకలతో రోడ్డేస్తే చెక్కుచెదరట..!!

2

దునియా మే కోయీ చీజ్ నహీ బేఖార్ థీ అంటారు. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ లేదు. ఆఖరికి కాల్చి పారేసిన సిగరెట్ పీక కూడా. సిగరెట్ బట్స్ తో పర్యావరణానికి ముప్పుందని అనేక హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో.. వాటితో ఉపయోగం కూడా వుందన్న వార్త నిజంగా సంతోషమే కదా. అవును. మీరు చదివింది నిజం. పారేసిన సిగరెట్ పీకలతో ఎంచక్కా రోడ్ల గుంతల్ని పూడ్చేయవచ్చట.

ప్రతీ సంవత్సరం 6 ట్రిలియన్ల సిగరెట్ పీకలు భూమ్మీద పోగవుతున్నాయి. అంటే 1.2 మిలియన్ టన్నుల పీకలు వేస్టేజీ కింద పడుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 2025కల్లా ఆ బరువు యాభై శాతం పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న జనాభా, మారుతున్న అలవాట్లు పర్యావరణాన్ని మరింత కాలుష్యం చేస్తాయన్నది కఠోర వాస్తవం.

పదినుంచి పదిహేను సంవత్సరాల దాకా డీ కంపోజ్ కాని సిగరెట్ పీకల్ని తారులో కలిపి రోడ్డు వేస్తే ఆ రహదారి చెక్కుచెదరకుండా వుంటుందట. రోడ్డు ఎంతటి ట్రాఫిక్ నైనా తట్టుకుంటుందట. థర్మల్ కండక్టివిటీని కూడా తగ్గించే శక్తి సిగరెట్ పీకలకు ఉందని మెల్ బోర్న్ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.

మెల్ బోర్న్ ఆర్ఎంఐటీ యూనివర్శిటీలో లెక్చరర్ గా పనిచేసే అబ్బాస్ మోహజెరాని ఈ విషయంపై ఎడతెగని పరిశోధన చేశారు. సిగరెట్ పీకల నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు అబ్బాస్ ఎన్నో సస్టెయినబుల్ ప్రాక్టికల్ మెథడ్స్ ఉపయోగించారు. వందలాది టాక్సిక్ కెమికల్స్ తో తయారుకాబడిన సిగరెట్ పీకల్ని వేడిచేసిన తారులో మిక్స్ చేస్తే రోడ్డు వేస్తే దారినంతా ఇటుకలతో కప్పేసినంత గట్టిగా వుంటాయని తేల్చి చెప్పారు.

సో, ఇకపై సిగరెట్ పీకలతో భవిష్యత్ లో పర్యావరణానికి వచ్చే ముప్పేమీ వుండబోదు. అదే గనుక నిజమైతే భూమాత కాస్తంతైనా ఊపిరి తీసుకుంటుంది. చూద్దాం.. ఎంత టైంలో అది సాధ్యమవుతుందో..

Related Stories

Stories by team ys telugu