మొబైల్ యాడ్స్ ఛాంపియన్లు ఈ పాతికేళ్ల కుర్రాళ్లు

వీడియోగేమ్స్ లో అంతర్భాగంగా యాడ్స్ సృష్టించి ఆదాయం ఆర్జిస్తున్న గ్రీడీ గేమ్స్

మొబైల్ యాడ్స్ ఛాంపియన్లు ఈ పాతికేళ్ల కుర్రాళ్లు

Wednesday May 11, 2016,

5 min Read


"యస్... 1796 లెవల్ కంప్లీటెడ్.."

పిడికిలి బిగించి మోచేతిలో ముందుకు, వెనక్కి ఊపే ఇలాంటి మూమెంట్స్.. క్యాండిక్రష్ వీడియోగేమ్ వ్యసనంగా మారిన వారి నుంచి రోజుకు ఒక్కసారైనా వస్తాయి. కానీ అంతకంటే ఎక్కువసార్లు... అంటే కనీసం పదుల సంఖ్యలో ఫోన్ ని నేలకేసి కొట్టాలన్నంత చిరాకు కూడా వస్తుంది. గేమ్ పై విసుగెత్తి కాదు. గేమ్ మంచి రసపట్టులో ఉన్నప్పుడు వచ్చే పాప్ అప్, బ్యానర్ యాడ్స్ వల్ల. ఇలా ఆకస్మాత్తుగా వచ్చే ప్రకటనల వల్ల తన్నుకొచ్చే చిరాకు అంతా ఇంతాకాదు. ఒక్క క్యాండిక్రష్ అనే కాదు.. ఏ వీడియోగేమ్ ఆడుతున్నా.. పానకంలో పుడకల్లా పాప్ అప్ యాడ్స్, స్క్రోలింగ్ యాడ్స్ లాంటి డిస్ట్రబెన్స్ వస్తే ఫోన్ ని నేలకేసి కొట్టాలన్న కసి వస్తుంది. చివరికి చాలా మంది గేమ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆన్ లైన్ డాటా క్లోజ్ చేసి.. ఆ తర్వాత ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల కొంచెం గేమ్ లో ఫీల్ మిస్సవుతుంటారు. ఇలాంటి ఇబ్బందిని తమ మిత్రుల వద్ద గమనించారు... అర్పిత్ జైన్, అర్నిక్ శర్మ.

ఐఐటి రోపర్ లో చదువుకున్న ఇరవై ఆరేళ్ల అర్పిత్, ఇరవై నాలుగేళ్ల అర్నిక్... మంచి మిత్రులు. వీరు వీడియోగేమ్స్ కు ఎడిక్ట్ కాలేదు కానీ... తమ మిత్రులను దగ్గరగా పరిశీలించారు. వీడియోగేమ్స్ మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు వాళ్లెంత అసహనానికి గురవుతారో ప్రత్యక్షంగా గమనించారు. నిజానికి కాలేజీలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఎనాక్టస్ అనే కొత్త కాన్సెప్ట్ మీద ఎక్కువగా చర్చించుకునేవారు. సంప్రదాయ పద్దతులకు భిన్నంగా బిజినెస్ మోడల్స్ ను డెవలప్ చేసేలో ఓ ఫోరమ్ బిల్డ్ చేద్దామనుకున్నారు. కానీ త్వరగానే దాన్ని వదిలేశారు. చదువయిన తర్వాత వీరిదృష్టి వీడియో గేమ్ పై పడింది. తమ మిత్రులు వీడియో గేములు ఆడుతున్నప్పుడు పడుతున్న ఇబ్బందిని స్వయంగా గమనించారు. దాంతోనే వారికి ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. అదే యాడ్స్ అవసరం లేని వీడియోగేమ్స్. దాని ఫలితమే "గ్రీడీగేమ్స్" ఆవిష్కరణ

ఆటలోనే ప్రకటలు

వీడియో గేమ్ లోనే ఇన్ బ్రాండింగ్ ప్రకటలు గ్రీడీ గేమ్స్ ప్రత్యేకత. వీరి గేముల్లో ఎలాంటి పాప్ అప్ యాడ్స్, ఇతర అడ్డదిడ్డమైన ప్రకటనలు వచ్చి చికాకు పెట్టవు. కానీ ఆటలోనే ప్రకటనలు ఉంటాయి. రేసింగ్ గేమ్ అయితే రోడ్డు పక్కన సైన్ బోర్డులు, కారు డోర్ల పైనా ప్రకటన, రోడ్డు పక్కన వచ్చే ధాబాలు, డ్రైవర్ ధరించే దుస్తుల మీద ప్రకటనలు.. ఇలా మొత్తం కలర్ ఫుల్ ఇన్ బ్రాండింగ్ లోనే ఉంటాయి. ఇవన్నీ గేమ్ ఆడేవారి ఆసక్తిని మరింత పెంచుతాయి కానీ ఏ మాత్రం చిరాకు పెట్టవు. కొంతకాలం పరిశోధన చేసిన తర్వాత 2015 మార్చిలోనే వీరు గ్రీడీగేమ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. వాటి ద్వారా వీడియోగేమ్ కంటెంట్ క్రియేటర్లకు ఓ ఫ్లాట్ ఫామ్ సృష్టించారు. వీరు అందించే సాంకేతిక సహకారంతో ఇన్ బ్రాండింగ్ యాడ్స్ తో గేమ్స్ డెవలప్ చేసేవారికి గ్రీడిగేమ్స్ మంచి ఫ్లాట్ ఫాంలా మారింది.

" గేమ్ లో అప్పటికే ఉన్న కంటెంట్ ను కూడా వాడుకుంటాం. బ్రాండ్స్ ను కూడా గేమ్ లోకి తెస్తాం. అవి క్యారెక్టర్స్ రూపంలో లేదా.. ఆబ్జెక్ట్స్ రూపంలో గేమ్ లో సెంటర్ పాయింట్ గా ఉంటాయి."- అర్పిత్, గ్రీడి గేమ్స్ ఫౌండర్

విభిన్నమైన యాడ్ గేమ్

వీడియో గేమ్స్ లో కాకపోయినా.. ఇతర విభాగాల్లో ఇదే తరహాలో యాడ్స్ అందిస్తున్నాయి ఇన్ మోబీ, గూగుల్ యాడ్ మోబ్. కానీ తమది వాటితో పోలిస్తే చాలా ప్రత్యేకమైనదని ఈ యువ అంట్రప్రెన్యూర్లు అంటున్నారు. గ్రీడీగేమ్స్ మీడియం డ్రివెన్ ఫ్లాట్ ఫాం కాదని... కంటెంట్ డ్రివెన్ అని స్పష్టంగా చెబుతున్నారు. తమ ఫ్లాట్ ఫామ్ లో యాడ్స్ రోడ్డుపక్కన ఉండే బిల్ బోర్డులు, క్యారెక్టర్లు, ఆబ్జెక్టులతో అంతర్భాగంగా ఉంటాయని వివరిస్తున్నారు. ఇవి ప్రకటలు అని ఏ మాత్రం అనిపించకుండా... ఇంటెలిజెంట్ గా వీటిని గేమ్ లో అంతర్భాగం చేస్తున్నారు. దీనివల్ల గేమ్ ఆడేవారికి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. మాములుగా అయితే పాప్ అప్స్, బ్యానర్ యాడ్స్ తో చిరాకు తెప్పిస్తాయి.

పెద్ద సంస్థలు.. పెద్ద పెద్ద బ్రాండ్లు

గ్రీడీగేమ్స్ ఇప్పటి వరకు దాదాపు యాభై వీడియో గేమ్స్ ను ఇలా ఇన్ బ్రాండింగ్ యాడ్స్ తో విడుదల చేసింది. ఇవన్నీ మంచి ఆదరణ పొందుతున్నాయి. వీటిలో 30కి పైగా పెద్దపెద్ద సంస్థలు రూపొందించిన వీడియో గేమ్సే. గ్రీడీ గేమ్స్ ఫ్లాట్ ఫాం వాడుకుంటున్న కంపెనీల జాబితాలో డిస్నీ, నజారా, గేమ్స్ టు విన్ లాంటి సంస్థలు ఉన్నాయి. గ్రీడీగేమ్స్ లో ప్రకటనలు ఇచ్చే సంస్థల్లో ఎమ్మెన్సీలు కూడా ఉన్నాయి. ఇరవై ఐదు పెద్ద బ్రాండ్లు గ్రీడీగేమ్స్ తో ప్రచారం పొందుతున్నాయి. పెప్సీ, ఎయిర్ టెల్, క్వికర్, ఫాస్ట్ ట్రాక్, ఓలా, ఫ్లిప్ కార్ట్, వెస్పా లాంటి బ్రాండ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే గ్రూప్ ఎం, డెంట్సు లాంటి ఏజన్సీలతో కలసి పనిచేస్తున్నారు.

గ్రీడిగేమ్స్ ఫౌండర్లు<br>

గ్రీడిగేమ్స్ ఫౌండర్లు


ఇన్ కమ్ గోల్ కొట్టారు..!

ఇన్ బ్రాండింగ్ గేమ్స్ తో బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దీని ప్రకారం సెషన్ల వారీగా ఆయా బ్రాండ్ల నుంచి బిల్లు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్లేయర్ గ్రీడీగేమ్స్ లో ఉన్న వీడియో గేమ్.. ఆరవై సెకన్ల కన్నా ఎక్కువగా లైవ్ లో ఉంచితే.. ఓ సెషన్ గా పరిగణిస్తారు. అలా ముందుగా సంస్థ వేసిన లెక్కల ప్రకారం సెషన్లను డిసైడ్ చేస్తారు. ఆ గేమ్ లో ఉన్న బ్రాండ్లకు ఆ సెషన్ల వారీగా చార్జ్ చేస్తారు. ఇప్పటికైతే వెయ్యి సెషన్స్ కు ఎనిమిది నుంచి పది డాలర్లు వసూలు చేస్తున్నారు. అయితే ఈ ధర యూజర్ ఇంటరాక్షన్, ఇంటర్నల్ ఎనలిటిక్స్ ను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పటికీ ఓ స్టాండర్డ్ ప్రైసింగ్ సిద్ధం చేయలేదని అర్పిత్ చెబుతున్నారు. కొంచెం స్థిరపడిన తర్వాత ఈ విషయంలో ఆలోచన చేద్దామనుకుంటున్నారు. ఇప్పటికి గ్రీడీగేమ్స్ యూజర్స్ పది లక్షలకు చేరుకున్నారు. నెలకు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల ఆదాయం వరకూ సంస్థ ఆర్జిస్తోంది.

భవిష్యత్ ప్రణాళికలు

గత ఏడాది సెప్టెంబర్ లో టైమ్స్ ఇంటర్నెట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ మాజీ బాసులు ఎంజెల్ ఇన్వెస్టర్లగా గ్రీడిగేమ్స్ లో రెండు లక్షల డాలర్ల పెట్టుబడిని పెట్టారు. వచ్చే ఆరు నెలల్లో సౌత్ ఈస్ట్ ఏషియాతో పాటు మిడిల్ ఈస్ట్ లోనూ అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే మూడు నెలల్లో సీరిస్ ఏ ఫండ్స్ ను రైజ్ చేయాలని చూస్తున్నారు. కొత్త పెట్టుబడులతో వీడియోల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు.

ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇన్ బ్రాండింగ్ వీడియోల మీద ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాయి. గ్రీడీగేమ్స్ కూడా ఇదే ఫ్లాట్ ఫామ్ లో తమ సేవలు విస్తరించాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రైట్ బ్రాండ్ కి రైట్ వీడియో మేకర్ అనే కాన్సెప్ట్ తో గ్రీడీగేమ్స్ బృందం పనిచేస్తోంది. గేమ్స్ విషయంలో నెలకు డెభ్బై నుంచి ఎనభై శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

భారత్ లో గ్రీడీగేమ్స్ తరహాలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ PLAKC. అయితే గ్రీడీగేమ్స్ వచ్చే మూడు నెలల్లో సీరిస్ ఏ ఫండింగ్ పొంది గ్లోబల్ గా విస్తరించాలని ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ కు చెందిన మీడియా స్పైక్, అమెరికా నుంచి ర్యాపిడ్ ఫైర్ ప్రపంచంలో ఇదే ఫ్లాట్ ఫాంలో సేమ్ టెక్నాలజీతో విజయవంతమైన సంస్థలుగా నడుస్తున్నాయి. వీటికి గ్రీడిగేమ్స్ సవాల్ విసురుతోంది.

మొబైల్ యాడ్స్ దే రాజ్యం

మొబైల్ ఎడ్వర్ టైజింగ్ ఐదేళ్ల కిందట ఇరవై ఐదు మిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాదికే ఈ మొత్తం ఎనభై మిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఏడాదికి అరవై నుంచి డెభ్బై శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. పారిశ్రామిక, వాణిజ్య రంగాలన్నీ రెండు నుంచి నాలుగుశాతం తమ ప్రచార బడ్జెట్ లో మొబైల్ ఎడ్వర్ టైజ్ మెంట్స్ కు కేటాయిస్తున్నాయి. ఈ అంచనాలతో రాబోయే రోజుల్లో మొబైల్ అడ్వర్ టైజ్ మెంట్స్ పెద్ద వ్యాపార అవకాశంగా మారబోతున్నాయని ఈజీగా అర్థమవుతోంది. దీన్నిక్యాచ్ చేసేందుకు గ్రీడీగేమ్స్ బృందం సన్నద్ధమయింది. 

వెబ్ సైట్