ఇండియన్ ఐడల్ ఎత్తుకుని రారా వీరా..!!  

0

రేవంత్. పెద్దగా పరిచయం అక్కర్లేని సింగర్. అటు బుల్లితెరకు, ఇటు వెండితెరకు ఆయన పేరు సపరిచితం. బాహుబలి ద బిగినింగ్ లో రేవంత్ పాడిన మనోహరి పాట జనాన్ని ఒక ఊపు ఊపింది. తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న రేవంత్.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్-9లో టాప్ 5 రౌండ్ లోకి అడుగుపెట్టాడు. హిందీ భాష మీద అంతంతమాత్రమే పట్టున్నప్పటికీ, ఉత్తరాది గాయకులను వెనక్కి నెట్టి.. తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించాడు. ఇన్నాళ్లూ ఆదరించిన అభిమానులు ఇండియన్ ఐడల్ కాంపిటిషన్ లో తనకు ఓటేసి గెలిపించాలని కోరాడు. మూడున్నర నెలల సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత, రేవంత్ కాస్తంత వెసులుబాటు కల్పించుకుని హైదరాబాద్ వచ్చి, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.

సోనీ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఐడల్ కాంపిటిషన్ ఎంత టఫ్ గా తెలిసిందే. ఉత్తరాది గాయకుల హవా మాత్రమే నడిచే వేదిక మీద, తెలుగు వాడు టైటిల్ కొట్టడమంటే అంత ఆషామాషీ కాదు. ప్రస్తుతం నడుస్తున్న 9వ సిరీస్ కూడా హోరాహోరీగానే ఉంది. ఐదో రౌండ్ నుంచి సగం జడ్జిమెంట్.. సగం ఓటింగ్ వుంటుంది. ఇక్కడి నుంచే ఎలిమినేష్ మొదలువుతుంది. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ పోటీ గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 2న జరగబోతోంది.

ఆల్రెడీ తెలుగు సినీ పరిశ్రమలో వర్ధమాన గాయకుడిగా పేరుతెచ్చుకున్న రేవంత్.. ఇండియన్ ఐడల్ లో పాల్గొనడానికి ఒకే ఒక కారణం అతని మామయ్య. కారుణ్యకు అతను పెద్ద ఫ్యాన్. నువ్వెందుకు ట్రై చేయకూడదు రేవంత్ అని చాలాసార్లు అడిగేవాడు. గెలుపు సంగతి తర్వాత.. ముందు పార్టిసిపేట్ చేయమని ప్రోత్సహించాడు. అలా రేవంత్ ఇండియన్ ఐడల్ వేదిక మీద మైక్ పట్టుకున్నాడు.

ఇప్పటికే తెలుగులో 200 వరకు పాటలు పాడాడు. ఈ టైంలో సడెన్ గా ఇండియన్ ఐడల్ కాంపిటిషన్ లో ఎంటరైతే అవకాశాలు వస్తాయా రావా అన్న సందేహం రేవంత్ ని వెంటాడింది. పైగా హిందీ పెద్దగా తెలియదు. అయినా సరే పెర్ఫామెన్స్ మీద నాకు నమ్మకముంది కాబట్టే ఆ డెసిషన్ తీసుకున్నా అన్నాడు. తోటి గాయకులు కూడా ఎంకరేజ్ చేశారు. ఉత్తరాది వాళ్లూ రిసీవ్ చేసుకున్నారు. హిందీ డిక్షన్, పదాలకు అర్ధాలు, హావభావాలు అన్నీ నేర్పించారు. ప్రతీ రోజూ ప్రాక్టీస్. ఎవ్రీ వీకెండ్ షూటింగ్. మూడు నెలలుగా విరామం లేదు. ప్రతీ వారం టఫ్ కాంపిటిషన్. ఈసారి నుంచే వోటింగ్ ని బట్టి ఎలిమినేషన్ వుంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఓటేసి మద్దతు ప్రకటించాలని రేవంత్ కోరాడు.

ఎలా చేయాలంటే..

ఏం లేదు.. సింపుల్. మొబైల్ లో సోనీ లైవ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రేవంత్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లేదంటే సోనీ లైవ్ డాట్ కామ్ ద్వారా కూడా ఆన్ లైన్ ఓటింగ్ లో పాల్గొనవచ్చు. ప్రతీ శనివారం రిజల్ట్. సండే వోటింగ్. ప్రతీ ఆదివారం రాత్రి 8 గంటల నుంచి తెల్లారి ఉదయం 7 వరకు ఓటేయొచ్చు. జీ మెయిల్ నుంచి లాగిన్ అయి ఓటు వేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు.

సోనీ టీవీవాళ్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో దక్షిణాది వాళ్లు చివరి రౌండ్ దాకా రావడం అనేది అరుదు. అయితే ఈసారి విచిత్రంగా టాప్ 14లో నలుగురు సౌత్ వాళ్లు వచ్చారు. టాప్ 8లో కూడా నలుగురు దక్షిణాది వాళ్లే నిలిచారు. టాప్ ఫైవ్ లో రేవంత్ ఉన్నాడు.

"కాంపిటీషన్ చాలా టఫ్ గా వుంది. ఉత్తరాది వాళ్లు బాగా సపోర్ట్ చేశారు. లాంగ్వేజ్ తో సంబంధం లేదు. టాలెంటే ముఖ్యం. అవకాశం వున్నప్పుడల్లా భాష నేర్చుకుంటున్నాను. పాడామా వెళ్లామా అన్నట్టు కాకుండా, పాటను ఒక ఫీల్ తో ఎంజాయ్ చేసేలా పాడుతాను. అదే ఆటిట్యూడ్ నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. సింగింగ్ ఒక్కటే కాదు, మిమిక్రీ, డాన్స్ కూడా చేస్తాను"-రేవంత్