బంగారం, నగలు, బ్రాండెడ్ బట్టలపై జీఎస్టీ నిర్ణయించిన టాక్స్ ఇదే..!!

బంగారం, నగలు, బ్రాండెడ్ బట్టలపై జీఎస్టీ నిర్ణయించిన టాక్స్ ఇదే..!!

Sunday June 04, 2017,

2 min Read

రెడిమేడ్ దుస్తులు, ఫుట్ వేర్ తో పాటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బంగారంపై ట్యాక్స్ ఖరారైంది. 15వసారి సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పలు కీలక వస్తువులపై టాక్స్ ఫైనల్ చేసింది. కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించడంతో పాటూ, మిగిలిన వస్తువులపై పన్నులు ఖరారు చేసేందుకు ఈ నెల 11న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ నిర్ణయించింది

image


జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలు తీసుకుంది. బంగారంతో పాటూ రెడీమేడ్ దుస్తులపై మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పన్నులు ఖరారు చేసింది. బంగారంపై 3శాతం ట్యాక్స్ విధించి, బంగారు నగలతో పాటూ ముడి వజ్రాలు, వెండిపై 3 శాతం జీఎస్టీ నిర్ణయించారు. ప్రస్తుతం బంగారంపై కనిష్టంగా 2 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ ఎక్కువగా ఉండటంతో పన్ను రేటు 6 శాతం కూడా ఉంది. ఈ నిర్ణయంతో పన్ను రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ప్రజలకు ఊరట కలుగనుంది.

ఇకపోతే, రెడీమేడ్‌ దుస్తులపై 12శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5 శాతం, చేనేతపై 18శాతం, రూ.1000లోపు వస్త్రాలపై 5 శాతం ట్యాక్స్ ఖరారు చేశారు. సిల్కు, జనపనార ఉత్పత్తులు, పూజా సామాగ్రికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. 500 లోపు ఉన్న పాదరక్షలపై 5 శాతం, 500 దాటిన ఫుట్ వేర్ పై 18 శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు.

బీడీలపై సెస్ తొలగించి దాన్ని 28శాతం శ్లాబ్ లో చేర్చారు. బీడీ ఆకులపై 18 శాతం ట్యాక్స్ ఖరారు చేశారు. బ్రాండెడ్‌ బిస్కెట్లపై 18 శాతం, సోలార్ ప్యానెల్స్ పై 5 శాతం చొప్పున పన్ను విధించారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల్లో కొన్నింటిపై 5శాతం, మిగిలిన వాటిపై 12శాతం టాక్స్ ఫైనల్ చేశారు.

ఢిల్లీలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్ధిక మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ బీడీలపై 28శాతం పన్నును వ్యతిరేకించారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయని ఆయన కౌన్సిల్ లో ప్రస్తావించారు. సాఫ్ట్ వేర్ అప్‌ డేట్ పై కూడా దృష్టిపెట్టాలని సూచించారు. సినిమా రంగంపై ప్రస్తుతం 28శాతం ఉన్న పన్నును 12శాతానికి తగ్గించాలని కోరినట్లు చెప్పారు ఈటెల.

ఇప్పటికే 95 శాతానికి పైగా వస్తువులు, సేవలపై పన్నులు ఖరారు చేసింది జీఎస్టీ కౌన్సిల్. మిగిలిన వాటిపై టాక్స్ ఫైనల్ చేసేందుకు ఈ నెల 11న మరోసారి సమావేశం కానున్నారు. కొన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలపై ఈ సమావేశంలో మరోసారి చర్చిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి జైట్లీ చెప్పారు.