ఈ కోటీశ్వరడు సంపాదించిన డబ్బంతా నాణేల్లోనే..!!

0

ఇవాళ రేపు పిల్లల చదువు ఎలా వుందంటే.. అయితే స్కూల్లోనో, లేదంటే ట్యూషన్‌లోనో, రెండూ కాదంటే హోంవర్క్ చేస్తూనో కనిపిస్తున్నారు. ఆట లేదు.. ఆటవిడుపూ లేదు. అకాడమిక్ సవాళ్లు వాళ్లను హంటర్‌తో తరుముతున్నాయి. కలలో కూడా పుస్తకాలు ర్యాంకులే తప్ప, అభిరుచి, అలవాటు అన్నమాటకు స్థానమే లేదు. నీ హాబీలేంటి అని అడిగితే రేడియో వినడం, కలం స్నేహం, కాయిన్ కలెక్షన్ అనే మాటలు ఒకప్పుడు వినిపించేవి. ఇప్పుడు అలాంటి మాటలు వినిపించడం లేదు. ఎక్కడో ఒకచోట కాయిన్ కలెక్షన్ అనే వర్డ్ చాలా అరుదుగా వినిపిస్తుంది. అలాంటి అరుదైన నాణేల సేకరణ చేసే వ్యక్తుల్లో ఒకరు మనీష్ ధమేజా.

వంద కాదు వేయి కాదు.. ఏకంగా లక్ష నాణేలు సేకరించాడు. అవి కూడా 500 శతాబ్దాల క్రితం కాయిన్స్. ఇన్ని నాణేలు సేకరిస్తే రికార్డులు మోకరిల్లవా? ఒకటీ రెండు కాదు.. గిన్నీస్ రికార్డ్‌, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ హోల్డర్స్ రిపబ్లిక్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. ఇలా లెక్కలేనన్ని ఘనతలు సాధించాడు.

వ్యాపార కుటుంబ నేపథ్యంలో పెరిగిన మనీష్ ముత్తాతకు కూడా కాయిన్ కలెక్ట్ చేసే అలవాటు ఉండేది. అదే అభిరుచి మనవడికీ వచ్చింది. బాగా రిచ్ ఫ్యామిలీ కావడంతో అరుదైన నాణేలను సేకరించడానికి ఎంత ఖర్చయినా వెనుకాడేవారు కాదు.

1986 తర్వాత మనీష్ తాతముత్తాతలు కూడబెట్టిన ఆస్తులు కరిగిపోయాయి. బిజినెస్ దెబ్బతిన్నది. అప్పుల్లో కూరుకుపోయారు. ఎంతలా అంటే.. యూపీ లక్ష్మీపూర్ ఖేరీలో ఉన్న 30 గదుల బంగళాని కూడా అమ్మాల్సి వచ్చింది. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనీష్ కాయిన్ కలెక్షన్ వీడలేదు.

అందరి తల్లిదండ్రుల్లాగే మనీష్ పేరెంట్స్ కూడా తమ కొడుకు పెద్ద చదువులు చదవాలని కోరుకున్నారు. మనీష్ డాక్టర్ కావాలన్నది నాన్న కల. తల్లికి ఇంజినీర్ చదివించి డిపెండబుల్ జాబ్ చేయించాలని ఉంది. కానీ మనీష్ కల వేరు. ఒక గవర్నమెంటు ఉద్యోగం సంపాదించాలనేది అతని కోరిక. ఫైనల్‌ గా మనీష్ రాజస్థాన్ విద్యాపీఠ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశాడు. తర్వాత టీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ లెవల్ ఆఫీసర్‌ గా జాయిన్ అయ్యాడు. మనీష్ అనుకున్నట్టే సర్కారీ నౌకరీ సంపాదించాడు కానీ.. అది కాస్తా కొన్నాళ్లకి బోర్ కొట్టింది. 2008లో విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన పాన్ ఆఫ్రికన్ ఈ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ లో భాగస్వామి అయ్యాడు.

2010లో సౌతాఫ్రికాకు షిఫ్టయ్యాడు. టాంజానియా, జాంబియా, మెడగాస్కర్, లెసోతో, మార్షియస్, కెన్యా, సెనెగల్ లాంటి దేశాల్లో ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లలో పనిచేశాడు.

మనీష్ కేవలం ఇంజినీరింగ్ మాత్రమే చేయలేదు. 31 ఏళ్ల వయసులోనే 8 మాస్టర్ డిగ్రీలు, రెండు బ్యాచిలర్ డిగ్రీలు, ఇండియా, అబ్రాడ్ నుంచి 6 సర్టిఫికెట్లు సంపాదించాడు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి సోషల్ వర్క్‌ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. పసిఫిక్ యూనివర్శటీ ఉదయ్ పూర్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేశాడు. అందులో ప్రొఫెషనల్ సోషల్ వర్క్ ప్రాక్టీస్ కోణంలో మాక్రో, మెసో, మైక్రో స్పెషలైజేషన్ చేశాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. నాణేల్లో పీహెచ్డీ చేసి, దానికి సంబంధించి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలనేది మనీష్ డ్రీమ్.

ఒకవేళ అదే కనక నిజమైతే ప్రపచంలోనే మొట్టమొదటి త్రీడీ న్యుమిస్మాటిక్ మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత మనీష్ కే దక్కుతుంది. 

Related Stories