భవిష్యత్తు సాగుకు సాంకేతిక అండ

కార్పొరేట్లు ఎందుకు వ్యవసాయంలో పాలు పంచుకోవాలి ? సామాజిక బాధ్యతగా నిర్వహించాలా ?సాగు నుంచి భారీ లాభాలు ఒడిసిపట్టే అవకాశం ఉందా ?గత 15ఏళ్లలో 2.5లక్షల మంది రైతుల ఆత్మహత్యఆత్మహత్యల అవసరం రాని సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు

భవిష్యత్తు సాగుకు సాంకేతిక అండ

Sunday April 19, 2015,

5 min Read

భారత్‌లో వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారి సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 1980-2011 మధ్య ఈ సంఖ్య దాదాపు రెట్టింపైంది. మూడు దశాబ్దాల గణాంకాలు పరిశీలిస్తే... ప్రపంచంలో ఏ ప్రాంతం, ఖండం, దేశంతో పోల్చినా మనదేశంలోనే ఈ స్పీడ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఇప్పుడు ఉందంటారు నిపుణులు. ఇలాంటి సమయంలో వ్యవసాయరంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అనేకమంది పారిశ్రామికులు, ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు.


అగ్రికల్చర్‌కు ఐటి అండ కావాల్సిందేనా ?

అగ్రికల్చర్‌కు ఐటి అండ కావాల్సిందేనా ?


తాజాగా యువర్ స్టోరీ నిర్వహించిన వోడాఫోన్ అగ్రికల్చర్ మీట్‌లో... వ్యవసాయ సాంకేతికతలో అనేక కొత్త ఆవిష్కరణలు బయటపడ్డాయి. అనేక మంది నిపుణులు తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు. రైతులకు తాము చూసిన పరిస్థితులను సవివరంగా తెలియచేశారు. ఈ ప్యానల్‌లో ఓమ్నివోర్‌ వైస్ ప్రెసిడెంట్ రీహెమ్ రాయ్, డిజిటల్ గ్రీన్ సీఓఓ వినయ్ కుమార్, ఎక్‌గాన్ వ్యవస్థాపకులు విజయ్ ప్రతాప్ సింగ్ ఆదిత్య, దొడ్డబల్లాపూర్‌కు చెందిన ప్రగతిశీల రైత ఎం.నారాయణ రెడ్డి ఉన్నారు.

నారాయణ రెడ్డి, ప్రగతిశీల రైతు

నారాయణ రెడ్డి, ప్రగతిశీల రైతు


ఈ ప్యానల్‌లో ఉన్నవారిని పరిశీలిస్తే... ఒకరు సాంకేతిక నిపుణులు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఓ లాభాపేక్ష లేని సంస్థ, వ్యవసాయంలో పెట్టుబడుల ద్వారా లాభాలు గడించడం ఎలాగో రైతులకు చెప్పేవారొకరు కాగా.., నాలుగెకరాల పొలంలో ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్న ఓ ఆదర్శరైతు ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది.

వోడాఫోన్ డెవలపర్స్‌కు చెందిన కార్తీక్ చర్చను ప్రారంభిస్తూ.. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని నేరుగా ప్రస్తావించారు. "కార్పొరేట్లు ఎందుకు వ్యవసాయంలో పాలు పంచుకోవాలి ? కార్పొరేట్లు సామాజిక బాధ్యతగా నిర్వహించాలా లేక సాగు నుంచి భారీ లాభాలు ఒడిసిపట్టే అవకాశం నిజంగా ఉందా?" ఇది కార్తీక్ ప్రశ్న. " గత పదిహేనేళ్లలో దేశవ్యాప్తంగా 2.5లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వీరిలో ఒక్కరు కూడా సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసేవారు లేరు."

తెల్లటి చొక్కా, ధోవతి, లెదర్ చెప్పులు ధరించిన రైతు నారాయణ రెడ్డి... వ్యవసాయంలో తనకున్న 42 ఏళ్ల సుదీర్ఘ అనుభవాలను పంచుకున్నారు. రైతుకు, అతని కుటుంబానికి జీవనాధారంగా, అలాగే దేశానికి వెన్నెముకగా ఉండాల్సిన వ్యవసాయం.. ఇప్పుడు ఎరువులు, రసాయనాలు ఉపయోగించి ఎగుమతుల కోసం చేస్తున్న వ్యాపారంగా మారిపోయిందన్నారు. “ వ్యవసాయం బయట నుంచి ఇన్‌పుట్స్ పొందే రంగం కాదు. కానీ గత పదిహేనేళ్లుగా అంతా మారిపోయింది. ఎరువుల వంటి ఇతర వాటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. దీంతో రెండున్నర లక్షల మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. స్వాభావికంగా సాగు చేసినపుడు 30-40 శాతం ఉద్యోగావకాశాలు ఈ రంగం నుంచే వచ్చేవి. అయితే ఇప్పుడు వ్యవసాయం అంత గిట్టుబాటుగా ఉండడం లేదు. కనీసం ఈ రంగం స్థిరంగా నిలబడే అవకాశం లేక... గత మూడు దశాబ్దాలుగా ప్రతికూల వృద్ధి నమోదు చేస్తోంది. పరిశ్రమల కోసం రైతుల నుంచి భూములు లాగేసుకుంటున్నారు. భవిష్యత్ తరాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్న కమతాలు కూడా లాభదాయకంగా మార్చేలే విధానాలుండాలి."

తన గ్రామంలో నారాయణరెడ్డి ఒక ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రసాయన ఎరువులతో అధిక దిగుబడులు, భద్రత అంతా భ్రమే అని.. ఏ సైంటిస్టుకైనా ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించగలరు. ప్రకృతి సిద్ధంగా నైట్రోజన్‌ను అమ్మోనియాగా మార్చే పద్ధతులపై వివరణ ఇచ్చారు. "నా నాలుగెకరాల భూమిలో 20 టన్నుల సపోటా, 6వేల కొబ్బరికాయలు, 10 టన్నుల బొప్పాయి, 7-8 టన్నుల అరటి, 20 టన్నుల కూరగాయలను ఏటా పండిస్తున్నా"నంటారు నారాయణ రెడ్డి.

వాతావరణ శాఖ సూచనలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు రైతు నారాయణ రెడ్డి. "కోళ్లు రెక్కలు విప్పుకుని పరిగెట్టినపుడు, ఈశాన్యం నుంచి గాలులు వీచినపుడు, చీమలు గుడ్లు తీసుకుని ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినపుడే వర్షాలు పడతాయి. అంతే తప్ప వాతావరణ శాఖ వానలు పడతాయని చెప్పినపుడు కురవడం లేదం"టూ విమర్శించారాయన.

ఏక్‌గావ్ కంపెనీకి చెందిన విజయ్ ప్రతాప్ సింగ్ రైతుల ఆగ్రహాన్ని అర్ధం చేసుకున్నట్లు చెప్పారు. “ సాగుకు అందిస్తున్న సబ్సిడీల్లో 80శాతం వరకూ రాజకీయ నాయకులకు చెందిన రసాయన కంపెనీలకే వెళ్లిపోతున్నాయి. దురదృష్టవశాత్తూ సేంద్రీయ వ్యవసాయం నానాటికీ వైభవాన్ని కోల్పోతోంది. సాంకేతిక, వసతుల కల్పనలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మేం మొబైల్ ఫోన్ల ద్వారా రైతులకు పొలం పరిమాణం, భౌగోళిక పరిస్థితులు, పంట, భూమి పరిస్థితిపై సమాచారం ఇస్తున్నాం" విజయ్ ప్రతాప్ సింగ్.

విజయ్ ప్రతాప్ సింగ్,ఏక్ గావ్ నిర్వాహకులు

విజయ్ ప్రతాప్ సింగ్,ఏక్ గావ్ నిర్వాహకులు


ఏక్‌గావ్ సంస్థ భూసారం, పంట రకాలు, ఉత్పత్తి, కాలమానం ప్రకారం ఎంత స్థాయిలో ఎరువులు వాడాలో తెలియచేసేందుకు ప్రయత్నిస్తోంది. రసాయన ఎరువులు ఎప్పుడు/ఎక్కడ/ఎలా వాడాలో తెలియచెప్తోంది. దీంతోపాటే ఆయా వస్తువులకను విక్రయించే డీలర్ల వివరాలు కూడా అందిస్తోంది. ఇచ్చిన సలహాలు, సూచనలపై తాజా పరిస్థితులను ఫాలోఅప్ చేస్తుంది కూడా. ఇలా ఒక్కో ఎకరాకు పెట్టుబడిని కనీసం రూ. వెయ్యి వరకూ తగ్గిస్తూ.. రూ.530 చేర్చడంలో ఈ సంస్థకి కీలకపాత్ర. "ఒక్కో ఎకరాకు పెట్టుబడిని రూ. 530కి తగ్గించగలిగాం. దీంతో ఒక్కొక్కరికి రూ.1000 నుంచి రూ.2000 వేల వరకూ ఆదా అవుతోంది"- విజయ్ ప్రతాప్ సింగ్.

ప్రస్తుతం 100రకాల పంటలపై సవివరంగా సలహాలివ్వగల ఏక్‌గావ్, తమ స్థాయిని 1500 రకాలకు చేర్చి 50లక్షల రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రచిస్తోంది.

ఓమ్నివోర్ పార్ట్‌నర్స్ ఉపాధ్యక్షుడు రీహెమ్ రాయ్ భౌగోళిక పరిస్థితులను అనుసరించి సాగు పద్ధతులపై మాట్లాడారు. సాంకేతికను తప్పుపట్టే కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన ఆయన.. "టెక్నాలజీ తప్పు అని చెప్పడానికి, వీలుగా లేదనడానికి చాలా వ్యత్యాసముంది. కొన్ని పరిస్థితులకు ప్రయోజనం చేకూరేందుకు సమయం అవసరమవుతుంద”న్నారు.

“పరికరాలు, సాంకేతికత వాటిని తప్పుగా వినియోగించినపుడే ప్రతికూల ఫలితాలొస్తాయి. రైతుల కోసం ఇప్పుడు ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ఇది ప్రస్తుత భారతీయ వ్యవసాయ రంగానికి అనుకూలమైనది కాదు. ఈ వెనుకబాటుదనం పారిశ్రామికులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తోంది. ఉదాహరణకు జీఈ సంస్థ రూపొందించిన టెక్నాలజీ 500లకు పైగా ఆవుల వంటి పశువుల పెంపకం చేసే పెద్ద వాటికే ఉపయోగపడుతుంది. దీన్ని అతి చిన్న పాడి రైతులకు ఉపయోగపడే అవకాశం లేదు. ఇందుకు వీలుగా సాంకేతికతలో మార్పులు రావాల్సి ఉంది.”

రీహెమ్ రాయ్,ఓమ్నివోర్ పార్ట్‌నర్స్  ఉపాధ్యక్షుడు

రీహెమ్ రాయ్,ఓమ్నివోర్ పార్ట్‌నర్స్ ఉపాధ్యక్షుడు


వ్యవసాయంలో సాంకేతిక రంగానికి భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయి.“ ప్రపంచం అవకాశాల విషయంలో సముద్రపు ఆల్చిప్ప వంటిది. మనం దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన చేతుల్లోనే ఉందం”టారు రీహెమ్ రాయ్.

“ ఇప్పుడు మనం మళ్లీ చక్రాన్ని కనిపెట్టనవసరంలేదు. ఉన్న అవకాశాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడంలో మన నైపుణ్యత బయటపడుతుంది. భారత్‌లో లాంచ్ చేసేందుకు ముందు ఫెరారీ, లాంబోర్గినిలకు ఇక్కడి రోడ్ పరిస్థితులకు అనుగుణంగా రీమోడల్ చేస్తారు, అలాగే వ్యవసాయంలో కూడా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు వీలుగా మార్పులు రావాల్సి ఉంది."- రీహెమ్ రాయ్.

“రైతులకు సలహాలిచ్చే ముందుగా, ఆయా కంపెనీలు వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాలి. వీలైనంత సమయం చూసుకుని అన్నదాతల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి.”- రీహెమ్ రాయ్

వినయ్ కుమార్ మాట్లాడుతూ డిజిటల్ గ్రీన్ సంస్థ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో వచ్చే మార్పులు, అవకాశాలపై చిన్న, మధ్య తరహా రైతులకు సమాచారమిస్తున్నామన్నారు. రైతులు తాము సాధించే విజయాలను వీడియోల రూపంలో అందరికీ పంచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారాయన. ఇతర రైతులకు ఇవి ఎంతో ఉపయోకరంగా ఉంటున్నాయి.

“ మా కార్యకలాపాల్లో అధికశాతం సాంకేతిక రంగానికి సంబంధించినవే అయినా... మొదట రైతుల అవసరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఆ తర్వాతే పరికరాలు తయారు చేసి రైతులకు అందిస్తాం. ఆవిష్కరణల్లో మేం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోబోం. ప్రస్తుతం మాకు సరైన భాగస్వాముల అవసరముంది. రైతు గ్రూపులతో సంబంధాలు ఏర్పరచుకోవడం మేలు కలిగించే విషయం. రైతుకు తగిన పరిష్కారాన్ని చూపడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్తాయి. అలాగే ఎక్కువ మందిని ఒకేసారి కలుసుకుని, అభిప్రాయాలు పంచుకోవడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర ఎంతో కీలకం." - డిజిటల్ గ్రీన్ సీఓఓ వినయ్ కుమార్


వినయ్ కుమార్ -డిజిటల్ గ్రీన్ సీఓఓ

వినయ్ కుమార్ -డిజిటల్ గ్రీన్ సీఓఓ


మన చుట్టూ టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ స్పీడ్ సాగు పద్ధతుల్లో కనిపించకపోవడం దురదృష్టకరం. స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలు, పరికరాల్లో మార్పులు తేవాల్సి ఉంటుంది. అలాగే కొన్నింటి ప్రయోజనాలు బయటపడేందుకు కొంత సమయం కూడా అవసరమవుతుంది. అలాగే దేశంలో అగ్రి-టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి మరికొంతకాలం పడుతుంది కూడా