మారుతి 800 ఇంజిన్ బిగించి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశాడు  

0

హెలికాప్టర్ తయారీ అనేది పెద్ద ప్రహసనం. ఎంత మెషినరీ ఉన్నా టెక్నాలజీ సపోర్టు లేకుండా రెక్కలు కూడా అమర్చలేం. అలాంటి కష్టమైన, క్లిష్టమైన పనిని మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేశాడు కేరళకు చెందిన ఓ మెకానిక్. మారుతి 800 ఇంజిన్ తో ఏకంగా డబుల్ సీటర్ లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశాడు. నమ్మశక్యంగా లేదుకదా. అయితే చదవండి.

కేరళలోని ఇడుక్కిలో మెకానిక్ గా పనిచేసే సదాశివన్- ఒకరోజు తన కూతురు చదివే స్కూల్ కి వెళ్లాడు. అక్కడ ప్రిన్సిపల్ తో ఏదో విషయమై మాట్లాడాడు. ఆ క్రమంలోనే కాజువల్ టాక్ లో భాగంగా.. పిల్లలకు వివరించడానికి ఒక డమ్మీ హెలికాప్టర్ అసెంబుల్ చేసిస్తారా అని ప్రిన్సిపల్ అడిగాడు. అయ్యో దానికేం భాగ్యమని సదాశివన్ అన్నాడు. ఇంటికొచ్చిన తర్వాత సదాశివన్ సీరియస్ గా ఆలోచించాడు. డమ్మీ హెలికాప్టరే ఎందుకు.. నిజంగా ఎగిరేదే తయారు చేస్తే ఎలా వుంటుంది అని మేథోమథనం చేశాడు.

విడిభాగాలు కొనేంత ఆర్ధిక స్తోమత లేదు. అందుకే అన్నీ తన గ్యారేజీలో ఉన్న పార్టులతోనే ప్లాన్ గీశాడు. ముందు ఆటో అద్దం అమర్చాడు. సీట్లు కూడా పాతవే. మారుతి 800 ఇంజిన్ బిగించాడు. డోర్లు, రెక్కలు అన్నీ రీ సైకిల్డ్ పార్ట్సే. ఇలా ఫైనల్ ప్రాడక్ట్ రావడానికి నాలుగేళ్లు పట్టింది.

ప్రస్తుతానికి సదాశివన్ చేసిన లైట్ వెయిట్ ఫ్లయిట్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే దానికి కావల్సిన అనుమతులు రావాల్సి వుంది. ఎంత ఎత్తుకు ఎగరాలి.. ఎక్కడ ఎగరాలి, ఏ పరిమితుల్లో ఎగరాలి.. అన్నదానిపై సంబంధిత అధికారుల నుంచి క్లియరెన్స్ రావాల్సి వుంది. ఒకవేళ అనుకున్నట్టు జరిగితే, చాపర్ ఎగిరితే, నిజంగా అద్భుతమే. పదోతరగతి వరకే చదవిన ఓ సాధారణ మెకానిక్- సొంతంగా హెలికాప్టర్ తయారు చేశాడన్న కీర్తి శాశ్వతంగా మిగిలిపోతుంది.   

Related Stories

Stories by team ys telugu