కాఫీ బార్ ఏర్పాటుతో ఐదేళ్లలో రూ.8 కోట్ల వ్యాపారం

వడోదరలో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరణవినూత్న కాన్సెప్ట్‌తో ఏర్పాటైన కాఫీ బార్ ఏటా నూరు శాతం వృద్ధి చెందుతున్న కంపెనీ

కాఫీ బార్ ఏర్పాటుతో ఐదేళ్లలో రూ.8 కోట్ల వ్యాపారం

Tuesday June 23, 2015,

2 min Read

అంకుర్ గుప్తా, రోనక్ కాపటేల్‌లు చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన తర్వాత పరిశ్రమలో కొన్నేళ్లు పనిచేశారు. ఆ సమయంలో బ్రూబెర్రీస్ కేఫ్‌ను ప్రారంభించాలని ఇరువురూ నిర్ణయించారు. మొదట్లో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. నిర్వహణ వ్యయం చాలా ఎక్కువుండడతో సొంతంగా నిర్వహించగలమన్న ధీమాతో కేఫ్‌ను నెలకొల్పారు. కేఫ్‌లలో పని చేసిన అనుభవం ఉండడం కూడా కలిసొచ్చిందని అంటున్నారు అంకుర్.

image


ఇదీ బ్రూబెర్రీస్ ప్రస్థానం

వడోదరలో 2008లో బ్రూబెర్రీస్ తొలి కేఫ్ ప్రారంభమైంది. తాజాగా తయారు చేసిన స్నాక్స్, కాఫీని ఈ కేఫ్‌లో విక్రయిస్తారు. వైఫై, గిటార్, బోర్డ్ గేమ్స్ అందుబాటులో ఉండడం కేఫ్‌ల ప్రత్యేకత. మంచి స్పందన రావడంతో సూరత్, అహ్మదాబాద్‌లలో శాఖలను తెరిచారు. 2009 ప్రారంభం నుంచి ఫ్రాంచైజీలోనూ స్టోర్ల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. వ్యాపార నిర్వహణ తొలి ఆరు నెలలు మాత్రం ఇద్దరికీ క్లిష్టంగా ఉండేది.

‘పలు నగరాల్లో స్టోర్ల ఏర్పాటు, నిర్వహణ విషయంలో మా సామర్థ్యంపై ప్రజలకు అనుమానం ఉండేది. కేఫ్ నెలకొల్పేందుకు ఉత్తమ స్థలం, మాల్ దొరకడం చాలా కష్టం. బాగా స్థిరపడ్డ బ్రాండ్‌ను అందరూ కోరుకుంటారు’ అని అంటారు రోనక్.

అంకుర్ తొలి తరం వ్యాపారవేత్త. ఆతిథ్య రంగంపైన ఆయనకు అమితాసక్తి. ఆహారం, పానీయాల వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి. హోటల్, టూరిజం మేనేజ్‌మెంట్‌లో రోనక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మారియట్ హోటల్స్, చేషంట్(యూకే), స్టార్‌బక్స్(యూఎస్) తదితర సంస్థల్లో ఏడేళ్లకుపైగా పనిచేశారు. భారత్‌కు వచ్చి బ్రూబెర్రీ సహ వ్యవస్థాపకుడిగా చేరారు.

బ్రూబెర్రీ విస్తరణ

బ్రూబెర్రీస్ హాస్పిటాలిటీ 15 రాష్ట్రాలకు విస్తరించింది. 45 స్టోర్లు ఏర్పాటయ్యాయి. ఫ్యూచర్ గ్రూప్, ఐడియా సెల్యులార్, కలర్స్ టీవీ చానెల్, మాన్‌స్టర్, స్నాప్‌డీల్, టీసీఎస్, రహేజా డెవలపర్స్, వెంకీస్ తదితర కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా 64 నగరాల్లో ఉన్న 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో టీసీఎస్ భాగస్వామ్యంతో బ్రూబెర్రీ స్నాక్ బార్స్‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో బార్ 50 నుంచి 80 అడుగుల విస్తీర్ణంలో ఉంది.

బ్రూబెర్రీ కాన్సెప్ట్‌పై అపారమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అనురాగ్ బియానీ. జైపూర్‌లో తొలి ఫ్రాంచైజీకి సంతకం చేసిన వ్యక్తి ఈయనే అని అంటారు అంకుర్. రానురాను అనురాగ్‌తో బంధం బలపడింది. కంపెనీ అభివృద్ధిలో అనురాగ్ సహాయం అందిస్తున్నారు. రియాల్టీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో స్టోర్ నిర్వహణ అన్ని సమయాల్లో సవాల్‌గా నిలిచిందని అంటారు రోనక్. సిబ్బంది నియామకం, శిక్షణ, లెసైన్సింగ్ బ్రూబెర్రీ ఎదుర్కొంటున్న సవాళ్లు.

image


100 శాతం వృద్ధి

కంపెనీ 2009 నుంచి లాభాల్లో ఉంది. గత మూడేళ్లుగా 100 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. 2011-12లో కంపెనీ రూ.75 లక్షల ఆదాయం ఆర్జించింది. 2013-14కు వచ్చే సరికి అది కాస్తా రూ.8 కోట్లకు ఎగసిందని అంకుర్ తెలిపారు. అన్ని ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నది తమ లక్ష్యమని రోనక్ చెబుతున్నారు. ఈ నగరాల్లో వ్యాపార అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. 2015 చివరినాటికి 250 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది.