ఈసారి హ‌రిత‌హారం ప్ర‌త్యేక‌త ఏమిటి..? తెలంగాణ అట‌వీశాఖ వినూత్న ప్రయత్నం

ఈసారి హ‌రిత‌హారం ప్ర‌త్యేక‌త ఏమిటి..? తెలంగాణ అట‌వీశాఖ వినూత్న ప్రయత్నం

Sunday June 11, 2017,

2 min Read

రుతుపవనాల రాకతో వర్షాలు మొద‌ల‌య్యాయి. మూడో విడ‌త హ‌రిత‌హారం వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభంకానుంది. అయితే ఈసారి హ‌రిత‌హారం ప్ర‌త్యేక‌త ఏమిటి? ఎలాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి..? ఆ మొక్క‌లు ఎక్క‌డ దొర‌కుతాయి..? ఇలాంటి అనుమా‌నాలు చాలా మందికి స‌హ‌జం. ఈ అనుమానాల‌న్నింటినీ నివృత్తి చేసేందుకు తెలంగాణ అట‌వీ శాఖ ప్ర‌య‌త్నిస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా జిల్లాల వారీగా న‌ర్స‌రీ డైరెక్ట‌రీల‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

image


హ్యాండ్ బుక్ లోనే హ‌రిత‌హారానికి సంబంధించిన స‌మ‌స్త వివ‌రాలు పొందు ప‌రిచేలా అట‌వీ శాఖ అధికారులు ఒక అడుగు ముందుకు వేశారు. ఒక్కో జిల్లాకు సంబంధించిన అన్ని న‌ర్స‌రీల వివ‌రాలను మండ‌లాలు, గ్రామాలవారీగా ఆయా న‌ర్స‌రీల్లో అందుబాటులో ఉన్న మొక్క‌ల వివ‌రాలు, ఆ న‌ర్స‌రీ ఏ మండ‌లానికి, ఏ గ్రామానికి అనుసంధానం చేయ‌బ‌డింది.. అన్న వివ‌రాలు డైరెక్ట‌రీలో పొందుప‌రుస్తారు.

అదే స‌మ‌యంలో ఈ మినీ బుక్ హ‌రిత‌హారానికి సంబంధించిన ప్ర‌తీ అధికారి దగ్గర అందుబాటులో ఉండ‌టంతో పాటు, ఆయా ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు మొదలుకొని మంత్రి, ఎమ్మెల్యే, స‌ర్పంచ్ దాకా ఈ పుస్త‌కం చేరుతుంది. అంటే హ‌రిత‌హారానికి సంబంధించిన సమస్త స‌మాచారమంతా ఈ డైరెక్ట‌రీ ద్వారా ప్ర‌తీ గ్రామానికి అందుతుంది.

విరివిగా మొక్క‌లు నాటుదాం... నాటిన మొక్క‌ల‌ను రక్షించుకుందామంటూనే మొక్క‌లు నాటే స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు.. నాటే విధానం.. ఆ త‌ర్వాత స‌రంక్ష‌ణ చర్యలు.. ఇలా స‌మాచారం అంతా అందులో పొందుప‌రుస్తున్నారు. ఇక ఆ జిల్లాలో ఎన్ని మండ‌లాలు ఉన్నాయి..? వాటి ప‌రిధిలో గ్రామాలు ఎన్ని..? వాటిని అనుసంధానించిన న‌ర్స‌రీ ఏది..? అన్న విష‌యం ఈ డైరెక్ట‌రీ ద్వారా క్షణాల్లో తెలుసుకోవ‌చ్చ‌న్న మాట‌. హ‌రిత‌హారంలో భాగంగా ఆ జిల్లాలో నాటాల్సిన మొక్క‌ల లక్ష్యం ఎంత? ఏ ఏ మొక్క‌లు ఏ న‌ర్స‌రీలో ఉన్నాయి? వాటి సంఖ్య లాంటి వివ‌రాలు కూడా ఈ హ్యాండ్ బుక్ లో ఉంటాయి.

ఉదా‌హార‌ణ‌కు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో లద్నాపూర్ నర్సరీ ఉంది. ఈ న‌ర్స‌రీలో దానిమ్మ‌, బొప్పాయి, మారేడు, సీతాఫ‌లం, జామలాంటి పండ్ల మొక్క‌ల‌తో పాటు మున‌గ, క‌రివేపాకు, ఉసిరి లాంటి మొక్క‌లు అందుబాటులో ఉన్నాయి. బొగ‌న్ విల్లి, మందారం, టేకు, ఈత, గుల్ మొహ‌ర్, వేప‌, రేల లాంటి మొక్క‌లు కూడా అక్కడ దొరుకుతాయి. నందివర్థనం, మల్లె, బాదం, మందార లాంటి మొక్కలు కూడా ఈ నర్సరీలో కనిపిస్తాయి. అలాగే ఈ న‌ర్స‌రీకి అనుసంధానం చేసిన గ్రామాల వివ‌రాలు, ఒక్కో గ్రామానికి ఏ ర‌కం మొక్క‌లు, ఎన్ని చొప్పున పంపిణీ చేయాలి అన్న వివ‌రాలు కూడా అందులో పొందుపరిచి ఉంటాయి.

ఇలా ఒక్కో జిల్లాకు ఇక ప్రత్యేక బుక్ లెట్ అంటుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తోంది అటవీ శాఖ. ఆ జిల్లాకు సంబంధించిన న‌ర్స‌రీలు, వాటి ఇంచార్జీల పేరు, సెల్ నెంబ‌ర్ కూడా అందులో పేర్కొంటారు. ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ ప్రాంతానికి కావాల్సిన మొక్క‌ల వివ‌రాలు, సంఖ్యను కూడా నేరుగా ఫోన్ ద్వారా క‌నుక్కోవ‌చ్చు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌కు ప్ర‌త్యేకంగా ఏదైనా మొక్క‌ కావాలంటే ఆ వివ‌రాలు న‌ర్స‌రీ ఇంఛార్జీల ద్వారా తెలుసుకునే వెస‌లుబాటు ఉంటుంది.