టెక్నాలజీ రంగంలో తిరుగులేని సీఈవో శ్రీప్రియ కొప్పుల

 టెకీ నుంచి స్టార్ట‌ప్ సీఈవోగా ఎదిగిన అమ్మాయి విజయగాథ

టెక్నాలజీ రంగంలో తిరుగులేని సీఈవో శ్రీప్రియ కొప్పుల

Tuesday August 25, 2015,

7 min Read

జీవితంలో ఏ ద‌శ‌లోనైనా రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌లిగి వుండాలి..ఏం చేస్తున్నావు ? ఎందుకు చేస్తున్నావు ? ఇప్పుడు వెన‌క్కి తిరిగి చూసుకుంటే, ఈ రెండు ప్రశ్న‌ల‌కు నా ద‌గ్గ‌ర స‌రైన స‌మాధానం వుంది. నేను నా జీవితాన్ని స‌రిగానే గడిపాన‌నుకుంటాను.. అంటారు టెకీ నుంచి స్టార్ట‌ప్ సీఈవో గా ఎదిగిన శ్రీ‌ప్రియ‌.

డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ల‌య్యే వాళ్ళుంటారు. కొప్పుల శ్రీ‌ప్రియ మాత్రం డాన్స‌ర్ కాబోయి టెకీ అయ్యారు. ఆ త‌ర్వాత ఆంట్రప్రెన్యూర్ అయ్యారు. ఆమె డాన్స‌ర్ కాక‌పోవ‌డం నాట్యానికి ఎంత న‌ష్ట‌మో తెలియ‌దు కానీ, ఖ‌ర‌గ్‌పూర్ నుంచి ఐఐటి చేసిన ఈ అమ్మాయి టెక్నాల‌జీ రంగంలో మాత్రం ఆణిముత్యంగా మెరుస్తున్నారు.

యువ‌ర్ స్టోరీ లో టెకీ ట్యూజ్ డేస్ కాల‌మ్ ఒక‌టుంది. ఈ కాల‌మ్‌లో వారం వారం ఒక్కో టెక్కీని ప‌రిచ‌యం చేస్తాం. అయితే, రెండేళ్లుగా ప్ర‌తి వారం మ‌గాళ్లనే ఈ కాల‌మ్‌లో ప‌రిచ‌యం చేస్తున్నాం. ఈ సారి ఎలాగైనా ఓ మ‌హిళా టెకీని ప‌రిచ‌యం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. వారికోసం వెతుకుతుండ‌గానే మా యువ‌ర్ స్టోరీ విమెన్ ఇన్ టెక్ మీట‌ప్ ఏర్పాటైంది. ఈ స‌ద‌స్సుకి వ‌చ్చిన వారిలో మా కాల‌మ్ కి స‌రిప‌డా మ‌హిళా టెకీ కోసం క‌ళ్ళు వెతికాయి.

శ్రీప్రియ కొప్పుల

శ్రీప్రియ కొప్పుల


ఆరేళ్ల‌కే తండ్రిని కోల్పోయిన శ్రీ‌ప్రియ కుటుంబాన్ని ఆమె తల్లే పోషించేది. హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీప్రియకి చిన్న‌ప్ప‌టినుంచి తండ్రి లాగే లెక్క‌లు, ప‌జిల్స్ అంటే ప్రాణం. హై స్కూల్లోనే ఆమెకి C ప్రోగ్రామింగ్ వంట‌బ‌ట్టింది. స్కూల్లో యావ‌రేజి స్టూడెంటే అయినా.. ఫ‌స్టు రావాల‌ని క‌ల‌లు క‌నేది.

శ్రీ‌ప్రియ తండ్రి వ‌రంగ‌ల్ REC లో గోల్డ్ మెడ‌లిస్ట్. క‌నుక త‌న ఇద్ద‌రు పిల్ల‌లూ ఇంజ‌నీర్లు కావాల‌ని ఆమె త‌ల్లి ఆకాంక్ష‌. అందుకు త‌గ్గ‌ట్టే శ్రీ‌ప్రియ ఐఐటిలో చేరేందుకు JEE రాసింది. అందులో ఆమెకి గొప్ప ర్యాంకేమీ రాలేదు కానీ, మొత్తానికి సీట్ వ‌చ్చింది. ఐఐటి ఖ‌ర‌గ్‌పూర్‌లో చేరింది.

నిజానికి ఆమె ఐఐటి ఖ‌ర‌గ్‌పూర్ లో చేర‌డం వెనుక ఇంకో కార‌ణం వుంది. ఆమెకి విదేశాల‌కు వెళ్ళ‌డం ఇష్టం లేదు. అందుకే ఐఐటి అయితే, ఇండియాలోనే వుండొచ్చ‌ని ఆమె క‌ష్ట‌ప‌డి అందులో అడ్మిష‌న్ సాధించింది. ఐఐటి సీటు ఆ విధంగా ఆమెకి ఇండ‌స్ట్రియ‌ల్ కెమిస్ట్రీ బ్రాంచ్ తో పాటు, ఆత్మ‌విశ్వాసాన్ని కూడా ఇచ్చింది.

డాన్స్, రొమాన్స్, పాలిటిక్స్.. కొంచెం సి ++

ఐఐటిలో మొద‌టి రెండుసంవ‌త్స‌రాలూ అందరికీ కొన్ని కామ‌న్ కోర్సులు వుంటాయి. అలా శ్రీ‌ప్రియ మొద‌టి రెండు సంవ‌త్స‌రాల్లో సి++ చ‌ద‌వాల్సి వ‌చ్చింది. గ్రాడ్యుయేష‌న్‌లోనే ఆమెకు ఆ స‌బ్జెక్టులో అన్ని ఫ‌స్టు ర్యాంకులే వ‌చ్చేవి. క‌నుక‌, ఇప్పుడు కోడింగ్, లాజిక్, అన‌లిటిక్స్‌ను కాసేపు ప‌క్క‌న పెట్టి ఇత‌ర కో క‌రిక్యుల‌ర్ యాక్టివిటిస్‌లో బిజి అయిపోయింది శ్రీ‌ప్రియ‌. క‌మిటీల‌ను ఆర్గ‌నైజ్ చేయ‌డం, యూనివ‌ర్శిటీ పాలిటిక్స్‌లో త‌ల‌దూర్చ‌డం లాంటివి ఎక్కువ‌య్యాయి . పాలిటిక్స్ ఒక్క‌టే కాదు. డాన్స్ అంటే కూడా తనకు చాలా ఇష్టం. అస‌లు ఐఐటియన్ కాక‌పోయింటే, డాన్స‌ర్‌ని అయ్యేదాన్ని అంటారు.

త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను కూడా కాలేజిలోనే ఎంచుకుంది శ్రీ‌ప్రియ‌. చ‌దువుకంటే, ఐఐటి ఖ‌ర‌గ్‌పూర్ ఆమె స్వ‌భావంలో చాలా మార్పులు తెచ్చింది. ఆమెలో బిడియం పోయింది. ఏ విష‌యాన్నైనా విడ‌మ‌రిచి, ఎదుటివారిని ఒప్పించే నైజం అల‌వాటైంది. ఫైన‌ల్ ఇయ‌ర్ వ‌చ్చేసరికి మ‌న‌సులో వున్న భావాలు బ‌య‌టికి చెప్ప‌డంలో అస్స‌లు భ‌య‌మనేదే లేకుండా పోయింది. అప్ప‌ట్లో కాలేజిలో ఓ ప్యాన‌ల్ డిస్క‌ష‌న్ జ‌రిగింది. ఐఐటి త‌ర్వాత పై చ‌దువులు చ‌ద‌వాలా ఉద్యోగం చేయాలా అనే అంశం మీద డిస్క‌షన్ లో ప్రొఫెస‌ర్లు కూడా జాబ్‌కి తొంద‌రేముంది, పై చ‌దువులు చ‌ద‌వ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌లో వున్నారు. కానీ శ్రీ‌ప్రియ మాత్రం థైర్యంగా జాబ్ చేయ‌డ‌మే ముఖ్య‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.

ఇలా చెప్ప‌డం పైకి చాలా చిన్న విష‌యంలాగే అనిపించొచ్చు కానీ, అక్క‌డున్న‌వారంద‌రి ముందు త‌న అభిప్రాయం చెప్ప‌డానికి చాలా ధైర్యం కావాలి. ఈ ధైర్యానికి ఆమెకి త‌గ్గ బ‌హుమ‌తే దొరికింది. ఆ డిస్క‌ష‌న్‌లో ప్యానలిస్టుల్లో ఒకరైన రెడ్డిల్యాబ్స్ ఆమెకి ఉద్యోగ‌మిచ్చింది.

సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీరింగ్‌లో కెమిస్టు

రెడ్డిల్యాబ్స్ లో జాయిన‌వ్వ‌డానికి ఇంకా కొంత స‌మయం వుంది. ఈ లోగానే శ్రీ‌ప్రియ హైద‌రాబాద్ లోని మ‌రో సంస్థ లో వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి వెళ్ళింది. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు నెల‌కొల్పిన స్టార్ట‌ప్ YASU టెక్నాల‌జీస్ ఆమెకు ఓ జాబ్ ఆఫ‌ర్ చేసింది. అయితే, నెలలోగే జావా ను పూర్తిగా నేర్చుకోవాల‌ని ష‌ర‌తు పెట్టింది. అయితే, నెల‌రోజుల త‌ర్వాత పెట్టిన టెస్ట్‌లో కూడా ఆమె ఫెయిల్ అయింది. ఆ త‌ర్వాత ఆమెకి మ‌రో వారం టైమ్ ఇచ్చారు. జావాలో పూర్తి ప్రొగ్రామ్ చేసుకొస్తే, జాబ్ ఇస్తామ‌న్నారు.

ఈసారి ఆమె చాలా క‌ష్ట ప‌డింది. ఫ‌లితం ద‌క్కింది. YASU లో ఎక్లిప్స్ ప్ల‌గిన్ పై ప‌నిచేసే ఉద్యోగం ద‌క్కింది.

పెళ్ళి..నుంచి ఇ కామర్స్ వ‌ర‌కు..

2006లో శ్రీ‌ప్రియ పెళ్ళి చేసుకుని బెంగ‌ళూరు వెళ్ళిపోయారు. అక్క‌డ కెటెరా టెక్నాల‌జీస్‌లో ఈ-కామ‌ర్స్ టెకీగా జాయిన్ అయ్యారు. అక్క‌డ టెక్ టీమ్‌లో ఆమె తొలి మ‌హిళా టెకీ క‌నుక అన్నీ త‌నే సొంతంగా సెట్ చేసుకోవాల్సి వ‌చ్చేది. దీంతో పాటు ఆర్గ‌నైజేష‌న్‌లో త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం కూడా ఇంకో స‌వాలే.

కెటెరా అప్ప‌ట్లో కొత్త ప్లాట్‌ఫామ్ లోకి మారింది. బిజినెస్ లాజిక్ మార‌క‌పోయినా, టెక్నాలజీ స్టాక్ మారింది. ఆర్గ‌నైజేష‌న్ లో అంద‌రూ కొత్త టెక్నాల‌జీని బిల్డ్ చేసే ప‌నిలో ప‌డితే, శ్రీ‌ప్రియ‌ను మాత్రం పాత టెక్నాల‌జీ మీద‌నే వ‌ర్క్ చేయమ‌న్నారు. చాలా మంది క్లయింట్లు ఇంకా పాత ప్లాట్ ఫామ్ మీద‌నే వుండ‌డంతో శ్రీ‌ప్రియ అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే, ఇది ఆమె కెరీర్ లో చాలా ఉప‌యోగ‌ప‌డింది.

భర్త తో  శ్రీ‌ప్రియ

భర్త తో శ్రీ‌ప్రియ


  • 1. ప్రోడ‌క్ట్ ను కూలంక‌షంగా అర్థం చేసుకోగ‌లిగింది.
  • 2. కేవ‌లం టెక్ ప్లేకే ప‌రిమితం కాకుండా, మొత్తం అనాలసిస్‌ని అర్థం చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది.
  • 3. ప్రొడ‌క్ష‌న్ ఇష్యూస్ పై ప‌ని చేయ‌డానికి అమెరికా వెళ్ళిన‌ప్పుడు, ఆమెకు నేరుగా సిటివోతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం దొరికింది. ఈ ప్రోడ‌క్ట్ ఆర్కిటెక్ట్ కూడా సిటివోనే కావ‌డంతో దానికి సంబంధించి పూర్తి గా అవగాహ‌న చేసుకోగ‌లిగింది.

క‌డుపులో బిడ్డ‌, కాట‌లాగ్ సొల్యూష‌న్స్..

2008లో మూడునెల‌ల మెట‌ర్నిటీ లీవ్ ముగించుకుని తిరిగి ఆఫీస్‌కి వ‌చ్చేస‌రికి కెటెరాలో కేట‌లాగ్ సొల్యూషన్ టీమ్ మొత్తం రిజైన్ చేసేసింది. ఆ ప‌రిస్థితిలో ఆ టీమ్‌ని లీడ్ చేయాల్సిందిగా సంస్థ ఆఫ‌ర్ చేసింది. కేట‌లాగ్ సొల్యూష‌న్స్‌ని ఆర్కిటెక్ట్ చేయ‌డం, స‌ప్ల‌యిర్ కంటెంట్ మేనేజ్మెంట్, ఎపిఎల్ ఇంట‌గ్రేష‌న్ చేయ‌డం ఆమె బాధ్య‌త‌లు. అప్పుడే త‌ల్లి అయిన శ్రీ‌ప్రియ‌కు ఇన్ని బాధ్య‌త‌లుమ మోయ‌డం చాలా క‌ష్ట‌మైన స‌వాలే.

శ్రీ‌ప్రియ ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఎనిమిది నెల‌ల్లో ఆమెకి మొత్తం ప్రోడ‌క్ట్ మీద అవ‌గాహ‌న వ‌చ్చేసింది. నేరుగా బిజినెస్ టీమ్ తో ప‌నిచేస్తూ, క్ల‌యింట్స్ ప‌ర్స్‌పెక్టివ్ అర్థం చేసుకునే అవ‌కాశం వుండ‌డంతో ఈ బాధ్య‌త‌లు ఆమెకి మంచి అనుభ‌వాన్ని ఇచ్చాయి.

“ ఎనిమిది నెల‌ల పాటు ఈ ప్రోడ‌క్ట్‌ని నేనొక్క‌దాన్నే ర‌న్ చేసాను. టెక్నాల‌జీ, ఆర్ ఎండ్ డిల‌తో ముడిపడిన ఈ ప్రోడ‌క్ట్ అస‌లు స‌మ‌స్య ఏంటో తెలుసుకోవ‌డానికి నేనెప్ప‌డూ వెన‌కాడ‌లేదు ” అని అప్ప‌టి త‌న అనుభ‌వాల్ని చెప్పారు శ్రీ‌ప్రియ‌.

రెండో బిడ్డ‌, తొలి స్టార్టప్..

2011లో ఆమె రెండో బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. అప్ప‌టికే కెటెరాలో ఆరేళ్ళు ప‌నిచేసిన శ్రీ‌ప్రియ ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌ర‌మే 2012లో సొంతంగా స్టార్ట‌ప్ పెట్టుకోవాల‌ని అనుకున్నారు.

“ 2012 జూన్ లో నేను కెటెరాకి రిజైన్ చేసాను. ముందు ఈ కామ‌ర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామ‌నుకున్నాను. అయితే, 2012 నాటికి అదంత లాభ‌దాయ‌క‌మైన‌ది కాద‌ని అర్థ‌మైంది. అప్ప‌టికే నాకు కెట‌లాగింగ్ లో పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చింది. అందుకే నా అనుభ‌వం నుంచే ఇతర ఈ కామ‌ర్స్ కంపెనీల‌కు ఉప‌యోగ‌ప‌డే బిజినెస్ చేయాల‌నుకున్నాను. ”

మొదటి ఆర్నెల్లు ఇమేజ‌స్ మేకింగ్ మీద దృష్టి పెట్టారు. ఈ కామ‌ర్స్ లో ఉత్ప‌త్తుల‌ను బాగా ప్రెజెంట్ చేసేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అప్ప‌టికే 360 డిగ్రీ వ్యూ అందుబాటులో వుంది. అయితే, అందులో చాలా ఇమేజ‌స్‌ను తీయ‌డం, వాటిని మేన్యువ‌ల్‌గా ఎడిట్ చేయ‌డం లాంటివి అవ‌స‌ర‌మ‌య్యేవి. కొంత మంది ఇంజ‌నీర్ల‌తో చ‌ర్చించి, గార్ సిస్ట‌మ్‌తో ప‌నిచేసే డివైస్‌ని రూపొందించారు. సింగిల్ క్లిక్ తోనే కెమెరా ప్రోడ‌క్ట్ చుట్టూ తిరిగి అన్ని వైపుల నుంచి ఫోటోగ్రాఫ్స్ తీసే డివైస్ ఇది.

శ్రీ‌ప్రియ నెల‌కొల్పిన ట‌ర్న్‌ అరౌండ్ కంపెనీ రూపొందించిన ఈ మొద‌టి ప్రోడ‌క్ట్‌ని అర్బ‌న్ లాడ‌ర్ ఈ-కామ‌ర్స్ సైట్లో పైల‌ట్ ప్రాజెక్ట్ గా ర‌న్ చేసింది. దీంతో శ్రీ‌ప్రియ టెకీ నుంచి సి ఇ వోగా మారిపోయారు. ఈ డివైస్ రూపొందించ‌డానికి అవ‌స‌ర‌మైన మెషిన్ కు దాదాపు 3 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టారు.

టర్న్ అరౌండ్ టెక్నాల‌జీ..

ఇమేజ‌స్ ను తిప్పేయ‌డం గురించిన ప్రోడ‌క్ట్ కాబ‌ట్టీ సంస్థ పేరు కూడా ట‌ర్న్ అరౌండ్ అని పెట్టారు. శ్రీ‌ప్రియ ఒక్క‌రే ప‌నిచేసే హార్డ్ వేర్ ఇంజ‌నీరింగ్ సొల్యూష‌న్ నుంచి ఈ మూడేళ్ళ‌లో ట‌ర్న్ అరౌండ్ సొల్యూష‌న్స్ చాలా ఎదిగింది. ఇప్పుడు టెక్నాల‌జీ ఆటోమేటింగ్ ఇమేజ్ ఎడిటింగ్ లో చాలా పేరున్న సంస్థ‌.

ఒక ద‌శ‌లో సంస్థ న‌డ‌ప‌డం చాలా క‌ష్ట‌మైపోయింది. అప్ప‌ట్లో సంస్థ‌ను ఎవ‌రో ఒక ఈ కామ‌ర్స్ సైట్‌కి అమ్మేయాల‌ని కూడా శ్రీ‌ప్రియ అనుకున్నారు. అయితే, 2013లో మైక్రోసాఫ్ట్ యాక్స‌ల‌రేట‌ర్ ప్రోగ్రామ్‌కి ఆమె షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆ త‌ర్వాత టార్గెట్ యాక్స‌లెరేట‌ర్‌లో కూడా ఫైన‌ల్ లిస్ట్‌కు సెలెక్ట్ కావ‌డంతో ( ఈ ప్రోగ్రామ్ కింద ట‌ర్న్‌ అరౌండ్‌కి సీడ్ ఫండింగ్ అందుతుంది) ఆమెకు త‌న ఐడియాపై న‌మ్మ‌కం మ‌రింత బ‌ల‌ప‌డింది. ప్రస్తుతం మింత్రా, ఫ్లిప్ కార్ట్, అర్బ‌న్ లాడ‌ర్ లాంటి అనేక ఈ కామ‌ర్స్ కంపెనీల‌తో క‌లిసి ట‌ర్న్ అరౌండ్ ప‌నిచేస్తోంది. ఆయా వెబ్ సైట్ల‌లో దుస్తులు, బ్యాగ్ లు, షూలు, ఫ‌ర్నిచ‌ర్ లాంటి అనేక కేట‌లాగ్ల‌లో వ‌స్తువుల ఫోటోగ్రాఫ్స్ ని ట‌ర్న్ అరౌండ్ ఎడిట్ చేస్తుంది.

స్టాన్స్ ఫార్డ్ యూనివ‌ర్శిటీ ఆఫ‌ర్ చేసే ఇగ్నైట్ ప్రోగ్రామ్ ఆన్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేష‌న్‌లో కూడా శ్రీ‌ప్రియకు ప్ర‌వేశం ద‌క్కింది. ఈ మూడేళ్ళ‌లో స్టార్ట‌ప్‌ను ఎలా పైపైకి తీసుకురావాలి... అనే విష‌యంలో శ్రీ‌ప్రియ‌కు చాలా స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

నాస్కాం  ప్రోడక్ట్ కాంక్లావ్  లో  శ్రీప్రియ

నాస్కాం ప్రోడక్ట్ కాంక్లావ్ లో శ్రీప్రియ


ఇప్పుడు ఈకామ‌ర్స్ క్ల‌యింట్ల‌కు ప్రోడ‌క్ట్లు ఎలా అమరుతాయో తెలియ‌జెప్పే టూల్స్ మీద ట‌ర్న్ అరౌండ్ వ‌ర్క్ చేస్తోంది. చాలా కాలంగా ఇమేజ్ ఎడిటింగ్... ఫోటో షాప్ పైనే మాన్యువ‌ల్‌గా జ‌రుగుతోంది. ఒక్కో ప్రోడ‌క్ట్ కు 12 నుంచి 24 ఇమేజ‌ెస్ ఎడిట్ చేయ‌డంలో చాలా కాలం వృధా అవుతోంది.

పిక్స్ట‌ర్ (Pixter) పేరుతో రూపొందిన ఈ ప్రోడ‌క్ట్ బీటా వ‌ర్ష‌న్ ఈ మ‌ధ్యే విడుద‌లైంది. టెక్నాల‌జీ స‌హాయంతో చేసే ఈ ఇమేజ్ ఎడిటంగ్ టూల్ ఈ కామ‌ర్స్ ప‌నిని మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంది. ప్ర‌స్తుతానికి 80 శాతం ఇమేజ్ ని ఈ టూల్‌తో ఆటోమేటిక్ గా మెరుగుప‌ర‌చ్చ‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో దీన్ని 95శాతానికి పెంచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. OLX, క్విక‌ర్ లాంటి వెబ్ సైట్ల‌లో యూనిఫామ్ బ్యాక్ గ్రౌండ్ లేని ప్రోడ‌క్ట్స్ వుంటాయి. వీటికి కూడా ఈ టూల్ ఉప‌యోగ‌ప‌డేలా చేయ‌డ‌మే ప్ర‌స్తుతం ట‌ర్న్ అరౌండ్ ముందున్న స‌వాలు. ప్ర‌స్తుతానికి కేట‌లాగింగ్ అంతా మాన్యువ‌ల్ గా ముక్క‌లు ముక్క‌లుగా జ‌రుగుతోంది. టెక్నాల‌జీ సాయంతో దీన్ని మార్చాల‌ని ట‌ర్న అరౌండ్ ప్ర‌య‌త్నిస్తోంది.

టర్న్ అరౌండ్ సిస్టమ్స్ టీం

టర్న్ అరౌండ్ సిస్టమ్స్ టీం


టెక్నాలజీ ఒక నిరంత‌ర అధ్యయ‌నం

బిజినెస్ లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు తీర్చేదే టెక్నాల‌జీ అని శ్రీ‌ప్రియ అంటారు. జీవితంలో కొన్ని విష‌యాల్లో రాజీ ప‌డొచ్చు.. కొన్నిటిలో రాజీ ప‌డ‌లేం. ఈ రెండిటి మ‌ధ్య స‌మ‌తుల్యం సాధిస్తే జీవితం స‌రైన దారిలో సాగుతున్న‌ట్టే అంటారు శ్రీ‌ప్రియ‌. దేన్నీ మ‌ధ్య‌లో వ‌దిలేయ‌క‌పోవ‌డం, డెడ్ లైన్ లోపే ప‌నిపూర్తి చేయ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌ప్రియ స‌క్సెస్ ఫార్ములా అని చెప్పొచ్చు. మార్కెట్ లో ఉప‌యోగం లేని ప్రోడ‌క్ట్ త‌యారు చేయ‌డం కంటే, అస‌లు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని శ్రీ‌ప్రియ అభిప్రాయం.

త‌ను న‌మ్మిన దారిలో న‌డ‌వ‌డానికి ఇష్ట‌ప‌డే శ్రీ‌ప్రియ జీవితంలో రెండు విలువ‌లు ముఖ్య‌మంటారు..

1. ప‌నికొచ్చే విష‌యాల‌కే టైమ్ కేటాయించు. అది నీకు తృఫ్తినైనా ఇవ్వాలి.. లేదా ఉప‌యోగ‌క‌ర‌మైన ఫ‌లితాన్నైనా ఇవ్వాలి.

2. నీ నిర్ణ‌యాల‌కు నువ్వే జ‌వాబు దారి.. ప్ర‌తిరోజూ నాకు రెండు ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతాయి.. ఆర్ అండ్ డి మీద ఖ‌ర్చుపెట్టాలా.. మార్కెటింగ్ చూసుకోవాలా... అని.. నాకు ఏది స‌రైన‌ద‌నిపిస్తే అది చేస్తాను... ఫ‌లితానికి నేనే జ‌వాబుదారి..