ఓ సాధారణ కామర్స్ విద్యార్థి... ఇప్పుడో కార్పొరేట్ ఫ్లోరిస్ట్ !

ఓ సాధారణ కామర్స్ విద్యార్థి... ఇప్పుడో కార్పొరేట్ ఫ్లోరిస్ట్ !

Sunday October 11, 2015,

4 min Read


అతడికి అమ్మడం, కొనడం అంటే మహా సరదా. ఏదైనా ఒక వస్తువును బావుందని మెప్పించి, ఇతరుల చేత కొనిపించడం అంటే విపరీతమైన ఇష్టం. అందుకే ఇంటర్మీడియెట్‌ చదువుతుండగానే వ్యాపారంలోకి దిగిపోయాడు. టపాసులు, గ్రీటింగ్ కార్డులు.. ఇలా ఒకటేమిటి.. ఆ సీజన్‌లో ఉన్న బిజినెస్‌ను ఎలా క్యాష్ చేసుకోవాలో అప్పుడే ఔపోసన పట్టేశాడు. అది కూడా ఇంట్లో ఎవరికీ తెలియకుండానే. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ... వివిధ కంపెనీల్లో ఉన్నతోద్యోగాలు, పదేళ్ల క్రితమే ఆన్‌లైన్ వ్యాపారం... అబ్బో అదో పెద్ద స్టోరీ. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆ కుర్రాడే ఇప్పుడు 365 పెటల్స్ అధినేత మంగిన ప్రభాకర్. హైదరాబాద్ ఫ్లోరల్ బిజినెస్‌లో ఆయనది ఓ ప్రత్యేకమైన స్థానం. 11 టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లు, 60 కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆయన క్లైంట్లు. ఏడాదికి మూడు కోట్లు టర్నోవర్ సాధిస్తూ.... బడా కంపెనీలతో పోటీపడ్తున్న 365 పెటల్స్.. సక్సెస్ వెనుక ఎంతో కృషి దాగుంది. ఎన్నో ఎదురుదెబ్బలు.. మరెంతో అనుభవం.. అన్నీ వెరసి విజయానికి బాటలు వేశాయి.

image


కామర్స్‌ చదవడం కంటే వ్యాపారం చేయడమే ఇష్టం

ప్రభాకర్‌ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం. తండ్రి విద్యుత్ శాఖలో ఛార్టెడ్ అకౌంటెంట్. చిన్నప్పుడే కుటుంబమంతా హైదరాబాద్ వచ్చేసింది. అతని స్కూలింగ్ అంతా ఇక్కడే సాగింది. తండ్రి అకౌంటింగ్ విభాగంలో పనిచేయడంతో కొడుకును కూడా సిఏ చదివించాలని తాపత్రయం. కానీ ప్రభాకర్‌కు ఏమో అదంత పెద్దగా బుర్రకెక్కే సబ్జెక్ట్ కాదు. బద్రుకా డిగ్రీ కాలేజీలో బికాం పూర్తిచేసి.. రెండేళ్లు కష్టం మీద సిఏ ఇంటర్న్‌షిప్ కోర్స్ చేశాడే కానీ.. దానిపై మనసే లేదు. ఈ మధ్యలోనే సీజనల్ వ్యాపారాలపై దృష్టి మళ్లింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండానే చిన్నాచితకా వ్యాపారాలు చేసి నాలుగు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కొద్దికాలం తర్వాత అల్కాటెల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మొదటి ఉద్యోగంలో చేరారు. 1994 నుంచి 1996 వరకూ రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ.. కస్టమర్లను ఆకట్టుకోవడం, సేల్స్‌ను గణనీయంగా పెంచడంలో కీలకపాత్ర పోషించడంతో యాజమాన్యం కళ్లలో పడ్డారు. అయితే ఈ లోపే ఉద్యోగం బోర్ కొట్టేసింది. తానే ఏదో ఒకటి సొంతంగా చేయాలనే తపన మొదలైంది. అయితే చివరకు యాజమాన్యమే ఒప్పించి.. అల్కాటెల్ డీలర్‌షిప్‌ను ఇచ్చింది. ఈ వ్యాపారం కూడా బాగానే సాగుతూ వచ్చింది.

ఈ లోపు వై2కె ఫీవర్ మొదలవడంతో 1999లో ఓ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఓ భాగస్వామితో కలిసి మెయిన్‌ఫ్రేమ్ విద్యార్థులకు శిక్షణనివ్వాలని అనుకున్నారు. అదంతగా సక్సెస్ కాకపోవడంతో ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్‌ పేరుతో ఫుల్‌గా మార్కెటింగ్ చేసి.. అప్పట్లో చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు చెప్తారు ప్రభాకర్. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కంప్యూటర్ ఇన్‌సిట్యూట్‌లో చేరడంతో ఫ్యాకల్టీ కొరత పెరిగింది. దీంతో అతనే ఒరాకిల్, డేటాబేస్ నేర్చుకుని ప్రోగ్రామర్ అవతారం కూడా ఎత్తారు. 1999లో BANANASTUFF.COM అనే సంస్థను ప్రారంభించారు.

image


బనానా స్టఫ్ బంపర్ హిట్

అప్పుడప్పుడే ఆన్‌లైన్ గురించి జనాలు మాట్లాడుకోవడం, ఈ-కామర్స్ కాస్త ఆసక్తికరంగా కనిపించడంతో ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ప్రభాకర్. ఇదో గిఫ్టింగ్ సొల్యూషన్ సంస్థ. పూలు, కేకులు, చాక్లెట్స్, గిఫ్ట్స్‌ను ప్యాక్ చేసి.. వాళ్లు కోరిన అడ్రస్‌కు డెలివర్ చేయడం వీళ్ల పని. పుల్లారెడ్డి నుంచి స్వీట్లు, బేకర్స్ ఇన్ నుంచి కేకులు, వివిధ సంస్థల నుంచి చాక్లెట్లు, ఫ్లోరిస్టుల నుంచి పూలు సేకరించి.. డెలివర్ చేసేవారు. సింపుల్‌గా చెప్పాలంటే.. అన్నింటినీ ఔట్ సోర్స్ చేసేవారు.

'' చాలా ఆసక్తిగా కనిపించడంతో పాటు వివిధ దేశాల నుంచి జనాలు ఆర్డర్లు ఇచ్చేవారు. యూఎస్‌తో పాటు నైజీరియా, జమైకా నుంచి కూడా ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం మెయిల్స్ రావడం చూసి నాకు ఆశ్చర్యం అనిపించేది. వాటిని డెలివర్ చేయడం నాకు చాలా సరదాగా ఉండేది. 1999 నుంచి 2007 వరకూ వ్యాపారం నిలకడగా వృద్ధి సాధిస్తూ అభివృద్ధి చెందింది. అప్పట్లోనే నెలకు రూ.8 లక్షల టర్నోవర్ ఉండేది ''.

అయితే ఇదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే వారు. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ఎక్కడో ఉండడం, సరకు డెలివర్ చేసిన తర్వాత రెండు, మూడు నెలలకు పేమెంట్ రావడంతో రొటేషన్‌ చాలా ఇబ్బందయ్యేది. దీంతో మెల్లిగా ఆన్‌లైన్ వ్యాపారానికి ప్రాధాన్యం తగ్గించడం మొదలుపెడ్తున్న సమయంలో ఫ్లోరల్ బిజినెస్ ఆసక్తిగా కనిపించింది. ఎందుకంటే.. పెద్ద బిజినెస్ ఉన్నా ఫ్లోరిస్టులతోనే సమస్య ఎదురయ్యేది. వాళ్లు సరైన వేళకు రాకపోవడం, అనుకున్న సమయానికి బెంగళూరు నుంచి పూలు డెలివర్ జరగకపోవడం కాస్త చికాకుగా అనిపించేది. ధైర్యం చేసి 2000లో ఓ ఇన్‌హౌస్ ఫ్లోరిస్ట్‌‍ను నియమించుకున్నారు. 2004కు వాళ్ల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ వ్యాపారం మెరుగ్గా ఉండడంతో ఫ్లోరల్ వ్యాపారాన్ని ప్రత్యేకంగా విభజించాలని ప్రభాకర్ నిర్ణయించారు. ఎందుకంటే.. అప్పటికే తమ బెంగళూరు సహా ఇతర ప్రాంతాల నుంచి పూలు వస్తూ ఉండేవి. వాటిని డిజైన్ చేయడం కూడా స్టాఫ్ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. అలా మొదలైన శ్రీలాస్య ఇన్నోవేషన్స్.. 3 వేల ఆదాయం నుంచి రూ. ఇప్పుడు నెలకు రూ.25 లక్షలకు పెరిగింది.

image


ఇదేం చిన్న వ్యాపారం కాదు

2001 సమయంలో ఓ సారి వాలెంటైన్స్ డే రోజున పూల కోసం నాలుగు వందలకు పైగా ఆర్డర్లు రావడంతోనే.. దీని సత్తా ఏంటో అప్పుడే అర్థమైంది ప్రభాకర్‌కు. అందుకే అప్పటి నుంచి మెల్లిగా ఈ ఫ్లోరల్ వ్యాపారాన్ని కూడా ఓ కంట కనిపెడుతూ వచ్చారు. అప్పటికే టెక్నాలజీ గురించి అవగాహన ఉండడం, ఈమెయిళ్లతో సమాచారం, వెబ్ సైట్ వంటి హంగులు ఉండడంతో.. కార్పొరేట్ కంపెనీలు కొద్దిగా వీళ్ల వైపు మొగ్గుచూపడం మొదలుపెట్టాయి. సాధారణ ఫ్లోరిస్టులతో పోలిస్తే.. వీళ్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. 2005 జివికె ఇండస్ట్రీస్ .. 365 పెటల్స్‌కు మొదటి బ్రేక్ ఇచ్చింది. వాళ్ల హోటల్స్‌ అన్నింటిలో ఫ్లోరల్ డెకొరేషన్‌ బాధ్యతలను వీళ్లకు అప్పగించారు. అప్పుడే వీళ్ల కంపెనీ దశ తిరగడం మొదలైంది.

అప్పుడు మొదలైన పరుగు.. ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలవైపు మళ్లింది. యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, తాజ్ గ్రూప్ హోటల్స్, పార్క్ హయత్, ఫలక్‌నుమా ప్యాలెస్.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలూ వీళ్లకే ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. 2006లో హైదరాబాద్‌లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌ సమయంలో తన పనితనం చూపించి 2007లో హెచ్ఐసిసి, నోవోటెల్ ప్రాపర్టీల్లోనూ పాగా వేసింది.

image


ఇప్పుడు 365 పెటల్స్ 11 ఫైవ్ స్టార్ హోటల్స్, 60 కార్పొరేట్ కంపెనీలకు అధికారిక ఫ్లోరల్ సప్లయర్‌గా ఎదిగింది. ఇప్పుడు ఈ సంస్థ వార్షికాదాయం రూ.3 కోట్లు దాటింది. సంస్థలో 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది ఎక్కువగా అవ్యవస్థీకృత రంగం కావడంతో పెద్దగా పోటీ లేదు. అయితే స్థానిక చిన్న వెండర్స్‌ని కూడా పోటీగానే భావించాల్సి ఉంటుందని చెప్తారు ప్రభాకర్. మరింత వేగంగా విస్తరించడానికి నిధుల సమీకరణ వేటలో పడ్డారు ప్రభాకర్. ప్రస్తుతానికి హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైనా.. భారత్‌లో టాప్ ప్లేయర్‌గా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

'' ఫ్లోరల్ బిజినెస్‌లో ప్రస్తుతం ఫెర్న్స్ అండ్ పెటల్స్ భారత్‌లో నెంబర్ ఒన్ స్థానంలో ఉంది. వాళ్లతో పోలిస్తే.. మేము చేసే వ్యాపారం బాగా తక్కువ. కానీ ఈ రంగంలో ఉన్న అవకాశాన్ని గుర్తించేందుకు అది దోహదపడ్తుంది. ఐదారేళ్లలో రూ.200 కోట్ల టర్నోవర్ చేయాలనే చూస్తున్నాం. ఇంత పెద్ద లెక్క చూసి మీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ ఫ్లోరల్ బిజినెస్‌కు ఎవరూ ఊహించనంత మార్కెట్ ఉంది '' అంటూ ముగిస్తారు ప్రభాకర్.


website