అమెరికాలో మనవాళ్లకు ఉద్యోగాలు వెతికిపెట్టే దేశీ ఓపిటి డాట్ కామ్

వీసా అప్లికేషన్ తీసుకున్న రోజు నుంచే సలహాలు అందిచే స్టార్టప్...ఉచితంగా విద్యార్థులకు సాయం చేసే న్యూజెర్సీ సంస్థ...తెలుగు ఎన్నారైలు కలసి ప్రారంభించిన కంపెనీ...ఫండ్ రెయిజింగ్ పై కో ఫౌండర్ నరేందర్ ఆశాభావం...

అమెరికాలో మనవాళ్లకు ఉద్యోగాలు వెతికిపెట్టే దేశీ ఓపిటి  డాట్ కామ్

Friday June 26, 2015,

3 min Read

మీరు మొదటిసారి అమెరికా వెళ్తున్నారా? స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్తున్నారా? లేక H1B వీసాతో వెళ్తున్నారా ? వీసా ఏదైనా సరే అక్కడకు వెళ్లాక ఎక్కడుండాలి ? పార్ట్ టైం ఉద్యోగం ఏమైనా దొరుకుతుందా ? ఆఫీసు ఎక్కడుంది ? కాలేజీ నుంచి హాస్టల్ ఎంతదూరం ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అటు విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్పన్నం అవుతాయి. వీటన్నింటికీ ఒకటే సమాధానం అది దేశీఆప్ట్(DesiOPT). ఇది ఒక జాబ్ కన్సల్టెన్సీలా పనిచేసినా సాధారణ విదేశీ కన్సల్టెంట్లకంటే దేశీ ఓపిటీ వందరెట్లు ప్రత్యేకమైనదని ఆ సంస్థ కోఫౌండర్ నరేందర్ ఎల్లంకి అంటున్నారు.

image


ఇది మొదలు

దేశీ ఓపిటి ప్రారంభించడానికి తను అనుభవించన ఇబ్బందులే కారణమంటారు నరేందర్. మొదటి సారి అమెరికా వెళ్లే టప్పుడు ఎన్నో రకాల భయాలు తనని వెంటాడాయట. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సామనుల తనిఖీ (లగేజి చెకింగ్) నుంచి అమెరికాలోని తాను చేరుకున్న ప్రాంతంలో ఎయిర్ పోర్టు దగ్గర క్యాబ్ ఎక్కే వరకూ ఎన్నో రకాలుగా ఊహించుకున్నారట. కానీ అక్కడకు చేరుకున్నాక పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. చదువు, ఉద్యోగ నిమిత్తం తనలాగే చాలా మంది మధ్యతరగతి యువకులు అమెరికా చేరుకునే క్రమంలో నానా అగచాట్లు పడక తప్పడం లేదు. దీనికి సరైన పరిష్కారం చూపించాలనుకున్నారు నరేందర్. కొన్నాళ్లయ్యాక స్థానికంగా ఉన్న మరికొంతమందితో కలసి దీన్ని ప్రారంభించారు.

దేశీ ఓపిటి ప్రత్యేకత

''సాధారణ కన్సల్టెన్సీలు విద్యార్థులకు ఉపయోగపడే క్రమం కంటే తలనొప్పులు తీసుకు రావడమే ఎక్కువ. విద్యార్థులు చదువుల కోసం విసా అప్లై చేసుకున్న క్షణం నుంచే తమను సంప్రదిస్తే విసా ప్రాసెసింగ్ అవుతున్న కాలంలోనే తగు తర్ఫీజు ఇస్తారు. అమెరికాలో చదువుకుంటుండగా పార్ట్ టైం/ఫుల్ టైం ఉద్యోగాలను వెతికి పెట్టే ఫ్లాట్ ఫాం ఇది. దాంతో పాటు చదువయిన క్షణం నుంచే మంచి ఉద్యోగంలో ప్లేస్ చేసేందుకు ప్రయత్నిస్తాం. ఏ యూనివర్సిటీలో చేరాలి, ఎలాంటి కోర్సులు చేయాలి లాంటివి వాటిపై దేశీఓపిటి గైడ్ చేస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు అమెరికా రావాలన్నా వారికి తగిన మార్గదర్శన చేస్తుంది. సాధారణ కన్సల్టెన్సీలు ఇలా చేయడానికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తాయి. కానీ దేశీఓపిటి ఉచితంగా ఈ సేవలన్నీ చేస్తుంది. విద్యార్థులకు కౌన్సిలింగ్ దగ్గర నుంచి ఎక్కడా ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. అందుకే అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు దేశీఓపిటి ఫేవరేట్ డెస్టినేషన్'' అవుతోందని నరేందర్ చిరునవ్వులు చిందించారు.

కో ఫౌండర్ నరెందర్ ఎల్లంకి

కో ఫౌండర్ నరెందర్ ఎల్లంకి


దేశీఓపిటి వెనుక ఎవరు ?

దేశీఓపిటి ఆలోచన వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ దీని వెనక ఎంతో మంది కష్టపడ్డారంటారు నరెందర్. అమెరికాకు చెందిన తెలుగు ఎన్నారైలు చాలా మంది దేశీ ఓపిటీ కోసం ఇప్పటికీ పనిచేస్తున్నారు. న్యూజెర్సీ కేంద్రంగా 2008లో ఇది ప్రారంభమైంది. ఎందరో విద్యార్థులకు ఇప్పటి వరకూ ఉద్యోగాలను చూపించింది. ఆ విద్యార్థులు కంపెనీలో ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. వారంతా ఇప్పుడు కొత్త వారికి ఉద్యోగావకాశాలను ఇస్తున్నారు. ఇదొక చైన్ సిస్టమ్‌లా పనిచేస్తుంది. నిరంతరాయంగా ఉద్యోగాలు కల్పించే వ్యవస్థగా మారబోతోంది.

భవిష్యత్ లక్ష్యాలు

ప్రస్తుతం అమెరికాలో ఉన్న దాదాపు 150కి పైగా యూనిర్సిటీలకు విద్యార్థులను కనెక్ట్ చేస్తుంది దేశీ ఓపిటి. 2500ల కంటే ఎక్కువ కంపెనీలకు అనుసంధానం చేస్తుంది. అయితే దీన్ని వచ్చే ఏడాదికల్లా రెట్టింపు చేయాలనేది ముందున్న లక్ష్యం. ఇప్పటి వరకూ భారత్‌లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో నగర వాసులకు సుపరిచితమైన తమ సేవలు ఇతర నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులను అమెరికా పంపడానికి కావల్సిన సలహాలు అందించడానికి వారికి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నామని నరెందర్ వివరించారు. ఇప్పటి వరకూ ఆన్‌లైన్లోనే సాగుతున్న తమ వ్యవస్థను స్థానికంగా ఆఫీసులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ముందుగా కార్యాలయాన్ని హైదరాబాద్ లో తెరవాలని అనుకుంటున్నారు. భవిష్యత్ లో బెంగళూరు , ఢిల్లీల్లో ఆఫీసులు తెరుస్తామని ప్రకటించారాయన.

image


ఆదాయ మార్గాలు

దేశీఆప్ట్ విద్యార్థుల దగ్గర ఎలాంటి ఫీజులు వసూలు చేయదు కనుక ఉద్యోగాలిచ్చే ఎంప్లాయర్స్ దగ్గర నుంచే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. దేశీఆప్ట్ ఫేస్ బుక్ పేజికి దాదాపు 92వేల లైకులున్నాయి. వెబ్ సైట్ కూడా బాగా పాపులర్ కావడంతో ఆన్ లైన్ యాడ్ల ద్వారా ఓ మోస్తరు ఆదాయం వస్తోంది. చివరగా ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నారు. భారీగా పెట్టుబడులు వస్తే మరింత మంది విద్యార్థులకు సాయం అందించగలమని నరేందర్ చెబ్తున్నారు.

విద్యార్థులను సంస్థ యజమానులతో అనుసంధానం చేస్తాం అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్న ఈ కంపెనీ తమ అంతిమ లక్ష్యం అమెరికా చదువుకున్న వారు అక్కడ నిరుద్యోగులుగా మిగలకూడదనే లక్ష్యంతో పనిచేస్తోంది. సో ఆల్ ది బెస్ట్ టు దేశీ ఓపిటి టీం.