బెంగళూరూ..! ఇక ఊపిరి పీల్చుకో..!!

0

ఐటీ కేపిటల్ బెంగళూరు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే మెట్రోకి దీటుగా పాడ్ టాక్సీ రాబోతోంది. ముగ్గురో నలుగురో కలిసి ప్రయాణించే కేబుల్ కార్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఎటుచూసినా భీకరమైన ట్రాఫిక్ తో సతమతమవుతున్న బెంగళూరు నగరం కేబుల్ కార్ రాకతో కాస్తయినా ఊపిరి పీల్చుకోనుంది.

కొన్ని కంపెనీల ప్రతిపాదన మేరకు కర్నాటక ప్రభుత్వం పాడ్ టాక్సీ ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందుకొచ్చింది. చివరి కిలోమీటర వరకు కనెక్టివిటీ ఇవ్వాలన్న లక్ష్యంతో మెట్రోకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయితే బెంగళూరు ప్రజలు ట్రాఫిక్ భూతం నుంచి దాదాపు బయటపడ్డట్టే. కేబుల్ కార్ ప్రయాణం అనుకున్నంత ఖరీదైనది కాదు. ఇంకా చెప్పాలంటే ఆటో కంటే తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరవచ్చు

మొదటి ప్రయత్నంగా మొత్తం ఆరు రూట్లలో, 35.5 కిలోమీటర్ల కనెక్టివిటీతో పాడ్ టాక్సీని నడపాలని బీబీఎంపీ భావిస్తోంది. వెహికిల్స్ అన్నీ ఆటోమేటిక్. నలుగురితో కూడిన చిన్నపాటి రవాణా వ్యవస్థకు ఎలాంటి ట్రాఫిక్ ఇరకాటం ఉండదు. కేబుల్ కార్ లాగా ఆకాశంలోనే రయ్య్‌ ను దూసుకెళ్తుంది.

ఫేజ్ 1: ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి లీలా ప్యాలెస్ జంక్షన్ వరకు.. దూరం 4 కి.మీ.

ఫేజ్ 2: లీలా ప్యాలెస్ నుంఇ మరతహళ్లి జంక్షన్ వరకు.. దూరం 6 కి.మీ

ఫేజ్ 3: మరతహళ్లి జంక్షన్ నుంచి ఈపీఐపీ వైట్ ఫీల్డ్ వరకు.. దూరం 6.5 కి.మీ

ఫేజ్ 4: ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి కోరమంగళ వరకు.. దూరం 7 కి.మీ

ఫేజ్ 5: జయానగర్ 4వ బ్లాక్ నుంచి జేపీ నగర్ ఆరో ఫేజ్ వరకు.. దూరం 5.3 కి.మీ

ఫేజ్ 6: సోనీ జంక్షన్ నుంచి ఇందిరానగర్ మెట్రో స్టేషన్ వరకు.. దూరం 6.7 కి.మీ

పాడ్ టాక్సీ పూర్తిగా సోలార్ పవర్‌ తోనే నడుస్తుంది. అతి తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ సిస్టమ్ పూర్తి కావడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలోనే కంప్లీట్ చేయాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ పద్దతిన ప్రాజెక్ట్ పూర్తిచేయాలని చూస్తున్నారు.

Related Stories

Stories by team ys telugu