3 రోజులు..రూ. 300 కోట్లు.. ఇదీ సంక్రాంతి కోడిపందాల టర్నోవర్ ..!?

3 రోజులు..రూ. 300 కోట్లు.. ఇదీ సంక్రాంతి కోడిపందాల టర్నోవర్ ..!?

Saturday January 16, 2016,

3 min Read

దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో చేసుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. మన పల్లెలకు కూడా ఈ సంక్రాంతి వచ్చింది. అది ఎలా అంటే మిలియన్ డాలర్ల మనీ ట్రాన్సాక్షన్ జరిగేంత. రంగుల గాలిపటాలు, బోగి మంటలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలు, ఎడ్లపందాలు, జల్లెకట్టులు లాంటి ప్రత్యేక ఆకర్షణ. ఇందులో ఎక్కువగా చర్చనీయాంశమైన విషయం కోడి పందాలు.

“ఉభయగోదావరి, కృష్ణ, నల్గొండ, ఖమ్మం,గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు ఎక్కువగా జరిగాయి”

గతేడాదితో పోలిస్తే ఈ సారి కోడి పందాల టర్నోవర్ డబుల్ అయింది. ఈ ఐదు జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ సారి ఓ మోస్తరుగా పందెం రాయుళ్లు కోళ్లను తయారు చేశారు.

image


గోదావరి జిల్లాల ప్రత్యేకత

ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడే జిల్లాలుగా ఈ రెండు జిల్లాలకు పేరుంది. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కనిపించినట్లుగా మరెక్కడా ఉండదనేది వాస్తవం. దీనికి కోడి పందేలే ప్రత్యేక ఆకర్షణ. ఈ రెండు జిల్లాలకు దాదాపు పదిలక్షల మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, బళ్లారి నుంచి తరలి వచ్చారంటే కోడి పందాలకు ఉన్న క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు.

“ప్రతి ఏడాది కనీసం పదిలక్షల బెట్టింగ్ చేయకపోతే ఆ సంవత్సరం నాకు పెద్దగా కలసి రాదు,” సుబ్బరాజు

భీమవరానికి చెందని సుబ్బరాజు చెప్పిన మాటలివి. గతంలో చేపల చెరువుల వ్యాపారం చేసిన సుబ్బరాజు ఇప్పుడు సింగపూర్ లో వ్యాపారం చేస్తున్నారు. బెంగళూరులో స్థిరపడినా ప్రతి సంక్రాంతికి సొంతూరు చేరుకుంటారు. యువర్ స్టోరీతో మాట్లాడుతూ ఇవన్నీ అనధికారకంగా సాగే వ్యాపారం కనక పూర్తి స్థాయి లెక్కలు చెప్పడానికి ఇష్టపడలేదు.

“సంక్రాంతి రోజుల్లో కోడి పందాల్లో గెలిస్తేనే ఆ ఏడాది వ్యాపారంలో రాణిస్తాం,” స్వామినాయుడు

అమలాపురానికి చెందిన స్వామినాయుడుకి ఉత్తరాంధ్ర లో గ్రానైట్ కంపెనీ ఉంది. వరంగల్ లో కూడా క్వారీలున్నాయి. ఈయన చెప్పిన ప్రకారం కోడి పందాలు వీరికి సెంటిమెంటు. సంక్రాంతి రోజు కోడి పందాల్లో పాల్గొనక పోతే వ్యాపారంలో నష్టం వస్తుందనే ఓ నమ్మకం వీరిది.

image


సెంటిమెంట్ గా ఇతర ప్రాంతాల్లో

కోడి పందాలకు లక్షల రూపాయిలతో ప్రిపేర్ కావడమే కాదు. దాన్ని పోగొట్టుకోడానికి సిద్ధపడతారు. ఈ ఏడాది గోదావరి జిల్లాల్లో కోడి పందాల్లో దాదాపు మూడు వందల కోట్లు ట్రాంజాక్షన్ జరిగినట్లు అనధికారికంగా అంచనా వేస్తున్నారు. పంట కోసిన తర్వాత ఖాలీగా ఉండే ఫీల్డుని కాక్ ఫైట్ ఫీల్డ్ గా మార్చేస్తారు. ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడతారు. ఫుడ్ కోర్టులు, ఎంటర్ టైన్మెంట్ తో ఆ మజానే వేరు. ఇదంతా గోదావరి జిల్లాల్లోనే మనం చూడొచ్చు. వీటిని జరపకూడదని నిషేధం ఉన్నా స్థానిక రాజకీయ నేతలో దీనిలో పాల్గొనడం విశేషం. హైదరాబాద్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ, వ్యాపార వేత్తలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, వారి పిల్లలు ఇలా చాలా మంది వీటిలో పాల్గొనడానికి గోదావరి జిల్లాలకు చేరుకుంటారు. జాగువర్, బెంజ్, బిఎండబ్యూ లాంటి లగ్జరీ కార్లన్నీ హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే హైవేపైనే కనిపిస్తాయి.

image


హైదరాబాద్ లో ఉండే ఉన్నత వర్గానికి చెందిన వారంతా ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, బీమవరం, అమలాపురం, తణుకు, కొయ్యిలగూడేం లాంటి ప్రాంతాలకు చేరుకోవడం మనం చూడొచ్చు. దీంతో పాటు ఇటీవల కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లో కూడా కోడి పందాలు జోరందుకున్నాయి. విజయవాడ నుంచి శ్రీమంతుల కుటుంబాలన్నీ ఇక్కడ కోడి పందాల్లో పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతంలో పందెంరాయుళ్ల జోరు కొనసాగింది.

హైదరాబాద్ నుంచి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు

గతంలో జరిగిన కోడి పందాలకు భిన్నంగా ఇప్పుడు మరింత ప్రొఫెషనలిజం సంతరించుకుంది. హైదరాబాద్ నుంచి పదులు సంఖ్యలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఎందరో ఈవెంట్ ఆర్గనైజర్లు గోదావరి జిల్లాలకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఈవెంట్లను ఆర్గనైజ్ చేశారు . ప్రతి రోజు ఉదయం నుంచి ఈవెంట్లను పక్కాగా అమలు చేశారు. క్యాడరింగ్ టీంలు ఇక్కడ లీడ్ తీసుకున్నాయి. హైదరాబాద్ లో పేరుగంచిన చాలా కంపెనీలు సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. సంక్రాంతిని ప్రత్యేక ఈవెంట్ గా మార్చడంతో బయటి నుంచి వచ్చిన వారికి మెరుగైన సౌకర్యాలు అందాయి. కోడి పందాలు జరిగే కోర్టుల్లోకి ప్రత్యేక పాస్ లను అందించడం, దీన్ని టికెటింగ్ ద్వారా అందుబాటులోకి తీసుకు రావడం మనం చూడొచ్చు.

“ఐదేళ్లుగా నేను భీమవరం సంక్రాంతి ఈవెంట్ చేస్తున్నా,” విక్కీ

ప్రతి ఏడాది మాకు భీమవరానికి చెందని ప్రసాద్ రాజు ఈవెంట్ అప్పగిస్తారు. అతిధులకు ప్రత్యేక హాస్పాటాలిటీ తోపాటు హైదరాబాద్ నుంచి సినీ హీరోయిన్స్ ని భీమవరానికి తీసుకెళ్లడం, డిజే లాంటి ఈవెంట్స్ ను మేం చేస్తున్నామని ఈవెంట్ ఆర్గనైజర్ విక్కీ చెప్పుకొచ్చారు.

image


స్థాయికి తగిన పందెం

కోడి పందెంలో పాల్గొనాలంటే మన స్టేటస్ ప్రకారం మనం పాల్గొనొచ్చు. కొన్ని కోటి రూపాయిల ప్రవేశ రుసుం ఉంటే కొన్నింటికి లక్ష రూపాయిలు ఉంటుంది. చిన్న చితకా పందేలైతే పదివేల నుంచి మొదలవుతాయి. మొత్తంగా భోగి,సంక్రాంతి, కనుమ రోజుల్లో దాదాపు మూడు వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని అనధికారిక సమాచారం. దీన్ని ప్రకటించడానికి అటు నిర్వాహకులు గానీ, ఇటు పాల్గొన్న వారు కానీ ఇష్టపడటం లేదు. ప్రభుత్వ నిషేధం అమలులో ఉన్నప్పటికీ స్థానిక అధికారులు, రాజకీయ నేతల సాయంతో ఏటికేడు ఈ పోటీలు కొనసాగుతునే ఉన్నాయి. మిలియన్ డాలర్ల బెట్టింగ్ కు కోడి పందాలు కేరాఫ్ అడ్రస్ గా మారుతునే ఉన్నాయి.