మ‌హిళా టెకీల ప‌నిభారానికి ఇలా చెక్ పెడ‌దాం.. !

మ‌హిళా టెకీల ప‌నిభారానికి ఇలా చెక్ పెడ‌దాం.. !

Sunday March 06, 2016,

3 min Read


మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆధునిక మ‌హిళ అంతా తానై స్వేచ్ఛ‌గా విహ‌రిస్తోంది. అణచివేతకు గురైన స్త్రీ నేడు అంత‌రిక్షాన్ని సైతం ముద్దాడింది. టెక్నాలజీ ఎంత ప‌రిణితి చెందినా మ‌హిళ ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఒత్తిళ్ల‌కు లోన‌వుతూనే ఉంది. త‌న కాళ్లపై తాను నిలుస్తున్న మ‌హిళను ప‌డ‌దోసే శ‌క్తులెన్నో ఆమె చుట్టూ మూగాయి.

ఈ మ‌ధ్య కాలంలో వర్కింగ్ విమెన్ అన్ని రంగాల్లోనూ విస్త‌రించారు. టాప్ కంపెనీల‌న్నింటిలోనూ సీఈవో స్థానం నుంచి కిందిస్థాయి కార్మికుల వ‌ర‌కూ రాణిస్తున్నారు. అయితే, తాజాగా జరిపిన పరిశీలనల్లో ఐటీ కంపెనీల్లో పురుషుల‌తో పోలిస్తే మ‌హిళా టెకీల సంఖ్య చాలా వ‌ర‌కు త‌గ్గుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఐటీ కంపెనీల్లో పురుషుల‌తో పోల్చితే మ‌హిళా టెకీల నిష్ప‌త్తి 31 శాతం ఉంది. అదే భార‌త్ లో మాత్రం ఇది 21 శాతంగా ఉంది.

image


స‌వాల‌క్ష కార‌ణాలు...

పురుషులం హాపీగా, సాఫీగా మ‌హిళ‌లు త‌మ కెరీర్ల‌లో కొన‌సాగలేక‌పోతున్నారు. అందుకు కార‌ణాలు అనేకం. కుటుంబ ఒత్తిళ్లు, ఆరోగ్యం, ప‌నిచేసే చోట ప‌రిస్థితులు.. ఇలా స‌వాల‌క్ష కార‌ణాలు. భార‌తీయ స‌మాజంలో వ‌ర్కింగ్ మెన్‌తో పోల్చితే వ‌ర్కింగ్‌ విమెన్‌కు బాధ్య‌త‌లు ఎక్కువ. ఆఫీసు త‌ర్వాత ఇంటికి వెళ్లి గృహిణిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాలి. పిల్లలు, వారి చదువులు, అత్తామామ, వారి ఆలనాపాలనా, ఇలా చాలామంది మహిళలు కెరీర్ వ‌దులుకుంటున్నారు. భ‌ర్త మ‌రో చోటికి ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌డం, కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి మెరుగవడం, ఒకరు పనిచేస్తే చాలాదా అన్న నిర్ణయానికి రావడం.. లాంటి కారణాలు మ‌హిళ‌లు ఉద్యోగాన్ని వ‌దిలేసేలా చేస్తున్నాయి. కెరీర్ల‌ను అర్థాంతరంగా వ‌దిలి వెళ్ల‌డంతో కంపెనీల‌కు సైతం న‌ష్టం కలుగుతోంది. ఎందుకంటే కంపెనీలు ట్రైనింగ్ ల పేరిట ఇత‌ర ప్రోగ్రాంల పేరిట ఉద్యోగుల‌పై బోలెడు పెట్టుబ‌డులు పెడ‌తాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు వ‌దిలి వెళ్లిపోతే చాలా న‌ష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం వెతికి పనిలో పడింది కార్పొరేట్ ప్రపంచం.

ప‌రిష్కారం క‌నుగొందాం...

మ‌హిళ‌లు తమ కెరీర్ల‌ను అర్థాంత‌రంగా వ‌దిలివెళ్లిపోకుండా, వాళ్ల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు కంపెనీలు వినూత్న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. కేవలం మ‌హిళ‌ల‌ను మాత్ర‌మే భాగ‌స్వాముల‌ను చేసి టెక్ ఈవెంట్లు, కాన్ఫ‌రెన్స్‌లు ఏర్పాటుచేయ‌డం లాంటివి చేస్తున్నారు. అలాగే వ్య‌క్తిత్వ వికాస నిపుణులతో ఉద్యోగాన్ని, కుటుంబ బాధ్య‌త‌ల‌ను బాలెన్స్ చేసేలా కౌన్సెలింగ్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. ఇక ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌ల‌ను ఒక వేదిక‌పైకి తెచ్చిన సంస్థ’’ గ్రేస్ హాప‌ర్ సెలెబ్రెష‌న్’’ సంస్థ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌హిళా టెకీల‌ను ఒక వేదికపైకి తెచ్చింది. ఈ సంస్థలో ప్ర‌పంచస్థాయి మార్కెట్ లో పేరొందిన మ‌హిళా సీఈవోలు, కంపెనీ డైర‌క్ట‌ర్లు, ఇత‌ర కీల‌క స్థానాల్లో ప‌నిచేసే వారంతా ఉన్నారు. ఈ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు చోట్ల స‌ద‌స్సుల‌ను సైతం నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సుల్లో ముఖ్యంగా మ‌హిళా టెకీల స‌మ‌స్య‌లు, సాంకేతిక స‌మ‌స్య‌లు, ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణలు, రీసెర్చ్ తదిత‌ర విష‌యాల‌పై చ‌ర్చిస్తారు. రేప‌టి త‌రం మ‌హిళ ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌పై కూడా ప‌రిష్కార మార్గాన్ని ఈ సంస్థ చ‌ర్చిస్తోంది.

మ‌హిళ‌లను ప్రోత్స‌హించేందుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు

చాలా సంస్థ‌లు వ‌ర్కింగ్ ఉమెన్ ను ప్రోత్స‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్ర‌సూతి సెల‌వుల‌ను 12 వారాల నుంచి 24 వారాల‌కు పెంచింది. అలాగే మ‌రో నాలుగు నెల‌ల ప్ర‌సూతి సెల‌వును పొడిగించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. అలాగే గ‌ర్భిణులకు ప‌నిగంట‌ల్లో కూడా మిన‌హాయింపులు ఇచ్చింది. ఇక వీఎం వేర్ సంస్థ అయితే మ‌హిళా ఉద్యోగుల‌ను ప్రోత్స‌హించేందుకు కొత్త‌ మ‌హిళా ఉద్యోగుల‌ను సంస్థ‌లో చేర్పించిన వారికి రిఫ‌ర‌ల్ బోన‌స్ ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. భారత్ లోని టాటా గ్రూపు సెకండ్ కెరీర్ ఇంట‌ర్న్ షిప్ ప్రోగ్రాం పేరిట కెరీర్‌ను రీస్టార్ట్ చేసే మ‌హిళ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు ఇస్తోంది.

ప‌నిఒత్తిడికి ప‌రిష్కారం

మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప‌నిలో ఒత్త‌డికి గుర‌వుతుండ‌డంతో కెరీర్ల‌ను ఆపేస్తున్నారు. ముఖ్యంగా మ‌హిళా టెకీలు ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేటప్పుడు ప‌నివేళ‌లు స‌రిపోవ‌క పోవ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా ఒత్తిడికి గుర‌వుతున్నారు. అదే పురుషులు ఎక్స్ స్ట్రా ప‌నిగంట‌లు చేసి ప్రాజెక్టు పూర్తి చేసే వీలుంది. కానీ కుటుంబ బాధ్య‌త‌ల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు అది సాధ్య‌ప‌డ‌దు. అందుకే పింట్‌రెస్ట్ సంస్థ మ‌హిళా ఉద్యోగుల‌ను ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు మ‌హిళా, పురుష ఉద్యోగుల‌కు ప‌ని విభ‌జ‌న‌లో జాగ్ర‌త్త‌లు పాటిస్తోంది. అలాగే ప్రత్యేక శిక్ష‌ణ వ‌ల్ల కూడా ప‌ని ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం ఉంది.

భవిష్యత్తుకు బంగారు బాట..

మాస్ట‌ర్ కార్డ్ ఇండియా సంస్థ గ‌ర్ల్స్ 4 టెక్ అనే వినూత్న‌మైన కార్య‌క్ర‌మాన్ని తీసుకుంది. స్కూళ్ల‌లో బాలిక‌లకు సైన్స్ మ‌రియు మ్యాథ్స్ ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగేలా కార్య‌క్ర‌మాలు రూపొందించింది. అలాగే డెల్ ఇండియా పాఠ‌శాల‌ల్లో బాలిక‌ల‌కు ఐటీ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. భ‌విష్య‌త్తులో మ‌హిళా టెకీల‌ను త‌యారుచేసేందుకు కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. కంపెనీలు ప్ర‌స్తుతం మ‌హిళ‌ల‌ను ప‌నిచేయించుకొని వ‌దిలి వేయ‌డ‌మే కాకుండా వారి బాగోగుల‌ను సైతం దృష్టిలో ఉంచుకొని భ‌విష్య‌త్తుకు భ‌రోసాను ఇస్తోంది.