అన్నార్తుల అక్షయ పాత్ర ‘ఫీడ్ యువర్ నైబర్’

అన్నార్తుల అక్షయ పాత్ర ‘ఫీడ్ యువర్ నైబర్’

Thursday November 19, 2015,

4 min Read

అర్ధరాత్రి వేళ ఆమెకు వేసిన ఆకలి పది మందికీ అన్నం పెట్టేలా ప్రేరేపించింది. అనుకున్నదే తడువుగా సోషల్ మీడియా సాయంతో మద్దతు కూడగట్టింది. ఆలోచనగా మొదలై అది ఉద్యమం స్థాయికి చేరింది. అంతే కేవలం 11 రోజుల్లోనే 1,22,937 మంది ఆకలి తీరింది. అదింకా కొనసాగుతూనే ఉంది. ఈ సామాజిక ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి పేరు మహితా ఫెర్నాండెజ్ కాగా.. ఆమె మొదలుపెట్టిన ఆ కార్యక్రమం ‘ఫీడ్ యువర్ నైబర్’.

image


మహితా ఓ ఆంట్రప్రెన్యూర్. గత ఐదేళ్లుగా బెంగళూరులో సొంతంగా ఓ చిన్నపిల్లల ఆటస్థలాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఇన్ఫోసిస్, కెవిన్ కేర్, హెన్కెల్ లాంటి టాప్ కార్పొరేట్ కంపెనీల్లో పని చేసిన అనుభవం ఆమె సొంతం. ఇన్నేళ్లుగా తనదైన ప్రపంచంలో బతికిన మహిత ఆలోచనలు ఒక్కరోజులోనే పూర్తిగా మారిపోవడానికి కారణం ఆకలి. ఓ అర్ధరాత్రి వేళ ఆకలిగా అనిపించి ఆమెకు సరిగా నిద్రపట్టలేదు. ఆ సమయంలోనే ‘ఫీడ్ యువర్ నైబర్’ ఆలోచన ఆమె మదిలో మెదిలింది. ఒక్కపూట కూడా కడుపు నిండా తిండికి నోచుకోలేని అభాగ్యుల కోసం ఏదైనా చేయాలని మహిత అనుకున్నారు. తన ఆలోచనను ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో పది మందితో పంచుకున్నారు. ‘ఆ రాత్రి నేను దాని గురించి అరగంట పాటు ఆలోచించాను. తర్వాత రోజు ఉదయాన్నే ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో ప్రకటించాను. నేను చేసిందల్లా సోషల్ మీడియాను సరిగా వినియోగించుకోవడమే. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ఒక్కరే తన సర్వస్వాన్ని ధారపోయాల్సిన అవసరం లేదు. పది చేతులూ కలిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం. దీనివల్ల మొత్తం సమాజానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది’ అని మహిత తెలిపారు. తన ఆలోచనకు మద్దతు కూడగట్టడానికి మహిత పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. మొదట కొందరు వ్యక్తులు ఫీడ్ యువర్ నైబర్ గురించి తెలుసుకొని తమవంతు సాయం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారే తమ స్నేహితులు, బంధువులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. ‘ఒక వ్యక్తి ఐదు ప్లేట్ల భోజనం వండి పెట్టడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తులు 2000 మంది కలిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఫీడ్ యువర్ నైబర్ విషయంలోనూ అదే జరిగింది’ అని మహిత చెబుతున్నారు. పక్కనున్నవారి ఆకలి తీర్చే పని కావడంతో ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సంత్రుప్తి చెందుతున్నారు.

image


image


పంపిణీతోనే సమస్య

పక్కవాడి కడుపు నింపే తన ఆలోచనకు వేల మంది మద్దతు కూడగట్టి కార్యరూపంలోకి తీసుకువచ్చినా.. దానిని అమలు చేయడంలోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని మహిత అంటున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా అమలు చేస్తున్న కార్యక్రమం కావడంతో.. వండిన ఆహారం ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తుంది? వాటికి దగ్గర్లో ఏ పంపిణీ కేంద్రాలు ఉన్నాయి? అక్కడి నుంచి ఏఏ ప్రాంతాల్లో వాటిని పంపిణీ చేయాలన్నది సమస్యగా మారింది. మొదట 11 రోజులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. మొదటి రోజు 4454 భోజనాలను పంపిణీ చేయగలిగారు. దీంతో ఫీడ్ యువర్ నైబర్ టీమ్ కు కార్యక్రమం విజయవంతమవుతుందన్న నమ్మకం కుదిరింది. అత్యధికంగా పదో రోజు 19440 భోజనాలను వారు పంపిణీ చేయగలిగారు. మొత్తంగా 11 రోజుల్లో 1,22,937 భోజనాలను ఫీడ్ యువర్ నైబర్ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం గమనార్హం.

image


వలంటీర్ల ఘనతే అంటున్న మహిత

ఆలోచన తనదైనా దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం, లక్ష మందికి పైగా అన్నార్తుల కడుపు నింపడం వలంటీర్ల ఘనతేనని మహిత ఫెర్నాండెజ్ చెబుతున్నారు. తాను కేవలం సంధానకర్తగా మాత్రమే పనిచేశానని వినమ్రంగా అంగీకరిస్తున్నారు. ‘కొంతమంది వండిన భోజనాలను తమ ఇళ్లలో సేకరించారు. మరికొందరు మురికివాడలు, ఇతర వీధుల్లో తిరిగి ఆకలితో అలమటిస్తున్న వారి జాడ కనిపెట్టారు. ఇంకొందరు ఆ వండిన భోజనాలు నిజంగా అవసరమున్న వారికే చేరుతున్నాయా లేదా అన్నది పరిశీలించారు. డబ్బు, విలువైన సమయం, రవాణా.. ఇలా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేశారు. నగరంలోని కొన్ని వేల మంది శ్రమ వల్లే ఫీడ్ యువర్ నైబర్ విజయవంతమైంది’ అని మహిత తెలిపారు. వ్యక్తులే తప్ప సంస్థల సాయం కోసం ఫీడ్ యువర్ నైబర్ ప్రయత్నించలేదు. కానీ చాలా సంస్థలు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. రౌండ్ టేబుల్, లేడీస్ సర్కిల్, సేనా విహార్ లేడీస్ గ్రూప్, బీఎన్ ఐ లాంటి రెస్టారెంట్లు తమకు తోచిన సాయం చేయడానికి అంగీకరించాయని మహిత చెప్పారు.

image


కొనసాగించడమే సిసలైన సవాల్

పదకొండు రోజుల పాటు నిర్వహించిన ఫీడ్ యువర్ నైబర్ విజయవంతమైంది. ఈ దేశంలో ఆకలితో అలమటించేవారే కాదు.. వారి కడుపులు నింపేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారని ఈ కార్యక్రమం రుజువు చేసింది. కానీ దీన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించడమే నిర్వాహకులు ముందున్న సిసలైన సవాలు. ఆ దిశగానే తాము ఆలోచిస్తున్నట్లు మహిత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘకాలం పాటు విజయవంతంగా ఎలా ముందుకు నడపాలి ? దానికోసం ఏఏ చర్యలు తీసుకోవాలన్నదానిపై ద్రుష్టిసారించారు. ఎలాగోలా ఫీడ్ యువర్ నైబర్ ను కొనసాగించాలని మహిత ఫెర్నాండెజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. డిమాండ్ కు తగిన సరఫరా ఉండాలి.. దీర్ఘకాలం పాటు కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆమె భావిస్తున్నారు. తమ వలంటీర్ల నిబద్ధతపై తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ‘ఎంతోమంది వృద్ధులు కూడా వలంటీర్లుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అందులో కొందరు వండిపెట్టడానికి, మరికొందరు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమ పిల్లలను కూడా భాగస్వాములను చేస్తున్న తల్లిదండ్రులు మా వలంటీర్లలో ఉన్నారు. మా బ్రుందంలో రెండున్నరేళ్ల వలంటీర్ కూడా ఉన్నాడు’ అని మహిత చెబుతున్నారు. సాయం అందుకుంటున్న వారి దీవెనలే తమకు ఎంతో సంత్రుప్తిని, సంతోషాన్నిస్తున్నాయని ఆమె తెలిపారు. ‘కడుపు నింపే భోజనం కంటే వారి కోసం మేము చూపిస్తున్న ప్రేమాభిమానాలకే వారు పొంగిపోతున్నారు. వాస్తవానికి వారి నుంచి మేము ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాం. మన సమస్యలే కాదు.. ప్రపంచంలో అంతకుమించి ద్రుష్టిసారించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం’ అని మహిత చెప్పారు. మన గురించే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారి ఆకలి గురించి కూడా పట్టించుకుంటున్న ఫీడ్ యువర్ నైబర్ కార్యక్రమం ఇలాగే విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.