ఐటిలో నెంబర్ 1 మా లక్ష్యం 

ఐటి విధానాన్ని  ప్రకటించిన తెలంగాణ సర్కార్

0


ఐటి పరిశ్రమల ఆకర్షణ, టెక్నాలజీలో నెంబర్ వన్ స్థానానికి ఎదగడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీని ప్రకటించింది. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూనే.. కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తామని వెల్లడించింది. అతిరథ మహారథుల సమక్షంలో ప్రకటించిన ఐటి విధానం.. రాబోయే ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతోంది.

స్టార్టప్ స్టేట్ తెలంగాణ.. నూతన ఐటి పాలసీని వినూత్నంగా ప్రకటించింది. ఐటి అనే పదానికి విస్తృత అర్థం ఉందని అర్థం చేసుకోవాలి. ఇందులో అనేక విభాగాలు, రంగాలు ఇమిడి ఉన్న నేపధ్యంలో.. ఒక్క పాలసీ ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉండబోదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే దీన్ని నాలుగు విభాగాలకు విడగొట్టి.. ఒక్కో రంగానికి ఒక్కో విధానాన్ని రూపొందించింది.

ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీ.. పేరుతో నాలుగు విధానాలను ప్రకటించింది. ఒక్కో రంగంలో ఉన్న అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను రిపోర్టుల రూపంలో స్పష్టంగా వెల్లడించింది.

"ఏడాది క్రితం ప్రకటించిన ఇండస్ట్రియల్ పాలసీ అద్భుతాలు సృష్టిస్తోంది. ఎలాంటి అవరోధాలు లేని సింగిల్ విండో పాలసీని మా ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకూ 1691 కంపెనీలకు ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ ఇచ్చాం. వీటిల్లో 800కుపైగా కంపెనీలు తమ ఉత్పత్తిని మొదలుపెట్టే దశలో ఉన్నాయి. పదిహేను రోజుల్లో అన్ని అనుమతులూ మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఐటిలో కూడా అలాంటి విధానాన్నే సిద్ధం చేశాం. ఇక్కడ ఉన్న వాతావరణం, కాస్మోపాలిటన్ కల్చర్, అనువైన లొకేషన్ హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. పారిశ్రామికవేత్తలను మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాం. రండి.. కలిసి అభివృద్ధి చెందుదాం " - తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు.

ఐటి అంటే కేవలం కంపెనీలకు, ఉద్యోగాలకు పరిమితం చేయకుండా..సామాన్యులకు కూడా ఆ ఫలాలను చేరువయ్యేలా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకే రూరల్ పాలసీని ప్రత్యేకంగా రూపొందించింది. అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కు పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.68,232 కోట్ల ఐటి ఎగుమతులను ఐదేళ్లలో రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐటి, ఐటి ఆధారిత రంగంలో ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో ఎనిమిది లక్షలకు పెంచడమే టార్గెట్ అని ప్రభుత్వం చెబ్తోంది.

ఐటి పాలసీ కాపీలను మోసుకొస్తున్న రోబో
ఐటి పాలసీ కాపీలను మోసుకొస్తున్న రోబో
'' తెలంగాణకు ఐటి ఎంతో కీలకం. అదే సమయంలో ఐటి వృద్ధికి కూడా తెలంగాణ ఎంతో అవసరం. ఈ ప్రాంత స్వభావ రీత్యా ఎన్నో అవకాశాలున్నాయి. ఉత్తమమైన పాలసీ, వ్యాపార ఆలోచన, టాలెంట్ పూల్ తెలంగాణకు ఊతం. 25 ఏళ్ల నుంచి ఐటి ఇండస్ట్రీ హైదరాబాద్ వైపు చూస్తోంది. అయితే ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి ఎదగాలాని చూస్తున్నాం. టెక్నాలజీని నగరాలకు పరిమితం చేయకుండా గ్రామాలకు కూడా తీసుకెళ్లి అక్కడా ఉద్యోగ కల్పన చేపట్టాలనేది మా లక్ష్యం '' - కె. తారకరామారావు, ఐటి శాఖ మంత్రి

ఐటి పాలసీ సందర్భంగా 28 అవగాహనా ఒప్పందాలను కూడా ప్రభుత్వం కుదుర్చుకుంది. వాటిల్లో కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు

నెలకు 60 లక్షల మొబైల్ ఫోన్ ఛార్జర్లు హైదరాబాద్ ప్లాంటులో తయారు చేసేందుకు ముందుకు వచ్చిన యాక్సియామ్. 

రూ. 500 కోట్లతో ఎల్‌ఈడీ క్లస్టర్ ఏర్పాటుకు సిద్ధమైన ఎల్ఈడీ మ్యానుఫ్యాక్చరర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్.

రూ. 200 కోట్లతో ఎల్ఈడీ సెమీ కండక్టర్ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైన క్వాలిటీ ఫోటోనిక్స్.

హైదరాబాద్‌లో వరుసగా మూడేళ్ల పాటు గేమ్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేందుకు నాస్కామ్‌తో ఒప్పందం.

స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు వేల్యూ ల్యాబ్స్‌తో ఎంఓయు.

1500 మంది ఉద్యోగుల సామర్ధ్యం ఉండేలా హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్.

ఇప్పటికే ఉన్న క్యాంపస్‌ను భారీగా విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించిన క్యాప్ జెమిని.

వీటితో పాటు టి-హబ్ కూడా వివిధ సంస్థలతో ఎంఓయులు కుదుర్చుకుంది. 

Detailed reports

Innovation Policy

Rural Policy

Image Policy

Electronics Policy

IT Policy


Related Stories

Stories by Chanukya