స్వయంపాకం కాస్తా.. రెస్టారెంట్ అయ్యింది !!

ఓ ఇంజినీర్ గారి ఇన్ స్టంట్‌ నూడుల్స్‌ కథ

స్వయంపాకం కాస్తా.. రెస్టారెంట్ అయ్యింది !!

Thursday July 23, 2015,

4 min Read

ఎంత డబ్బు ఖర్చుపెట్టారో గుర్తుపెట్టుకోవడం యూత్ కు కష్టమే. కానీ ఎంత సంపాదించారో లెక్కబెట్టుకోలేదంటే .. వారి ఎర్నింగ్ కెపాసిటీ ఎంతఉందో ఊహకందదు. ఇంతకూ వాళ్లెవరు?. ఏంచేశారు..?

గుల్షన్ అలా చేయలేదు.

గుల్షన్ అయ్యర్ . చెన్నయ్‌లో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌ చదువుతున్న రోజులు. ఎవరికైనా ఆస్టేజీలో ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ ఉండదు. గుల్షన్ కూడా అంతే. సొంతూరు నాగ్‌ పూర్‌. చదువు కోసమే చెన్నయ్ వచ్చాడు. హోంసిక్‌. తిండి సహించేది కాదు. కాలేజీ క్యాంటీన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రబ్బరులా సాగే చపాతీలు. నీళ్లలాంటి చారు. తినలేకపోయేవాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ సహనం చచ్చిపోయింది. ఇలా ఉంటే లాభం లేదనుకున్నాడు. ఫుడ్ గురించి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. కానీ అక్కడ ఫాయిదా లేదు. వెళ్లిపొమ్మని డైరెక్టుగా చెప్పలేదు కానీ- అంత కష్టమైతే నీవే వండుకోవచ్చుగా అని మర్యాదగా చెప్పారు. ఆ ప్లేసులో వేరే ఎవరైనా ఉంటే వెంటనే టీసీ తీసుకునేవారేమోగానీ- గుల్షన్ అలా చేయలేదు.

రెండే రెండు నిమిషాలు.

image


సొంతంగా వండుకోవచ్చుగా. ఈ మాట గుల్షన్‌ని ఒకపట్టాన ఉండనీయలేదు. వాళ్ల మాటలు ఛాలెంజిగ్‌గా తీసుకున్నాడు. కాలేజ్ గ్రౌండ్స్ లో ఓ మూలన స్టవ్ పెట్టి, ఇన్ స్టెంట్ నూడుల్స్ తయారుచేయడం మొదలెట్టాడు. మొదట్లో తనకోసమే చేసుకున్నాడు. మెల్లగా స్టూడెంట్స్‌ అందరికీ రుచి చూపించాడు. రెండే రెండు నిమిషాలు. నూడుల్స్ రెడీ అంటాడు గుల్షన్. అనడమే కాదు చేసి చూపించాడు కూడా. ఈ ఐడియా ఎంత క్లిక్ అయ్యిందంటే - ఫ్రెండ్స్ పెరుగుతున్నా కొద్దీ డిమాండ్ పెరిగింది. ఒక స్టవ్ కు తోడు రెండోది వచ్చింది. టర్మ్ పూర్తయ్యే సరికి, వారి బిజినెస్ లాభాల్లో మునిగితేలింది. అసలు ఎంత సంపాదించారో చూసేసరికి వారికే షాక్ తగిలింది. నిజానికి దీన్ని వారు బిజినెస్ యాంగిల్లోనే చూడలేదు. కానీ దానికదే సంపద సృష్టించింది.

ఎలా సాధ్యమైంది?

మొదట్లో ఓన్లీ నూడుల్స్. తర్వాత మెనూ మార్చాడు. బర్గర్లు, రాప్స్ తోడయ్యాయి. ఎందుకంటే ఓన్లీ నూడుల్స్ అంటే కష్టం. స్టూడెంట్స్ తినరు. బర్గర్ ఉన్నా సరిపోదు. ఎందుకంటే చదివింది బుర్రకు ఎక్కాలంటే బలవర్దకమైన ఆహారం కావాలి. అదుకే రాప్స్ అందుబాటులో ఉండేలా చేశారు. అందుకోసం పొద్దున్నే లేవడం- కేఎఫ్‌సీ దగ్గరికి వెళ్లడం- అక్కడ కూరగాయలు, చికెన్ డెలివరీ చేసేవాళ్లను అబ్జర్వ్ చేయడం- అలా కొన్నాళ్లపాటు సాగింది. తర్వాత ఎక్కడ తాజా కూరగాయలు తక్కువ ధరకు దొరుకుతాయో ఆరా తీశారు. వాళ్ల డిటెయిల్స్ తీసుకుని డీల్ కుదుర్చుకున్నారు. గుల్షన్ కు ఫ్రెండ్ వెంకటేష్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి మెనూ తయారు చేసేవారు. స్టూడెంట్స్ ఇక్కడికి తినడానికి వస్తే టైం వేస్ట్ అనుకోరు. ఎందుకంటే తింటూ చదివే ఫెసిలిటీ ఉంది. గుల్షన్ వంటకాలు ఆ నోటా ఈ నోటా పాకి ఫేమసయ్యాయి. తమ క్యాంపస్‌లోనే కాదు. చుట్టుపక్కల కాలేజీల్లోనూ మంచి పేరు సంపాదించారు. అలా తెలియకుండా బిజినెస్ ఊపందుకుంది. స్టూడెంట్స్ అంతా గుల్షన్ క్యాంటీన్‌ని గుల్లూస్ అని పిలవడం మొదలెట్టారు.

ఇబ్బందులు వచ్చినా..

క్యాంటీన్ పెట్టగానే సరిపోలేదు. లాంగ్ రన్నవ్వాలంటే లాభాల్లో నడిపించాలి. అదంత ఈజీ కాదు. ముఖ్యంగా లోకల్ క్యాంటీన్‌ వాళ్లతో పెద్ద గొడవ. ఒకసారి వీళ్ల క్యాంటీన్‌ మీద దాడి కూడా జరిగింది. కానీ ఎలాగోలా ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇక్కడి సమస్య సాల్వ్ అయిందని ఊపిరి పీల్చుకునేలోగా పేరెంట్స్ నుంచి తిట్ల దండకం. చదువుకోండని పంపిస్తే వంటలు, క్యాంటీన్ గోలేంటని అంతెత్తున లేచేవారు. గుల్షన్ ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసరికి వాళ్ల అమ్మ ఓపిక నశించింది. ఫోన్ చేసిన ప్రతీసారి క్యాంటీన్‌ గురించే రగడ. ఇంజినీర్‌ని చేద్దామని పంపితే వంటవాడివయ్యావేంట్రా అని తిట్టిపోసేది. అదీగాక బ్రాహ్మణ సంఘంలో ఎవ్వరూ గుల్షన్ చేసే పనిని మెచ్చుకోరని, పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లను ఇవ్వరని ఆవేదన చెందేవారు.

ఈలోగా క్యాంపస్ ఇంటర్వ్యూ. TCSలో ఆఫర్ వచ్చింది. అయినా గుల్షన్ కు క్యాంటీన్‌ను వదులుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే గుల్లూస్ కిచెన్ అంటే ప్రాణం. కానీ తప్పలేదు. TCSలో జాయిన్ అయ్యేందుకు మూడు నెలల గడువు ఇచ్చారు. మొదటి నెల పూర్తవుతున్నప్పుడే ఉద్యోగం మీద విరక్తి పుట్టింది. అంతే - వేరే థాట్ లేకుండా మరో గుల్లూస్ కిచెన్ ను పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే అంటుంటారు ఒక్కసారి వ్యాపారం రుచి మరిగితే అంతేనని.

"బిజినెస్ లోకి అడుగుపెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి నాదో ఉచిత సలహా. ఒకవేళ మీకు వ్యాపారం ఎలా చేయాలో తెలియకపోతే, మీకు మీరుగా దాన్ని ఎలా చేయాలో, ఏం చేయాలో తెల్సుకుని చేయండి. అందులోనే అసలు కిక్ ఉంది. ఇటుకలను పేర్చడం, సిమెంట్ పూయడం మాత్రమే కాదు ఇంజినీరింగ్ కలలు కనడం కూడా అది నేర్పుతుంది"- గుల్షన్‌

ఫుల్ ప్లేట్

TCS ఆఫర్ లెటర్ గతం. ఇప్పుడు కాలేజీల్లో, కార్పొరేట్ క్యాంపస్ లలో గుల్లూస్ కిచెన్ ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. 2016 కల్లా చెన్నై, బెంగళూరులలో 16 ఔట్ లెట్స్ పెట్టాలన్నదే ఫస్ట్ ఫేజ్ ప్లాన్. ఇదే తమ ఫ్యూచర్ ప్లాన్ అంటాడు గుల్షన్. అతనితో పాటు గుల్లూస్ కిచెన్ కో ఫౌండర్, ఈ స్టార్టప్ వెనక ఉన్న మరో టెక్ బ్రెయిన్ వెంకటేష్ ఆయా సిటీస్ లోని కాలేజీ క్యాంపస్‌ల అంబాసిడర్ల కోసం వెదుకుతున్నారు. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అందుకే రెస్టారెంట్ ఇండస్ట్రీ స్పేస్ కు సంబంధించిన మెంటార్ కోసం అన్వేషణ మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే గుల్లూస్ కిచెన్ మొబైల్ యాప్ ను లాంఛ్ చేయబోతున్నారు. గుల్లూస్ కిచెన్ కు చెన్నై, బెంగళూరులో మొత్తం 5 ఔట్ లెట్స్ ఉన్నాయి. 9 టు 5 జాబ్ పద్ధతిలో కాకుండా ఇష్టంగా పనిచేయగలిగే వారిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 2013లో గుల్లూస్ కిచెన్ ప్రారంభమైనప్పుడు తొలి ఇన్వెస్ట్ మెంట్ 3 వేలు. ప్రతీది అందులోంచే ఖర్చు చేసేవాళ్లు.

మరో ముఖ్య విషయం ఏంటంటే ... త్వరలోనే గుల్లూస్ కిచెన్ లో పని చేసేందుకు ఇద్దరు IIT గ్రాడ్యూయేట్లు ముందుకొచ్చారు. ఇంకో సర్ ప్రైజ్ ఏంటంటే ... విదేశాల్లో పనిచేస్తున్న గుల్షన్ అన్నయ్య కూడా వీరి కిచెన్ లోకి ఎంటరవ్వబోతున్నారు. “కనీసం ఇప్పటికైనా మా అమ్మ మమ్మల్నివంటవాళ్లతో పోల్చడం మానేస్తుందేమో” అంటూ గుల్షన్ పగలబడి నవ్వారు.