3500 మంది పిల్లలకు ఈమె అమ్మ

నేషనల్ ట్రస్ట్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఛైర్ పర్సన్ పూనమ్ నటరాజన్‌ స్ఫూర్తిగాథ

3500 మంది పిల్లలకు ఈమె అమ్మ

Thursday April 16, 2015,

3 min Read


మన దేశంలో సుమారు 2 కోట్ల మంది ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారని ఎన్నో రకాల నివేదికలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సగం పైగా మగవారే కావడం గమనార్హం. మొత్తం ఐదు రకాల వైకల్యాలపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన ముఖ్యమైన అంశం ఏమిటంటే... 48.5% కంటికి సంబంధించిన వైకల్యం అంటే దృష్టిలోపాలతో బాధపడుతున్నారు. అంగవైకల్యం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం, వినలేకపోవడం... ఇవన్నీ ఎంతోమందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్యలు. ఆశ్చర్యకరమైన ఈ గణాంకాలను ఓసారి “నేషనల్ ట్రస్ట్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ సంస్థ” ఛైర్ పర్సన్ పూనమ్ నటరాజన్‌తో పంచుకుంది “యువర్ స్టోరీ”. “ఇండియా ఇంక్లూజన్ సమ్మిట్”లో పాల్గొనడానికి వచ్చిన పూనమ్‌ను “యువర్ స్టోరీ” బృందం కలిసి మాట్లాడారు.

పూనం నటరాజన్, నేషనల్ ట్రస్ట్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఛైర్ పర్సన్

పూనం నటరాజన్, నేషనల్ ట్రస్ట్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఛైర్ పర్సన్


వైకల్యం ఉన్నవారికి, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన తోడ్పాటునందించే ఉద్దేశంతో ప్రారంభమైన సంస్థే ఈ “ట్రస్ట్”. భారత ప్రభుత్వ పర్యవేక్షణలో, సహకారంతో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సంస్థకి ఛైర్ పర్సన్‌గా ఉన్న పూనమ్ నటరాజన్ జీవితమే ఓ ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాధ. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఆమె తనకు అనుకూలంగా, ఓ అద్భుతమైన అవకాశంగా మార్చుకోగలరు. అదే ఆమెలోని గొప్పదనం. ఆ లక్షణమే ఆమెను ఓ విలక్షణ మహిళగా నేడు మనకు పరిచయం చేస్తోంది.

సరిగ్గా 30 ఏళ్ల క్రితం... పూనమ్ నటరాజన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ దురదృష్టమేంటంటే... ఆ పిల్లవాడు అందరిలా పుట్టలేదు. పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డాడు. అప్పటికి పూనమ్ ఓ యూనివర్శిటీలో రిసెర్చ్ చేస్తున్నారు. అది పూర్తైతే ఆమెకు పెద్ద జీతంతో ఓ మంచి ఉద్యోగం వచ్చి ఉండేది. కానీ పుట్టిన బిడ్డను చూడగానే పూనమ్ ఆశలు ఆవిరయ్యాయి. డాక్టర్లు కూడా ఏమీ చేయలేమని తేల్చేశారు. ఎక్కడికి తీసుకెళ్లినా ఫలితం ఉండదని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ ఆమె వారి మాటలు నమ్మలేదు. పిల్లలందరిలాగా తన పిల్లవాడు కూడా ఈ సమాజంలో ఎదగాలి, ఎదుగుతాడు అని బలంగా విశ్వసించారు.

తన స్పెషల్ చైల్డ్‌ కు శిక్షణనివ్వడానికి ముందు పూనమ్ తానా ఆ శిక్షణ తీసుకున్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఏ రకంగా అన్నీ నేర్పించాలి, వారిని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. పిల్లవాడు చేసే పనుల ద్వారానే అతనికి ఎలా నేర్పాలనే దానిపై అవగాహన పెంచుకునేవారు పూనమ్. తదనుగుణంగా ప్రణాళిక రూపకల్పన జరిగేది. ఒక్కోసారి చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాల్సి వచ్చేది, చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్పాల్సి వచ్చేది. వాటన్నింటినుంచి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సంబంధించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు పూనమ్. “మా అబ్బాయికి అవసరమైన శిక్షణనివ్వడం వల్ల ఇలాంటి పిల్లలను చూసే దృక్పథంలో ఎంతో మార్పు వచ్చింది”... అంటారు పూనమ్ నటరాజన్.

“మా అబ్బాయిని చేర్చుకోవడానికి ఏ స్కూలు యాజమాన్యమూ అనుమతించలేదు... ఇది నాలో పట్టుదలను రగిల్చింది. “ప్రత్యేక” పిల్లల కోసం నేనే ఎందుకు ఏ స్కూలు పెట్టకూడదు? అనే ఆలోచన వచ్చింది. అదే ఈ ట్రస్టుకు ఆరంభం”… అంటారు పూనమ్. 
ప్రత్యేకమైన పిల్లలతో పూనం

ప్రత్యేకమైన పిల్లలతో పూనం


దానికంటే ముందు తల్లిదండ్రులలో ఈ అంశంపై ఉన్న అపోహలు, అపనమ్మకాలను తొలగించాలని భావించారు పూనమ్. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పూనమ్ చేపట్టిన కార్యక్రమాలకు మద్దతుగా ఎంతోమంది ఆమె మార్గంలోకి వచ్చారు, ఆమెతో చేతులు కలిపారు. మొదట తన ఇంట్లోని గ్యారేజ్ లోనే ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. క్రమంగా ప్రస్తుతం చెన్నైలో ఉన్న ట్రస్టు కార్యాలయంలోకి మారారు. ఆ కేంద్రం పేరు “విద్యాసాగర్ అండ్ ద స్కూల్ ఫర్ డిజేబుల్డ్”. ఇలా మొదలైన “విద్యాసాగర్” ఇప్పటివరకూ సుమారు 3500 మంది “ప్రత్యేక” పిల్లలకు చేయూతనిచ్చింది. చిన్న స్కూలుగా మొదలై ఓ జాతీయ స్థాయి సంస్థగా ఎదగడం వెనక పూనమ్ మొక్కవోని పట్టుదల, అంకితభావం, సవాళ్లను ఎదుర్కోవడానికి ఆమె చూపిన తెగువ... ఇలా ఎన్నో ఉన్నాయి.

“23 ఏళ్లుగా నేను ఈ స్కూలులో డైరెక్టరుగా ఉన్నాను. అంతా బాగానే నడుస్తోంది. కానీ నాకు ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ లేకపోయినా స్కూలు నిర్వహణలో ఎలాంటి మార్పూ, లోటు ఉండకూడదనేది నా ధ్యేయం”... అని వినమ్రంగా చెబుతారు పూనమ్.

వైకల్యంతో జన్మించిన పిల్లలు కూడా సమాజానికి, దేశాభివృద్ధికి తోడ్పాటునందించగలరు అని బలంగా నమ్ముతారు పూనమ్. “దీనికి ఆ పిల్లల తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. పిల్లలను నిందించకుండా... వారు ఏం చేయగలుగుతారో ఆ రంగంలోనే వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించాలి. కానీ తల్లిదండ్రులను ఈ దిశగా చైతన్యం చేయడమే పెద్ద సవాల్. అసలు చాలామందికి తమ పిల్లలు అందరిలాంటి వారు కాదు అని తెలియదు, వారిని ప్రత్యేక పద్ధతిలో పెంచాలి అని చెప్పినా అర్థం చేసుకోరు. అప్పుడే “విద్యాసాగర్” పాత్ర కీలకమవుతుంది”... అంటారు పూనమ్ నటరాజన్.

గత 20 ఏళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. వికలాంగుల పట్ల సమాజం దృష్టి కూడా మారింది... మారుతోంది. కానీ ఇంకా జరగాల్సింది, చేయాల్సింది ఎంతో ఉంది. పల్లెల్లోకి వెళ్లి చూస్తే ఈ పరిస్థితి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సమూల మార్పు రావడానికి ఇంకెంతకాలం పడుతుందో!!! పదేళ్లు... ఇరవై ఏళ్లు...


“వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... ఆ అడుగు మేం వేశాం. మాతో పాటు మరికొందరిని నడిపిస్తున్నాం”... ఇది పూనమ్ ఎప్పుడూ చెప్పే మాట.

కమాన్ రీడర్స్! లెట్స్ హెల్ప్ ద డిజేబుల్డ్! వారు కూడా వారి కలలను సాకారం చేసుకునేందుకు మన వంతు కృషి చేద్దాం. వెయ్యి మైళ్ల ప్రయాణంలో మనమూ ఓ అడుగు వేద్దాం.