నాడు స్వప్నం.. నేడు సాకారం.. ఓ యంగ్ ఆంట్రప్రెన్యూర్ సక్సెస్ జర్నీ

Friday March 04, 2016,

4 min Read


సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమన. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నకొద్దీ మన కల- లక్ష్యంగా మారుతుంది. లేకపోతే కల కలగానే మిగిలిపోతుంది. అంకిత ష్రాఫ్ కుడా ఈ మాటల్నే నమ్ముతారు. ఆమెకు వ్యాపారమంటే ఇష్టం. చిన్నప్పటి నుంచే వ్యాపారవేత్తగా ఎదిగేందుకు కావాల్సిన మెళకువలన్నీ నేర్చుకుంటూ లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఇప్పుడు యంగ్ ఆంట్రప్రెన్యూర్ గా రాణిస్తున్నారు. పుణెలోని ఎస్ఏవీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు ఆమె. జీవితాన్ని పరిపూర్ణం చేయడంలో వైవిధ్యం కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతారు 26 ఏళ్ల అంకిత.

అంకిత రెండేళ్ల క్రితం పుణెలో ఆంట్రప్రెన్యూర్ షిప్ జర్నీని ప్రారంభించారు. వినియోగదారులకు, ఇండస్ట్రియల్ మార్కెట్ కోసం గమ్ ప్రాడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది. తైవాన్ కు చెందిన ఈ కంపెనీ కార్టెల్ కెమికల్స్ తో జాయింట్ వెంచర్ నిర్వహిస్తున్నారు. వేగంగా అతుక్కునే జిగురుకు భారతదేశంలో ఉన్న డిమాండ్ కు తగ్గట్టుగా వివిధ రకాల ఉత్పత్తుల్ని సరఫరా చేస్తోందీ సంస్థ.

తొలి ఏడాది

అంకితకు వ్యాపారంలో పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల... కంపెనీ ప్రారంభించిన తొలి ఏడాదిలో వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇన్నాళ్లూ పుస్తకాల్లో నేర్చుకున్నదంతా ఆచరణలో పెట్టాల్సిన సమయమది. తయారీరంగంలో మహిళలు ఉండటం చాలా అరుదు. అందునా అంకిత బిజినెస్ కు ఫ్రెషర్. కాబట్టి ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. నిలకడ, ఓర్పుతో ముందుకెళ్లింది. కొంచెం ఆలస్యమైనా ఆమె కలలు సాకారమయ్యే రోజులు ఆమెకు ఎదురొచ్చాయి. దిగుమతులు, చట్టాలు, పన్నుల విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లాంటి అంశాలు తెలుసుకోవడం అంకితకు పెద్ద సవాళ్లయ్యాయి. కానీ ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నేర్చుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపించారు.

"చుట్టూ ఉన్నవారిని అడిగి తెలుసుకోవడం, నిత్యం అధ్యయనం చేయడం, సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా చాలా నేర్చుకున్నా. ఏదైనా అడగడానికి, ప్రశ్నించడానికి ఎప్పుడూ భయపడకూడదు. సరైన సమయంలో నిర్ణయాలు అమలు చేయాలి. ఇవే నేను నేర్చుకున్న విషయాలు" అంటారామె.

ముంబైలో జన్మించిన అంకితా... పాషాన్ లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో చదువుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతుండటం, రోజువారీ జీవితంలో సైన్స్ ఇంపార్టెన్స్.. లాంటి అంశాలు జూనియర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ తీసుకునేలా ప్రోత్సహించాయి. పట్టుబట్టి చదివితే మహారాష్ట్ర స్టేట్ బోర్డులో 15వ స్థానంలో నిలిచారు. ఆమె జీవితంలో మొదలైన తొలి విజయం అది. ఆ తర్వాత పుణెలోని మహారాష్ట్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లో చేరారు. ఇంజనీరింగ్ చదివే నాలుగేళ్లలో అటు చదువులో, ఇటు ఇతర వ్యాపకాల్లో ద బెస్ట్ అనిపించుకున్నారు.'పూణె ఎంఐటి బెస్ట్ ఆల్ రౌండర్' అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే వ్యాపారం గురించి నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ ఆమెలో పెరిగింది. ఎన్నో కఠినమైన ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న తర్వాత లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీలో మేనేజ్మెంట్ విభాగంలో ఎమ్మెస్సీ సీటు దొరికింది.

లండన్ జర్నీ

అంకితకు లండన్ చాలా నేర్పించిందనే చెప్పాలి. తొలి ఏడాదిలోనే వ్యాపార రంగంపై అవగాహన పెంచుకోవడమే కాకుండా, విభిన్న సంస్కృతులు, నేపథ్యాలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇంపీరియల్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ చేస్తున్న సమయంలో లండన్, జర్మనీల్లో రోల్స్ రాయ్స్ తో ఓ కన్సల్టింగ్ ప్రాజెక్ట్ పై ఇంటర్న్ షిప్ చేశారు. అంతర్జాతీయ కంపెనీలు ఎలా పనిచేస్తాయి..? జాయింట్ వెంచర్స్ వ్యూహాలు, ఉత్పత్తి ఎలా ఉంటాయి అన్న అంశాలపై ఆ ప్రాజెక్టు పూర్తిగా ఆమెకు విభిన్న కోణాల్ని పరిచయం చేసింది.

"కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గల నాలాంటి వ్యక్తిని అంతర్ముఖం నుంచి బహిర్ముఖం వైపు రూపాంతరం చెందేందుకు లండన్ అనుభవాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రజలతో పరిచయాలు పెంచుకోవడం, సంబంధాల్ని బలపర్చుకోవడం లాంటివి వ్యాపారంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడ్డాయి. ఏ వ్యాపారానికైన మానవ వనరులే అసలైన బలం" - అంకిత.

తొలిరోజుల్లో పుణెలో తన తండ్రికి చెందిన రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ విభాగాన్ని నిర్వహించింది. ఆమెకు మొదట అప్పగించిన పని ఓ సవాల్. వెంచర్ లో నిర్మించిన నాలుగు షో ఫ్లాట్స్ కోసం చైనా నుంచి ఫర్నిచర్ ఇంపోర్ట్ చేయాలి. ఇందుకోసం పదిరోజులు బిజినెస్ ట్రిప్ పై చైనా వెళ్లారు. 25 గదులకు సరిపడా ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకున్నారు. అకౌంట్స్ టీమ్స్ తో కలిసి ఆమె ఎక్కువగా ఎగుమతులు, రెండు దేశాల మధ్య వ్యాపార సమన్వయం లాంటి అంశాలపై దృష్టిపెట్టారు.

"ప్రపంచ వేదికపై పనిచేయడం మరో అనుభవం. దీనివల్ల వాళ్ల పనితీరు, సంస్కృతి తెలుస్తుంది. ఫర్నీచర్ రంగంలో సేల్స్, డాక్యుమెంటింగ్, ఫైనల్ డీల్ కుదుర్చుకోవడంలో ఎక్కువగా యువతులు ఉంటారు. కష్టపడేతత్వం, సహనం, స్థిరత్వం, సామర్ధ్యం లాంటివి ఉంటేనే ఈ రంగంలో రాణిస్తారు" అని గర్వంగా చెబుతారు అంకిత.

శోధన నుంచి సాధన వరకు...

ఓ ఆంట్రప్రెన్యూర్ గా అంకిత చిన్న వెంచర్ ప్రారంభించారు. తైవాన్ దేశస్తురాలైన క్లాస్ మేట్ తో కలిసి అదే దేశానికి చెందిన బబుల్ టీని ఇండియాకు తీసుకురావాలన్నది అంకిత ఆలోచన. ఈ ఐడియాను చెప్పడంతో క్లాస్ మేట్ తో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి బిజినెస్ ప్రపోజల్ సిద్ధం చేసే పనిలో పడ్డారు. అనేకానేక చర్చలు, సమావేశాలు, అంచనాలపై అధ్యయనాలు, భవిష్యత్తు మార్కెట్ అవకాశాలు, ఉత్పత్తులు, ధరలు, పెట్టుబడులు లాంటి అంశాలతో రిపోర్ట్ రెడీ చేసుకొన్న తర్వాత తైవాన్ వెళ్లారు. అలా 2014 ఏప్రిల్ 9న ఎస్ఏవీ కెమికల్స్ మొదలైంది. అంకిత కంపెనీలో పనిచేసేవాళ్లంతా పాతికేళ్లలోపు యువతీ యువకులే. మేనేజ్ మెంట్ టీమ్ లో వివిధ రంగాల్లో నైపుణ్యాలు కలిగినవాళ్లు ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువైంది. స్టార్టప్ కాబట్టి ప్రతీ ఒక్కరూ అన్ని విభాగాలపై అవగాహన, సాధ్యమైనంత సామర్థ్యం కలిగి ఉండాలన్నది ఆమె ఆలోచన. ప్రొడక్షన్ టీమ్ లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. కంపెనీలో 90 శాతం మంది మహిళలకు అవకాశం కల్పించాలన్నది ఆమె లక్ష్యం.

"మా నాన్న, తాతయ్య, అమ్మ, సోదరి... వీరంతా కలిసిన నా కుటుంబమే నా బలం. వారి మద్దతు తోనే నేను ఏదైనా చేయగలుగుతున్నాను. ఈ అద్భుతాలకు అదే కారణం" అని గొప్పగా చెబుతారు అంకిత.

భవిష్యత్ ప్రణాళికలు

భవిష్యత్తులో రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్రలో హార్డ్ వేర్, స్టేషనరీ సెక్టార్, ఫ్లెక్స్, ఇండస్ట్రియల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇక తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి చెప్పాలంటే, ఈ ఏడాదిలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిత్యం ప్రయాణించడం, ట్రెక్కింగ్, బ్యాడ్మింటన్, యోగా, పియానో వాయించడం, పెయింటింగ్ అంకితకు చాలా ఇష్టం. ఇప్పటివరకు 25 దేశాలు పర్యటించి.. మరిచిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు.

"నా ప్రతీ ప్రయాణం ద్వారా నేను తెలుసుకున్నది ఒక్కటే. మనమంతా మహా సముద్రంలో నీటిబొట్టులాంటివాళ్లం" అని.