పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపే 'ప్రిస్టెక్'

0

పార్కింగ్.. ఇది మెట్రోలు, నగరాల్లో ప్రతీ ఒక్కరి సమస్య. కేవలం వ్యక్తులకే కాదు కార్పొరేట్లు, వ్యాపారులను కూడా వెంటాడే వెత పార్కింగ్. ఈ సమస్యలను పరిష్కరించడానికి వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది ప్రిస్టెక్ అనలైటిక్స్. మోటార్ వాహనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వ్యాపారులు, షాపింగ్ సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, యూనివర్సిటీలతో పాటు.. బడా బడా కంపెనీల అవసరాలను మొబైల్స్ ద్వారా ఒక చోటకు తెస్తోంది ప్రిస్టెక్. పార్కింగ్ నిర్వహణ, దాని సమాచారాన్ని అవసరమైనవారికి యాప్ ద్వారా మొబైల్‌లోనే తెలుసుకునేలా చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. దీనికోసం వాళ్లు క్లౌడ్ టెక్నాలజీని ఆధారం చేసుకుని డిజైనింగ్ చేయడం విశేషం.

ప్రతీ ప్రాంతంలోనూ ఉన్న సదుపాయాలను సంపూర్ణంగా ఉపయోగించుకుని... ఆయా ప్రదేశాలను మెరుగైన రీతిలో వాడుకునేందుకు విశ్లేషాణాత్మకమైన పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు అందించేందుకు ప్రిస్టెక్ ప్రయత్నిస్తోంది. ఈ తరహా పరిశోధనాత్మక పరిష్కారాలతో... అదనపు ప్లేస్ కోసం వెతుక్కోకుండా... అందుబాటులో ఉన్న ఏరియానే వీలైనంత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని వీరు చెబ్తున్నారు. దీంతోపాటు అభివృద్ధి కోసం అడుగులు పడేందుకు ఆయా వ్యక్తులు, సంస్థలకు సరైన భాగస్వాములుగా పనిచేస్తామంటోంది ప్రిస్టెక్. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ... దేశవ్యాప్తంగా సేవలందించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆయా సంస్థలకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాంలను డిజైన్ చేసి అందిస్తున్నారు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో అడుగుపెట్టి.. తమ సామర్ధ్యాన్ని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నట్లు చెబ్తోంది కంపెనీ.

ప్రిస్టెక్ టీం ఇదే..

ప్రిస్టెక్ అనలైటిక్స్ వ్యవస్థాపకులకు ఐటీ రంగంలో దశాబ్దం పైగా సేవలందించిన అపార అనుభవం ఉంది. వ్యాపారాభివృద్ధి సంబంధించిన రంగంలో వీరు ప్రతిభాపాటవాలను ఇప్పటికే నిరూపించుకున్నారు. ప్రిస్టెక్ అనలైటిక్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ షంపా గంగూలీ. ఐటీ, తయారీ, ఆటోమోటివ్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తి. డైమ్లర్ ఏజీ, ఫ్లూక్ కార్పొరేషన్, జియోమెట్రిక్ సాఫ్ట్ వేర్‌లతో పాటు రిటైల్ రంగంలోని టార్గెట్ కార్పొరేషన్‌లోనూ విధులు నిర్వహించారు. ఐఐఎం-బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేశారామె. దేశీయ కంపెనీలకే కాదు అమెరికా, యూకే, జర్మనీ, చైనా దేశాలకు చెందిన కంపెనీల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు షంపా గంగూలీ.

ప్రిస్టెక్ అనలైటిక్స్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు ప్రీతం గంగూలీ. విద్యలో ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ గల ఈయన.. ఐటీ రంగంలో 14 ఏళ్ల సుదీర్ఘ సేవలందించారు. సెమీ కండక్టర్ -నెట్వర్కింగ్ సంస్థలు కోనెక్సంట్ సిస్టమ్స్, కోర్టినా సిస్టమ్స్, బ్రోకేడ్ కమ్యూనికేషన్స్‌లో బాధ్యతలు నిర్వహించారు. ఆయా సంస్థల్లో పని చేసిన సమయంలో టెక్నికల్ డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు ప్రీతం. ఇక టీం విషయానికొస్తే ఆర్ఈసీ విభాగంలో 2-5 ఏళ్ల అనుభవమున్న ఇంజినీర్లు, ఐదేళ్లకు పైగా అనుభవం గల డేటా అనలిస్ట్ కం కన్సల్టెంట్... ప్రిస్టెక్ అనలైటిక్స్‌లో విధులు నిర్వహిస్తుండడం విశేషం.

ప్రస్తుతం భారత దేశంలో పార్కింగ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2014లో ప్రభుత్వ రంగ పార్కింగ్ మార్కెట్ విలువ ₹200 కోట్లు కాగా.... ప్రైవేటు రంగంలో దీని విలువ ₹1,800 కోట్లు. ప్రతీ ఏడా ఈ రంగం 30శాతం వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అరకొరాగా మారిపోయిన పార్కింగ్ సదుపాయాలను... భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా, ఆర్ధిక వృద్ధికి ఈ సమస్య అడ్డం పడకుండా ఉండేందుకు ప్రిస్టెక్ ప్రయత్నిస్తోంది.