రెస్టారెంట్లన్నీ ఇతనిలా ఆలోచిస్తే పేదవారి ఆకలి తీరినట్టే..  

ఎందుకా పేరొచ్చింది..? రెస్టారెంట్ ఏం చేసింది..?

1

బెంగళూరు ఇంద్రానగర్ ఏరియా. అక్కడ బిబ్లోస్ అని ఒక ఫేమస్ లెబనీస్ రెస్టారెంట్ ఉంటుంది. ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా అందులోకి పోవడానికి తటపటాయిస్తుంటారు. ఎందుకంటే చూడ్డానికి చాలా రిచ్ గా కనిపిస్తుంది. బిల్లు తట్టుకోగలమా అనుకుంటారు. అయితే కావొచ్చు గానీ, అన్ని స్టార్ట్ హోటళ్లలా ఇది పక్కా కమర్షియల్ అయితే అయింది గానీ, అంతకు మించిన మానవత్వం ఉన్న రెస్టారెంట్ ఇది. డీప్ ఫ్రిజ్ ఎంత చల్లగా ఉంటుందో ఈ హోటల్ యాజమాన్యం మనసు కూడా అంతే చల్లగా ఉంటుంది. ఫ్రిజ్ తో ఎందుకు పోల్చాల్సి వచ్చిందంటే.. ఫ్రిజ్ ఆఫ్ కైండ్ నెస్ అనే టాగ్ లైన్ ఉందీ హోటల్ కి..

ఎందుకా పేరొచ్చింది..? ఈ రెస్టారెంట్ ఏం చేసింది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..

మనతల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ దేశంలో ఎంతమంది అన్నపూర్ణమ్మలున్నారు.. ఎంతమంది దానకర్ణులున్నారు? ఒక్కపూట కూడా తిండికి నోచుకోని కోట్లాది మంది అభాగ్యులున్న దేశం మనది. రోజుకి ఎంతోమంది పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు..? కొన్ని లక్షల మందిని ఆకలి అనే భూతం మింగేసింది.

ఐక్యరాజ్యసమితి 2015 లెక్కల ప్రకారం దేశంలో 194 మిలియన్ల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు. ఉన్న మారాజలు తిన్నంత తిని పారేసినంత పారేస్తుంటారు. ఎటొచ్చీ అన్నార్తులే.. వాళ్లు పారిసింది కూడా దొరక్క పంపు నీళ్లతో కడుపు నింపుకుంటున్నారు.

ఉదాహరణకు హోటల్స్ సంగతే చూద్దాం. ఎన్ని రెస్టారెంట్లు చేసిన వంటకాలన్నీ కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాయి? ఎన్ని హోటళ్లలో వండిన ఆహారం మిగలట్లేదు..? కళ్లముందే డ్రమ్ముల కొద్దీ ఫుడ్ గార్బేజీ రూపంలో నగర శివార్లకు తరలి వెళ్లడం మనం నిత్యం చూడటం లేదూ..? ఎంత ఆహారం వేస్టేజీ రూపంలో నేలపాలవుతోంది? ఈ విషయంలో ఏ హోటలూ, ఏ రెస్టారెంటైనా సీరియస్ గా ఆలోచించాయా..? మిగిలిందంటే తెల్లారి పడేయడమొక్కటే వారికి తెలుసు. కానీ అలా పడేసే బదులు.. దాన్ని పక్కాగా ప్యాక్ చేసి ఫ్రిజ్ లో భద్రపరిచి తెల్లారి దారినపోయే అభాగ్యులకు, అన్నంలేక నకనకలాడే పేగులకు అందిస్తే ఎలా వుంటుంది? ఎంత ఆత్మ సంతృప్తి లభిస్తుంది..? అంత రుచికరంగా వండిన ఆహారాన్ని తెల్లారి ఏ చెత్తకుండి పాలో చేసే బదులు.. ఒక చెత్త ఏరుకునే అవ్వకిస్తే ఆవిడ ఎంత ఆబగా తింటుంది? నా ఆయుష్షు కూడా పోసుకుని బతుకు నాయనా అని మనసారా దీవించదా..?

అదిగో.. సరిగ్గా అలాంటి మహత్కార్యమే చేస్తోంది లెబనీస్ రెస్టారెంట్. హోటల్ రాత్రి షట్ డౌన్ చేసేటప్పటికి ఏ ఆహారం మిగిలినా పడేయరు. చక్కగా ప్యాక్ చేసి ఫ్రిజ్ లో పెడతారు. తెల్లారి రెస్టారెంట్ బయట ఉన్న ఫ్రిజ్ లోకి ప్యాకెట్లన్నీ షిఫ్ట్ చేస్తారు. ఒక అరలో నాన్ వెజ్.. ఒక అరలో వెజ్. పళ్లు, వాటర్ బాటిల్స్.. అమరుస్తారు. దారిన పోయేవాళ్లు ఎవరైనా సరే వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. అలాగని వాటిని ఎవరుపడితే వారు తీసుకోరు. అవి పెట్టిన ఉద్దేశం అందరికీ తెలుసు కాబట్టి.. డబ్బుల్లేక ఆకలితో పస్తులున్న వారికే వదిలేస్తారు. రోజుకి ఎంత లేదన్నా ఒక 20 మంది ఆహార పొట్లాలను, పళ్లను తీసుకెళ్తారు. చికెన్, పప్పు, రైస్, తాజా పళ్లు, వాటర్ బాటిళ్లు అందులో ఉంటాయి.

ఇప్పుడర్ధమైందా ఫ్రిజ్ ఆఫ్ కైండ్ నెస్ అని ఎందుకన్నారో. రెస్టారెంట్ హెడ్ చెఫ్ అమర్ మొల్కీ బ్రెయిన్ చైల్డ్ ఈ ఐడియా. అతను ఇక్కడివాడు కాదు. సిరియా వాసి. కళ్లముందు జరిగిన సివిల్ వార్ అతడిని కలచివేసింది. కూడు, గూడు, గుడ్డ లేని జనం బాధలు తెలిసినవాడు. ఆకలి బాధేంటో ఎరిగినవాడు. అందుకే తనకు ఉన్నంతలో, మిగిలినంతలో పేదవారి కడుపు నింపుతున్నాడు. దేవుడు మనకు బతకడానికి కొంత శక్తినిచ్చాడు. దాంట్లో కొంత ఇతరులకు పంచడంలో తప్పు లేదంటాడు. అందరమూ మనుషులమే. మనతోపాటు పక్కవాడూ బతకాలి అంటాడాయన. ఇతని మంచితనం చూసిన బెంగళూరు రోటరీ టీమ్ వాళ్లు ఒక పెద్ద ఫ్రిజ్ వితరణగా ఇచ్చారు. రెస్టారెంట్ బయట పెట్టిన ఫ్రిజ్ వాళ్లిచ్చిందే. దాంట్లోనే రాత్రి మిగిలిన పదార్ధాలు, పాడైపోనివి శుబ్బరంగా ప్యాక్ చేసి అందులో పెడతారు.

ప్రతీ విషయంలో సర్కారు ఇది చేయలేదు... ప్రభుత్వం అది చేయలేదు అని పెద్దపెద్ద డైలాగులు కొడతాం. కానీ మనం చేయగలిగేది ఎందుకు చేయలేం అని అంటాడాయన. మంచి చేస్తానంటే ఎవరు కాదంటారు చెప్పండి అని ప్రశ్నిస్తాడు?

దాదాపు నెల రోజులైంది ఈ కాన్సెప్ట్ అమలు చేసి. ప్రస్తుతానికైతే రాత్రి మిగిలిన ఐటెమ్స్ ఒక పాతిక మందికి సరిపోతున్నాయి. ప్యాకెట్ల సంఖ్యను పెంచాలని చూస్తున్నాడు. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. లెబనీస్ రెస్టారెంట్ ఐడియాను చాలా బెంగళూరులో సంస్థలు ఫాలో అవుతున్నాయి. జనం కూడా తాము తినగా మిగిలిన పదార్ధాలను ప్యాక్ చేయించి తమవంతు సాయంగా ఫ్రిజ్ లో పెట్టి వెళ్తున్నారు. ఈ ఒక్క రెస్టారెంటనే కాదు.. ఏ హోటల్లో తిన్నా.. మిగిలింది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్తున్నారు..

ఇప్పుడు చెప్పండి.. ఎక్కడో దేశంకాని దేశం నుంచి వచ్చి, ఇక్కడ బతుకుతున్నందుకు కృత‌జ్ఞ‌తగా పేదవారి ఆకలి తీరుస్తున్న మొల్కీ మనసు ఫ్రిజ్ కంటే చల్లనా కాదా..?  

Related Stories

Stories by team ys telugu