ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఈ చిట్టితల్లి గట్టి గుండెకు గట్టిగా చప్పట్లు..!!

0

మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ గేటు. ఎప్పటిలాగే నాందేడ్ ఎక్స్ ప్రెస్ సమాధుల వంక చూస్తూ పశ్చాత్తాపంతో పరుగులు పెడుతున్నది. కానీ ఇంకా ఆ స్థలం నుంచి లేతనెత్తుటి మరకలే పోలేదు. పిల్లల హాహాకారాలు చెవుల్లో గింగురుమంటునే ఉన్నాయి. ఇంకా గాయాలు సలపరం పెడుతునే ఉన్నాయి. సాయంత్రం స్కూల్ బస్ ఊళ్లోకి రాగానే తల్లి గుండె క్రషర్లో పడుతుంది. బిడ్డ కనిపించకపోతాడా సుడులు తిరిగిన కన్నీళ్లతో అప్రయత్నంగా అటువైపు చూస్తుంది. కొడుకు కనిపిస్తే బాగుండు అని తండ్రి ఆశగా బస్సు వంక చూస్తాడు. కానీ వాళ్లు ఎప్పటికీ రారు. పొద్దున్నే స్కూలుకు వెళుతూ అమ్మకు నాన్నకు టాటా చెప్పిన ఆ పసిమొగ్గలు పదినిమిషాల్లోనే మాంసపు ముద్దలై మిగిలారు. రైలుకట్ట వారగా సమాధులై మొలిచారు.

పద్దెనిమిది మంది పసివాళ్లను తునాతునకలు చేసిన ఘటన బండరాయి చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. ఏడాదిన్నర క్రితం జరిగిన ప్రమాదం ఇంకా గుండెల్ని మెలిపెడుతునే వుంది. 18 మంది పసిపిల్లలు మాంసపు ముద్దలై చెల్లాచెదరైన తీరు ఇంకా కళ్లముందే ఉంది. ఘటనా స్థలాన్ని చూసిన వాళ్లే గుండెలవిసేలా ఏడిస్తే- మరి ఆ సమయంలో బస్సు లోపల ఉన్న రుచిత అనే చిన్నారి- తోటి పసివాళ్లను కాపాడేందుకు ఎంత పెనుగులాడిందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ సమయంలో పెద్దవాళ్లకే ఏమీ తోచదు. అలాంటిది ఏడేళ్ల చిన్నారి- గుండెనిండా ధైర్యం కూడదీసుకుని ఇద్దరిని కాపాడిందటే మాటలు కాదు. శరవేగంగా దూసుకొస్తున్న రైలు ఒకపక్క. పిల్లల్ని బస్సు కిటికీలోంచి బయటపడేయాలన్న తాపత్రయం మరోపక్క. ఎంత టెన్షన్ పడిందో చిట్టితల్లి. రైలు వచ్చి ఢీకొట్టేలోపే ఇద్దరిని బయటపడేసి తానూ కిటికీలోంచి దూకేసింది. భయానకమైన ప్రమాదంలో ఎంతో సమయస్పూర్తితో అత్యంత సాహసం ప్రదర్శించింది.

రుచిత చూపించిన తెగువ, సాహసం, సమయస్పూర్తి అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాయి. అంత చిన్న వయసులో ఆ ప్రమాదకర సంఘటన నుంచి ఇద్దరిని కాపాడి తనను తాను రక్షించుకుంది. ఈ ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాకపోతే ఇదే ప్రమాదంలో రుచిత తన చెల్లెల్ని కోల్పోయింది. పక్కనే ఉన్న ఇద్దరి చిన్నారుల ప్రాణాలు కాపాడిన రుచిత- వేరే సీట్లో ఉన్న తన చెల్లెల్ని మాత్రం రక్షించుకోలేకపోయింది.

రుచిత ప్రదర్శించిన సాహసం నిజంగా వెలకట్టలేనిది. అందుకే ఆ చిన్నారి జాతీయ సాహస బాలల అవార్డుకు ఎంపికైంది. ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ఈ అవార్డుకు సంబంధించి రుచిత కుటుంబానికి సమాచారం ఇచ్చింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ నెల 24న అవార్డు అందుకోవాలని లేఖ రాసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 24న రుచితకు గీతాచోప్రా అవార్డు ప్రదానం చేయనున్నారు. తమ కూతురు సాహసం మరో రెండు కుటుంబాల్లో సంతోషం నింపడం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రుచిత జాతీయ సాహస బాలల అవార్డుకు ఎంపిక కావడం తమ గ్రామానికే గర్వకారణమంటున్నారు గ్రామస్తులు.

రుచితతో పాటు అసాధారణ సాహసం ప్రదర్శించిన మరో 24 మంది బాలబాలికలు భారత్ అవార్డుకు ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల గౌరవ్ నలుగురు స్నేహితుల ప్రాణాలు కాపాడి తాను ఈ లోకం విడిచివెళ్లాడు. మరణించిన గౌరవ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ అవార్డు దక్కింది. సరయు నదిలో కొట్టుకుపోతున్న ఫ్రెండ్ కాపాడి తన జీవితాన్ని త్యాగం చేసిన పదమూడేళ్ల శివాన్ష్ సింగ్ కి కూడా భారత్ అవార్డు వచ్చింది. అలాగే కరెంటు షాక్ నుంచి చాకచక్యంగా ఇద్దరిని తప్పించిన పదిహేనేళ్ల రామ్ దిన్ తారా అనే మిజోరాం కుర్రాడికి బాపు గైధాని అవార్డు వరించింది. అతనితో పాటు రాకేశ్ భాయ్ పటేల్ కు , అరోమల్ కు బాపు గైధాని అవార్డు దక్కింది.

Related Stories

Stories by HIMA JWALA