3 బిలియన్ డాలర్ల ఎల్డర్ కేర్ మార్కెట్లో 'ట్రిబెకా' పాగా

3 బిలియన్ డాలర్ల ఎల్డర్ కేర్ మార్కెట్లో 'ట్రిబెకా' పాగా

Wednesday October 07, 2015,

4 min Read

వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దేశాల్లో... భారత్ రెండో స్థానంలో ఉంది. సహజంగానే పెద్ద వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు... ఇప్పుడు మరింతగా ఎక్కువయ్యాయి. గృహంలోనే ఆరోగ్య సేవలు అందించే విభాగం ఇప్పటికే భారత్‌లో ఉన్నా.. అవ్యవస్థీకృతంగా ఉండడం, నర్సింగ్ సేవలు అందించేవారికి తగిన ప్రమాణాలు లేకపోవడంతో.. సమస్యలు పెరుగుతున్నాయి.

వృద్ధాప్య సేవలు, ఇంటిలోనే వైద్య సేవల రంగంలో నాణ్యతను పెంచేందుకు ప్రమోద్ సేన్, ఎలినా దత్తా, శివాజి సాహా, రితేంద్ర రాయ్‌లతో కలిసి.. ట్రిబెకాను ప్రారంభించారు టమోజిత్ దత్తా. 2013లో కోల్కతాలో ఈ వెంచర్ మొదలైంది.

నాన్ మెడికల్ సపోర్ట్, ఇంటి దగ్గరే నర్సింగ్ సేవలు, పునరావాస సహాయం, డాక్టర్ హౌజ్ విజిట్స్, 24/7 అత్యవసర సహాయం, గృహంలో ఉపయోగించగలిగే వైద్య పరికరాల విక్రయాలతో ఆరోగ్య రంగాన్ని కలిపి.. ఈ విభాగాన్ని కొత్తగా నిర్వచించే ప్రయత్నం చేస్తోంది ట్రిబెకా కేర్.

" సదుపాయాలు, శిక్షణ, సాంకేతికత, అనుభవజ్ఞులను ఏర్పాటు చేసుకోవడానికి.. ఈ రంగానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. చిన్న మొత్తంలో వచ్చే పెన్షన్‌, ఆర్థిక తోడ్పాటు లేని వాళ్లు, ఆరోగ్య బీమా కూడా లేని వాళ్లు మన దేశంలో 10కోట్లకు పైగా ఉన్నారు. ఇలాంటి వారికి కొంతైనా సాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది ట్రిబెకా కేర్" అంటారు టమోజిత్ దత్తా.

42 ఏళ్ల టమోజిత్‌కు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, రీటైల్ ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో 16 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ట్రిబెకా కేర్ ప్రారంభానికి ముందు డాయిష్ బ్యాంక్‌లో సీనియర్ బ్యాంకర్‌గా విధులు నిర్వహించిన ఈయన... అంతుకుముందు సిటిబ్యాంక్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఇండియాలకు పని చేశారు. సెయింట్ స్టీఫెన్ కాలేజ్, ఐఐఎం-అహ్మదాబాద్, లండన్ బిజినెస్ స్కూల్స్‌లో విద్యాభ్యాసం చేశారు టమోజిత్ దత్తా.

image


నిధులకు దారేది ?

ట్రిబెకా కేర్ ప్రారంభానికి సీడ్ ఫండిగ్ మొత్తం అంతర్గతంగానే పోగు చేసుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పలువురు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాములతో.. నిధులపై చర్చలు నిర్వహిస్తున్నారు.

" నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు, కొత్త మార్కెట్లలో ప్రవేశానికి, వర్కర్స్‌కి శిక్షణ ఇచ్చేందుకు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలి. సేకరించబోయే నిధులను ఇందుకోసమే వినియోగిస్తాం " - టమోజిత్.

పరిశ్రమ పరిస్థితి

వయసు పై బడిన వారికి సేవలు అందించే రంగంలో పెట్టుబడుల నుంచి, హెల్త్ వర్కర్స్‌కు శిక్షణ వరకూ.. ఈ విభాగంలో అనేక అవకాశాలు, అందుకు తగ్గట్టుగానే సవాళ్లు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు సర్వీసులు అందించడంలో... నైపుణ్యం చాలా అవసరం కాగా.. శిక్షణ పొందిన వర్కర్స్ కొరత ఈ పరిశ్రమను ఎక్కువగా వేధిస్తోంది.

పరిశ్రమ వర్గాల పరిశోధనల ప్రకారం అమెరికాలో ఎల్డర్ కేర్ ఇండస్ట్రీ విలువ 400 బిలియన్ డాలర్లు. ఈ రంగంలో విపరీతమైన పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలో మాత్రం ఇంకా ఈ రంగం ప్రారంభస్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువ కేవలం 3 బిలియన్ డాలర్లే. అయితే ఏటా 20శాతం చొప్పున వృద్ధి చెందడం ఆశాజనకమైన విషయం. ప్రైవేట్ రంగంలో తరలివస్తున్న పెట్టుబడులు... దేశంలో వృద్ధులకు సేవలందించే పరిశ్రమను పరుగులు పెట్టించే అవకాశముంది.

అత్యధిక జనాభా ఉండడం అవకాశమే అయినా... పబ్లిక్ రుణాలపై ఆధారపడే పరిస్థితి భారత్‌లో లేదు. అందుకే ఎల్డర్ కేర్ మార్కెట్‌ని అందుకునేందుకు ప్రైవేట్ పెట్టుబడులు తప్పనిసరి అని చెప్పాలి.

ప్రస్తుతం సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. దీంతో సీనియర్ సిటిజన్స్ సంఖ్య కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 11 కోట్ల మంది వయోవృద్ధులు ఉండగా... 2050నాటికి వీరి సంఖ్య 30 కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఈ సిల్వర్ సునామీకి మనం ఇంకా సిద్ధంగా లేము.

సేవల్లో రకాలుంటాయ్ !

సీనియర్ సిటిజన్స్‌కు పలు రకాల సేవలు అందిస్తోంది ట్రిబెకా కేర్. వైద్య సదుపాయాలు, డాక్టర్ హోమ్ విజిట్స్, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఇంటి దగ్గరే నర్సింగ్ సేవలు, డిమెన్షియా, అద్దె-అమ్మకం ప్రాతిపదికన మెడికల్ డివైజ్‌లు, ఇంటికే ఔషధాల డెలివరీ, నాన్ మెడికల్ కేర్, పర్సనల్ కేర్ మేనేజర్స్, ప్రయాణాల్లో సాయం, వ్యక్తిగత అటెండెంట్లు, శిక్షణ పొందిన సహాయకులు, తోడుగా నివసిస్తూ సాయం చేసే వ్యక్తులు, ఆర్ధిక నిర్వహణ సేవలు, అత్యవసర సహాయం, మెంబర్లకు 24/7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్, సీనియర్ అలారమ్స్, అంబులెన్స్, హాస్పిటలైజేషన్‌లో సహాయం వంటి సేవలను అందిస్తోంది ఈ సంస్థ.

అన్ని రకాల సర్వీసులకు మంచి డిమాండ్ ఉన్నా.. నాన్ మెడికల్ సేవల్లో వృద్ధి గణనీయంగా ఉందని చెబ్తున్నారు టమోజిత్.

'' విభిన్నమైన ఉత్పత్తులు, సేవలతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సర్వీసులు లాభదాయకంగా మారాలంటే తగినంత స్థాయిలో పెట్టుబడులు కూడా అవసరం. అందుకే రియల్ ఎస్టేట్, రవాణా, శిక్షణ, సాంకేతిక రంగాల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంది '' అంటున్నారు టమోజిత్.

ట్రిబెకా మోడల్ ఇదే

మెంబర్షిప్‌తోపాటు సేవల ఆధారంగా చెల్లింపులు చేసేలా రెండు మోడల్స్‌ను వీరు అభివృద్ధి చేశారు. విభిన్న కస్టమర్లకు, విభిన్నమైన సేవలు అవసరం అవుతాయి. అందుకే కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా... ఛార్జీలు వసూలు చేసేలా తమ మోడల్‌ని తీర్చిదిద్దారు స్టార్టప్ వ్యవస్థాపకులు.

కనీస మొత్తంగా రూ.250లతో మా సేవలు ప్రారంభమవుతుండగా.. ఖర్చు ఎక్కువగా ఉండే సేవలను ఉపయోగించుకునేవారు మెంబర్లుగా మారేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా ఇంటి దగ్గరే వైద్య సేవలు అవసరమయ్యే వారు మా కస్టమర్లలో ఎక్కువమంది ఉన్నారు.

300 మంది వర్కర్స్, ప్రొఫెషనల్స్, సపోర్టింగ్ స్టాఫ్‌కు ఉద్యోగావకాశాలు కల్పించింది ట్రిబెకా. డాక్టర్లు, ఫిజియో థెరపిస్టులు, సైకాలిజస్ట్‌లు, నర్సులు, జనరల్ అటెండెంట్లతో పాటు.. ఇతర స్టాఫ్ కూడా ఇందులో ఉన్నారు.

విస్తరణ వ్యూహాలు

ప్రారంభించిన 18 నెలల్లోనే భారత తూర్పు ప్రాంతంలో విపరీతంగా ప్రాచుర్యం పొందింది ట్రిబెకా కేర్. 2018 చివరినాటికి.. 10 ప్రధాన నగరాల్లో విస్తరించడంతోపాటు స్థిరపడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 2020 నాటికల్లా ₹ 400 కోట్ల టర్నోవర్‌ని అందుకునేలా వ్యూహాలున్నాయి.

హోమ్ హెల్త్ కేర్ రంగం చాలా పెద్దదే అయినా.. ఇప్పటివరకూ 98 శాతం మార్కెట్ అసంఘటితంగానే ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో 4 పెద్ద తరహా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ట్రిబెకా కేర్, పోర్షియా మెడికల్, మెడ్‌వెల్, ఇండియా హోమ్ హెల్త్ కేర్ కంపెనీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

వెబ్‌సైట్