అసలైన అందానికి సిసలైన నిర్వచనం చెప్తున్న పూజాకొచ్చర్

అసలైన అందానికి సిసలైన నిర్వచనం చెప్తున్న పూజాకొచ్చర్

Sunday February 28, 2016,

3 min Read

అందంగా లేనా ...అసలేం బాలేనా ..? అంటూ అమ్మాయిలు ఉడుక్కున్న సందర్భాలు అనేకం. అందం అనేది అనేకానేక సమయాల్లో క్రైటేరియాగా కూడా మారుతుంది. ఒక్కోసారి అగ్నిపరీక్ష కూడా అవుతుంది. ఉపమానం చెప్పాల్సి వస్తే సినీతారతోనో, ప్రపంచ సుందరితోనో పోల్చి వారిని అభద్రతాభావంలోకి నెట్టేస్తూంటాం. 

నిజానికి అందమంటే సినీతారల మేని వర్ఛస్సేనా? 

ముడతలు లేని శరీరమేనా అందమంటే..?

సన్నగా నాజూగ్గా ఉన్నవాళ్లే అందగత్తెలా?

నిజానికి ఇవేవీ కావు. కానీ అంగీకరించేవారు ఎంతమంది. ఈ విషయంలో మహిళల్లో అభద్రతా భావాన్ని తొలగించే అసలైన బ్యూటీని బయటకు తీసే ప్రయత్నమే చేస్తున్నారు ముంబైకి చెందిన బ్లాగర్ అండ్ ఫోటో గ్రాఫర్ పూజా కొచ్చర్.

30ish ...పూజాకొచ్చర్ బ్లాగ్

ప్యాషనేట్ ఫోటోగ్రాఫర్, బ్లాగర్ అయిన పూజాకొచ్చర్... పదేళ్ల పాటు టీసీఎస్ లో పనిచేశారు. 2014లో 30ishపేరుతో బ్లాగ్ ప్రారంభించారు. మహిళల అందం.. అపోహలపై అవగాహన... ఒరిజినాలిటీలో ఉండే బ్యూటీని బయటపెట్టేందుకే ఈ బ్లాగ్ కు వినూత్నంగా 30ish అని పేరు పెట్టారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య యువతులు ఎదుర్కొనే మానసిక భావనల సమాహారమే ఈ బ్లాగ్. ఫోటోగ్రఫీ భావాలకు ఇందులో పెద్దపీట వేశారు. ఎందుకంటే ప్రతీ స్త్రీ జీవితంలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య కాలమే అత్యంత కీలకం. పెళ్లి, పిల్లలు,కెరీర్ ఇలా ప్రతీ విషయంలోనూ ఈ కాలంలోనే ఎన్నో మార్పులు వస్తూంటాయి. అందుకే ఈ సమయాన్నే బ్లాగ్ పేరు థర్టీష్ అని పెట్టుకున్నారు పూజాకొచ్చర్. మహిళల అందంపై ఉన్న స్టీరియోటైప్ భావాలను మార్చేందుకే 30ish బ్లాగ్ క్రియేట్ చేశామంటున్నారు.

image


ఫోటోగ్రఫీ వితౌట్ ఫోటోషాప్

ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు ఫోటోలు తీయడానికి కన్నా.. ఆ తర్వాత అద్దే రంగుల హంగామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఫోటోషాప్ ముందు/ఫోటోషాప్ తర్వాత అని ఫోటోలు తరచి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పూజాకొచ్చర్ మాత్రం తన ఫోటోగ్రఫీలో ఫోటోషాప్ కు స్థానం ఇవ్వలేదు. అయినప్పటికీ మంచి అవుట్ పుట్ సాధించేందుకు ఆమె ప్రయత్నిస్తారు. తన ఫోటోబ్లాగ్ ను PhotoblogHER గా వ్యవహరించమని అందరికీ చెబుతూంటారు. 

యూనివర్శల్ అప్పీల్ ఉన్న బ్లాగులకు గ్లోబల్ రీచ్ ఉంటుంది. సమాజాన్ని మార్చేందుకు సోషల్ ఇన్ ఫ్లూయన్సర్స్, బ్లాగర్స్ ఏం చేస్తారంటే.. అద్భుతంగా డ్రెస్ చేసుకున్న మోడల్స్ తో ఫోటోషూట్ పెడతారు. తర్వాత వాటికి ఫోటోషాప్ చేసి ఫైనల్ గా తమకు కావాల్సిన ఫైనల్ ప్రింట్ తెచ్చుకుంటారు. కానీ పూజా కొచ్చర్ మాత్రం అలా చేయరు. రియాలిటీని కోరుకున్నారు. కామాటిపురాలోని సెక్స్ వర్కర్ల చిన్నారుల నుంచి కొత్తగా తల్లి అయినవారి వరకూ అందరి ఫోటోలూ తీశారామె. పాజిటివ్ బాడీ ఇమేజ్ మీద అందరితోనూ మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంత మంది ఆత్మవిశ్వాసంతో కనిపించినా టీనేజ్ గర్ల్స్, కొత్తగా తల్లి అయిన యువతులు మాత్రం.. అందం విషయంలో ఆందోళన పడటం పూజాకొచ్చర్ గమనించారు.

రియాలిటీ ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు పూజాకొచ్చర్ బ్లాగ్ ని పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నారు. వారిలో చాలా మంది ఫోటోషూట్ కు ఆహ్వానిస్తున్నారు. పూజాకొచ్చర్ ఎక్కువగా కొత్తగా మాతృత్వపు అనుభూతి పొందే మహిళలనే ఫోటోలు తీశారు. ఈ సమయంలో వారంతా అందంపై తమ భావాలను, అభద్రతా భావాన్ని పూజాకొచ్చర్ కు వివరించారు. కొంత మంది పొట్టపై పడిన స్ట్రెచ్ మార్క్స్ ను ఫోటోషాప్ చేయాలని కూడా కోరారు.

ప్రసవం తర్వాత మహిళ పొట్టపై ఉండే స్ట్రెచ్ మార్క్స్ అంటే.. యుద్దంలో గెలిచిన తర్వాత యోధుడు సగర్వంగా చూపించే కత్తిగాట్ల లాంటివని పూజాకొచ్చర్ చెబుతారు. ఇలానే ఫీలయిన ఓ క్లైంట్ తన పొట్టపై పడిన స్ట్రెచ్ మార్క్స్ నే ప్రత్యేకంగా ఫోటో తీయించుకుందని పూజాకొచ్చర్ గర్వంగా చెబుతారు. బాడీ షేపింగ్ అవుతున్న దశలో పిల్లల్లో అపోహలను తొలగించడానికి పూజాకొచ్చర్ స్కూళ్లలో ప్రత్యేక అవగాహనా సెమినార్లు నిర్వహిస్తున్నారు. స్కూళ్లలో 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో అందంపై సహజంగా ఓ క్యూరియాసిటీ ఉంటుంది వారందరికీ.

image


" బ్యూటీ అంటే భయం లేనిది. బ్యూటీ అంటే ముడతలు లేకపోవడం కాదు. బ్యూటీ అంటే నీ ప్లస్ ..మైనస్ లతో సంతోషంగా జీవించడం. అదే అందానికి నిజమైన నిర్వచనం" -పూజాకొచ్చర్ 

బ్లాగింగ్ ద్వారా పూజాకొచ్చర్ కు స్ట్రాంగ్ రిలేషన్ పెంచుకునే అవకాశం లభించింది. అనేక అంశాల మీద తమ భావాలను వ్యక్తీకరించడానికి బ్లాగింగ్ ను ఫ్లాట్ ఫామ్ గా వాడుకుంటారు. ఇప్పుడు బ్లాగింగ్ లోనూ మార్పులొస్తున్నాయి. బ్లాగింగ్ టు వ్లోగింగ్ కు మారుతున్నారు. పూజాకొచ్చర్ కూడా యూట్యూబ్ లో 30ishకి కొనసాగింపుగా తనదైన చానల్ ప్రారంభించారు .

image


అందమైన ఫ్యూచర్

2007లో ముంబై యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన పూజాకొచ్చర్ ISBలో మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ని 2014ని పూర్తి చేశారు. తన ఫోటోగ్రఫీ ద్వారా వస్తున్న ఆదాయంతోనే టీనేజర్స్ కు అవగాహన కల్పించేందుకు వర్క్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. దీర్ఘకాలంలో తన కార్యక్రమాలను భారీగా చేపట్టడానికి కార్పొరేట్ స్పాన్సర్ షిప్ లు వస్తాయని పూజాకొచ్చర్ ధీమాగా ఉన్నారు. తన ప్రయాణంలో పూజాకొచ్చర్ భర్త, తల్లిదండ్రులు కావాల్సినంత సహకారం అందిస్తున్నారు. ఓ మహిళగా... ఫోటోగ్రాఫర్ గా సాటి మహిళలకు తనదైన రీతిలో సాయం చేయాలనేది పూజాకొచ్చర్ ఆశయం.

బాగా డ్రెస్ చేసుకోవడం ముఖ్యమే. కానీ మహిళ ఆత్మవిశ్వాసమే అసలైన అందం. ముందు తనకు తనకు తాను కంఫర్టబుల్ గా ఫీలైతే మిగతావన్నీ తర్వాత స్థానానికి వెళ్లిపోతాయి. నిన్ను నువ్వు వాస్తవంగా చూసుకుంటే జీవితాన్ని ఆస్వాదించవచ్చు- పూజాకొచ్చర్

అంతే కదా.. అందమంటే ముందు తరాలకు జ్ఞానం అందించడం. అందమంటే మనచుట్టూ ఉన్న నలుగురికీ ఆనందం పంచడం. అంతేకానీ పుట్టుకతో వచ్చి న రూపురేఖల్ని పోగొట్టుకోవాలనుకోవడం మానసిక దౌర్భల్యం.