20 రూపాయల డాక్టర్ చనిపోతే కొన్ని వేల గుండెలు అవిసిపోయాయి..

దేవుడిలాంటి వైద్యుడి కథ

0

శవానికి వైద్యం చేసి లక్షల రూపాయల గుంజుతున్న పాపిష్టి రోజులివి. మనిషి ప్రాణాలకంటే పైసలకే ప్రాధాన్యత ఇచ్చే విలువల్లేని కాలమిది. డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తామని నిర్లజ్జగా చెప్తున్న నీతిలేని లోకమిది. పవిత్రమైన వైద్య వృత్తిని వ్యాపార చట్రంలో బంధించి పేదవాడిని కనీసం ఎడమ చేత్తో కూడా ముట్టుకోని ఈ రోజుల్లో.. గరీబోడి గుండెకు గుండెను ఆన్చిందో దైవం. 

ఆ మానవసేవ గురించి మాట్లాడుకుందాం. పేదవాడి ఆరోగ్యం కోసమే తపించి అలసిపోయి ఆగిపోయిన ఓ గుండె గురించి మాట్లాడుకుందాం.. దేవుడి దగ్గరకి వెళ్లిన ఆ దేవుడిని స్మరిస్తూ సంద్రమైన కంటి ధారల గురించి మాట్లాడుకుందాం..

ఒక్కోసారి దైవం మానవ రూపంలో దీనుల మధ్య తిరుగుతుందంటారు. అలాంటి దైవమే మనం చెప్పుకోబోయే డాక్టర్ బాలసుబ్రమణ్యం. 20 రూపాయల డాక్టర్ గురించి మీరెప్పుడైనా విన్నారా? కోయంబత్తూరులో ఆ పేరొక సుపరిచితం. వైద్యో నారాయణో హరి అంటారు కదా.. ఆ నానుడికి నిలువెత్తు రూపం. పేదలకు అతనే నారాయణుడు. అతనే హరి.

సిద్ధపూడూరు ఏరియాలో ఉంటుంది క్లినిక్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగ విరమణ తర్వాత, ఖాళీగా ఉండలేక ఒక డిస్పెన్సరీ పెట్టాడు. సంపాదించుకుందాం, పోగేసుకుందాం అనే ఉద్దేశంతో కాదు. తనకు తెలిసిన వైద్యంతో పేదవారికి ఎంతోకొంత సేవ చేయాలని. రోజుకి 150- 200 మంది రోగులని చూసేవాడు. మాత్రలతో తగ్గితే మాత్రలు. లేదంటే ఇంజెక్షన్. ఫీజు నామమాత్రం. మొదట్లో మనిషికి రెండ్రూపాయలు మాత్రమే స్వీకరించేవాడు. ఆ తర్వాత 10. ఈ మధ్యనే 20 రూపాయలు తీసుకున్నాడు. ఇచ్చే తాహతు లేని వాళ్లను అడిగేవాడు కాదు.

అదికూడా ఎందుకు తీసుకుంటాడంటే- ఇంజెక్షన్లు, టాబ్లెట్లు కొనడం రోజురోజుకూ కష్టమయ్యేది. క్లినిక్ రెంట్ కట్టాల్సి వచ్చేది. వీటన్నిటి మూలంగా ఆ మాత్రం ఫీజు తీసుకోక తప్పలేదు. నర్సులు లేరు. అసిస్టెంట్లు లేరు. అన్నీ తానై చూసేవాడు. చుట్టుపక్కల నుంచి వందలాది మంది నిరుపేదలు బాలసుబ్రమణ్యం దగ్గరికి వైద్యం కోసం వచ్చేవారు. జబ్బు నయం చేయడం అతనివల్ల కాలేదంటే, తనకు తెలిసిన మంచి స్పెషలిస్టు దగ్గరికి పంపిస్తాడు. పెద్దాయన మీద గౌరవంతో ఆ డాక్టర్లు పెద్దగా ఫీజు తీసుకునేవాళ్లు కాదు.

రోగంతో అల్లాడిన పేదవాడిని పొదివిపట్టుకున్న ఆయన చేతులు అచేతనంగా పడిపోయాయి. గుండెకు గుండె ఆన్చి చూసిన మనసున్న మారాజు గుండె హఠాత్తుగా ఆగిపోయింది. నిరుపేదల డాక్టర్ శాశ్వతంగా దూరమయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. కోయంబత్తూరు గల్లీగల్లీ వాడవాడనా కన్నీటి ధారలు కట్టాయి. ఆయనతో ముఖపరిచయం లేనివారు కూడా పొగిలిపొగిలి ఏడ్చారు. ఆయన చేతిమాత్ర పుణ్యమా అని బతికిన వారు గుండెలవిసేలా రోదించారు. సుబ్రమణ్యం డాక్టర్ ఇక కనిపించరన్న చేదునిజాన్ని జీర్ణించుకోవడం ఎవరివల్లా కాలేదు.

కొన్ని వేల మంది ఆయన్ని కడసారి చూడ్డానికి వచ్చారు. కన్నీటి ధారల నుడమ ఆయన అంతిమయాత్ర సాగింది. సెలవని వెళ్లిపోయిన సూర్యుడికి నమస్కరించని మనిషి లేడు. వెక్కివెక్కి ఏడవని గుండెలేదు. ఈ దేవుడు మళ్లీ పుట్టాలని పైవాడిని వేడుకున్నారు. కొవ్వత్తులు వెలిగించి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చితిమంటలు ఆరేదాకా ఉండి బరువెక్కిన గుండెతో భారంగా కదిలారు. రేపటినుంచి తమ బాగోగులు ఎవరు చూస్తారని అభాగ్యులంతా బేలచూపులు చూస్తుండిపోయారు.

Related Stories

Stories by team ys telugu