రిలోకేషన్ పరిశ్రమలో రివ్వున ఎగసిన 29 ఏళ్ల మహిళ

అసంఘటిత రంగంలోనూ ఆశ్చర్యమైన ప్రగతిఐదేళ్లలో రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్లకు వ్యాపారంకార్పొరేట్ క్లైంట్లను మెప్పించిన యంగ్ లేడీరిలోకేషన్ రంగంలో ఇంకా చాలా స్కోప్పిఎంఆర్ సిఈఓ ఆకాంక్ష భార్గవ సక్సెస్ స్టోరీ

0

మనం ఇల్లు మారుతూ సామాన్లు తరలించేప్పుడు అందమైన గాజు సీసా పగిలి పోయింది గుర్తుందా... ! విలువైన పెయింటింగ్ ముక్కలైంది కదా... ! ఫ్రిడ్జ్ కి గీతలు పడ్డాయా లేవా ? ఇలాంటి మాటలు చాలా వింటూనే ఉంటాం. ఎందుకంటే ఒక కుటుంబానికో, కంపెనీకో స్థలం మారడమంటే అంత సులువైన విషయం కాదు. మెట్రో నగరాల్లో ఇల్లు మారడం ఒక పీడకల. సామాన్లు సర్దుకోవడమంటేనే విసుగు. అందుకే మహా నగరాల్లో సామాన్లు సర్దిపెట్టి, కొత్తింటికి తరలించే కంపెనీలు వచ్చేశాయి. 


ఇంటి సామాన్లు ఇతర వస్తువులను అవసరమైన,అనువైన ప్రదేశాలకు తరలించడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ పీ.ఎం. రీలొకేషన్స్. రూ. 30 కోట్ల టర్నోవర్ తో వేగంగా విస్తరిస్తున్న ఈ కంపెనీని 29 ఏళ్ల ఆకాంక్ష భార్గవ సమర్థంగా నిర్వహిస్తున్నారు. రీలొకేషన్ ఇండస్ట్రీ కోసమే తాను పుట్టానని ఈ మహిళా పారిశ్రామికవేత్త చెబుతారు. కంపెనీలో అవసరమైన మార్పులు చేయడంలోనూ, రీలొకేషన్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతోనూ తాము చేస్తున్న కృషిని ..పిఎంఆర్ ప్రత్యేకతలను ఆకాంక్ష.. యువర్ స్టోరీకి వివరించారు.

పి.ఎం.రీలొకేషన్స్ ప్రత్యేకతలేమిటి ?

భారత్ లో ఎక్కడైనా.. విదేశాలకైనా సామాన్లను జాగ్రత్తగా తరలించడంలో అగ్రశ్రేణి సంస్థ పి.ఎం.రీలొకేషన్స్. ఇంటి సామాన్లు ప్యాకింగ్ చేసి తరలించడం, కార్యాలయాలను తరలించడం, కళాఖండాలను తరలించడం.. వస్తువులను జాగ్రత్తగా సర్దిపెట్టడం, ఇళ్లు, పాఠశాలలను వెదికి పెట్టడం, ఇమిగ్రేషన్ సహా అన్ని సేవలు ఇందులో భాగమవుతున్నాయి. భారత్ లోని 13 ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ పి.ఎం.ఆర్ తన సేవలను అందిస్తోంది. తమ సంస్థను కేవలం ప్యాకర్స్ అండ్ మూవర్స్ గా మాత్రమే చూడకూడదంటారు ఆకాంక్ష. రీలొకేషన్ కు సంబంధించిన అన్ని రకాల సేవలను అందిస్తామని చెబుతున్నారు. తమ సేవలను సబ్ కాంట్రాక్ట్ కు ఇవ్వలేదని… అన్ని పనులూ తమ సిబ్బందే చేయడం వల్ల అందరి మీదా తమకు పట్టు ఉంటుందనేది ఆకాంక్ష ధీమా. శిక్షణ పొందిన సిబ్బందే తమ బలమని విశ్వసిస్తారు. షెల్, అమెరికన్ ఎంబసీ, అమెరికన్ స్కూల్, యాండాక్స్, హెచ్.పి, బ్రిటానియా, సాప్, బాష్, సిటీ బ్యాంక్, HSBC, నోకియా, సీమన్స్, బార్ల్కేస్, భారతీ ఎయిర్ టెల్, ఎల్జీ వీరి సేవలను పొందిన సంస్థల్లో ఉన్నాయి.


ఆకాంక్ష భార్గవ, పిఎం రిలొకేషన్స్ సిఈఓ
ఆకాంక్ష భార్గవ, పిఎం రిలొకేషన్స్ సిఈఓ

రీలొకేషన్ పరిశ్రమ పరిణామక్రమం

రీలొకేషన్ పరిశ్రమ ఇంకా అసంఘటితంగానే ఉందనేది ఆకాంక్ష భావన. సామాన్లను అడ్డదిడ్డంగా సర్ది.. టెంపోలో ఎక్కించి.. చెప్పిన చోట దించేస్తే సరిపోతుందనేది చాలామంది ఆలోచన. పరిశ్రమలోని సున్నితత్వం ఎవరికీ అర్థం కాలేదని.. ఇక్కడ ఉద్యోగ కూడా మెరుగైన ఉపాధి అవకాశాలున్నాయని గుర్తించలేకపోతున్నారని ఆకాంక్ష అంచనా వేయగలిగారు. ఒకరిద్దరు వ్యక్తులు, అసంఘటిత రంగంలోని చిన్న పరిశ్రమలు రావడం వల్లే రీలొకేషన్ పై పూర్తి అవగాహన లేకుండా పోయిందని ఆమె చెబుతున్నారు. దీన్నొక రవాణా పరిశ్రమగానూ.. చదువులేని వాళ్లు చేసే పనిగానూ చూస్తున్నారని తన ఆవేదన.


పిఎంఆర్ ప్యాకింగ్ సైట్
పిఎంఆర్ ప్యాకింగ్ సైట్
“రీలొకేషన్ పరిశ్రమలో ఎన్నో అవకాశాలున్నాయి. డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంది. ఈ రంగంలోని పెద్ద సంస్థలు ఇంకా జనబాహుళ్యంలో గుర్తింపు పొందాల్సి ఉంది. వినియోగదారుడికి ఎలాంటి భయం, విసుగు లేకుండా సామాన్లను జాగ్రత్తగా గమ్యస్థానం చేరుస్తామనే ధీమా కల్పించాలి. రీలొకేషన్లో అన్ని అవసరాలనూ తీర్చే ఒక్క కంపెనీ కూడా దేశంలో లేదు. అందుకే పీఎంఆర్ ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా అవతరించింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులకు తెలిసింతగా… మనదేశంలో ఉన్న వారికి అర్థం కావడం లేదు” - ఆకాంక్ష భార్గవ
పిఎంఆర్ సంస్థల ట్రక్స్
పిఎంఆర్ సంస్థల ట్రక్స్

కుటుంబ వారసత్వాన్ని అందుకున్న ఆకాంక్ష

ఆకాంక్ష ఎంబీఏ చదివారు. ఎస్పీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పట్టాపొందారు. 21 ఏళ్ల వయస్సులోనే ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటికే ఆమె కుటుంబం రీలొకేషన్ పరిశ్రమలో ఉంది. 2007లో కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక్కో నగరంలో ఆరు నెలలు గడిపారు. ఒక చోట వ్యాపారం వృద్ధి చెందిన తర్వాత మరో నగరానికి వెళ్లిపోయారు. ఆమె చేరినప్పుడు కంపెనీ ఉద్యోగుల సంఖ్య నలభై. ఇప్పుడు 370 పైనే. అందులో 130 మందివి వైట్ కాలర్ జాబ్స్. వాళ్లు కొనుగోళ్లు, విక్రయాలు, మార్కెటింగ్ ఆపరేషన్స్, కస్టమర్ కేర్ చూసుకుంటారు. మిగతా ౨40 మంది ఇతర పనులు చూసే టాస్క్ ఫోర్స్ సభ్యులు. ఐదేళ్ల వ్యవధిలో ఈ కంపెనీ రెండు కోట్ల నుంచి 30 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. పీఎంఆర్ సేవలు పొందాలంటే ఇతర కంపెనీలకు చెల్లించే సొమ్ము కంటే మరో యాభై శాతం అధికంగా చెల్లించాల్సిందే. ఇది అంతర్జాతీయ రేట్లతో సమానం. అయితే నాణ్యమైన సేవలు అందించండంతో వినియోగదారులు పిఎంఆర్ వైపే మొగ్గుచూపుతున్నారు. సమీప భవిష్యత్తులో మరో పది పదిహేను కోట్ల రూపాయల నిధులు సమీకరించుకునేందుకు పిఎంఆర్ ప్రయత్నిస్తోంది.

టీమ్ పిఎంఆర్
టీమ్ పిఎంఆర్

పురుషాధిక్య పరిశ్రమలో మహిళా పారిశ్రామికవేత్త

ఇరవైఒక్క ఏళ్ల వయస్సులో పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు పురుషాధిక్య సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆకాంక్ష ఆందోళన చెందిన మాట వాస్తవం. అకుంఠిత దీక్షతో కఠోర శ్రమతో ఆమె అన్నింటినీ అధిగమించారు. ఆడవారు పనికిరారనుకున్న చోటే ఆమె ఏకైక మహిళా పారిశ్రామికవేత్త. కార్మికులతో మాట్లాడటం, ప్యాకింగ్ చేయించడం, ప్రీమియం క్లయింట్స్ దగ్గరకు వెళ్లడం వంటి వాటన్నింటినీ చేసి చూపించారు. యూనియన్లతో చర్చలు, కోర్టు కేసులు, రాజకీయ ఒత్తిడిని కూడా అధిగమించారు. ప్రతీ అంశంలోనూ ఆమె ఆదర్శంగా నిలిచారు.

పారిశ్రామికవేత్తగానే సంతృప్తి

పారిశ్రామికవేత్తగా స్ధిరపడిపోవడం ఎంతో సంతృప్తి నిస్తోందని ఆకాంక్ష అంటున్నారు. పిఎంఆర్ ఇప్పుడు 350 మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగునిస్తోంది. క్లయింట్ సంతృప్తి చెందినప్పుడల్లా పీఎంఆర్ బృందం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నాణ్యమైన సేవలు అందించడం తనకు గర్వంగా ఉందని ఆకాంక్ష అంటున్నారు.

నాన్నే స్ఫూర్తి

తన తండ్రే తనకు స్ఫూర్తి అని ఆకాంక్ష చెబుతున్నారు. తండ్రిగానే కాకుండా, గురువుగా వ్యాపారంలో మార్గదర్శిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. పైగా తన సమర్థతపై నమ్మకమున్న వ్యక్తిగా ఆయనను గౌరవిస్తానని ఆమె అంటున్నారు. పిఎంఆర్ సేవల్లో మన తన భేదమండదు. రెండు బెడ్ రూముల ఇంటి సామాన్లు తరలించాలన్నా… ఐదు బెడ్ రూమ్ ల ఇంటి సామాన్లు తరలించాలన్నా సేవల నాణ్యత ఒకే రకంగా ఉంటుంది. పెద్ద బ్రాండ్ల నుంచి వచ్చిన ఉద్యోగుల వల్ల తమకు ప్రయోజనం కలగలేదని.. తమ దగ్గర శిక్షణ పొందిన వారే బాగా పనిచేశారని ఆమె తన అనుభవాలను నెమరువేసుకుంటున్నారు. భవిష్యత్తులో మరో మూడు నగరాల్లో కార్యాలయాలు ప్రారంభించేందుకు పీఎంఆర్ సిద్ధమవుతోంది.


ఆకాంక్ష భార్గవ
ఆకాంక్ష భార్గవ