స్కూల్ పిల్లల కోసం సొంత నగలు అమ్మిన సర్కారీ టీచరమ్మ  

0

ఇవాళ రేపు సర్కారీ బడుల గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. వచ్చామా.. పాఠం కంప్లీట్ చేశామా.. ఎగ్జామ్ పెట్టామా.. అంతకు మించి పిల్లల మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకునే టీచర్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అందుకే కార్పొరేట్ స్కూళ్లు అంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఓపెన్ గా మట్లాడుకుంటే నిజం నిష్టూరంగానే ఉంటుంది. అలాగని అందరినీ ఒకేగాటన కట్టేయనూలేం. ఆదర్శ ఉపాధ్యాయులూ ఉన్నారు. ఉన్నారు కాబట్టే వాళ్లను సత్కరించుకుంటున్నాం. అలాంటి టీచర్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.

తమిళనాడు విల్లుపురం దగ్గర కందాడులో చిన్నపాటి ప్రైమరీ స్కూల్. ఆ స్కూల్లో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోతాం. నిజంగా ఇది సర్కారీ బడేనా అని కాసేపు నోరెళ్లబెడతాం. బేసిగ్గా ప్రైమరీ స్కూల్ అంటే సరిగా బెంచీలు కూడా ఉండవు. పిల్లల హాజరుశాతం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాంటి చోట కిక్కిరిసన క్లాస్ రూం, ఎటుచూసినా రంగురంగుల ఫర్నిచర్, రకరకాల పుస్తకాలతో కార్పొరేట్ స్థాయిలో కనిపిస్తుంది.

టెన్త్, ఇంటర్, ఆ మాటకొస్తే డిగ్రీకి వచ్చినా మన దగ్గర ఇంగ్లీష్ అంటే అదేదో భూతంలా కనిపిస్తుంది. పుస్తకం ముట్టుకుంటే ఏడుపొక్కటే తక్కువ. ఇక పరీక్షలు వచ్చాయంటే కలలో హంటర్ పట్టుకుని తరుముతుంది. ఆ భయం కొన్ని దశాబ్దాలుగా సర్కారీ బడుల్లో తిష్టవేసుకుంది. దాన్ని బోధించే పంతుళ్లకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోజులు అలా గడుస్తునే ఉంటాయి. పాసయ్యేవారు పాసవుతారు. దండయాత్రలు చేసేవాళ్లు దండయాత్రలు చేస్తారు.

సరిగ్గా ఇక్కడే అన్నపూర్ణ మోహన్ అనే టీచరమ్మ ఇంగ్లీష్ దెయ్యం మీద యుద్ధం ప్రకటించింది. అన్ని సబ్జెక్టుల్లాగే ఆంగ్లం ఎందుకు కాకూడదు. కార్పొరేట్ పిల్లల్లో ఆ భయం ఎందుకుండదు? సర్కారీ బడుల్లోనే ఎందుకిలా జరగాలి? అంటే ఒకటే తేడా. అక్కడ వనరులుంటాయి. ఇక్కడ ఉండవు. అక్కడ బోధనా పద్ధతి వేరు.. ఇక్కడ వేరు. ముందు టీచింగ్ మెథడ్ మారాలి. మారాలంటే దానికి అనుకూలమైన వాతావరణం కావాలి. ప్రభుత్వపాఠశాలలో, అందునా చిన్నాపాటి ప్రైమరీ స్కూల్లో అదంత ఈజీగా అయ్యే పనికాదు. కావాల్సిన మెటీరియల్ రావాలంటే, హెడ్ మాస్టర్ దగ్గర్నుంచి పై ఆఫీసర్ దాకా అర్జీలు, వేడుకోళ్లు, బోలెడంత తతంగం.

ఇదంతా ఎందుకొచ్చిన తంటా అని చాలామంది అనుకుంటారు. కానీ అన్నపూర్ణ టీచర్ అలా రాజీపడలేదు. పిల్లలకు ఎలాగైనా ఇంగ్లీష్ నేర్పించాలి. అంతకంటే ముందు ఆ సబ్జెక్టుమీద భయం పోగొట్టాలి. భట్టీ విధానం మీద ఆమెకు నమ్మకం లేదు. అందుకే తన సొంత నగలు అమ్మి, వచ్చిన లక్షా50వేల పైచిలుకు డబ్బుతో పిల్లలకు అవసరమైన మెటీరియల్ అంతా కొన్నారు. ఫర్నిచర్ మొదలుకొని, పుస్తకాల వరకు అన్ని సొంత పైసలతోనే సమకూర్చారు. కార్పొరేట్ స్కూల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలతో ఒక మోడల్ క్లాస్ రూంగా తీర్చిదిద్దారు.

ఫోనెటిక్స్ నేర్పించారు. పదాన్ని డివైడ్ చేసి పలికించి, దాన్ని ఎలా కలపి చదవాలో నేర్పించారు. స్పెల్లింగ్ డివైడ్ చేసి ఎలా యాడ్ చేయాలో బోధించారు. సెంటెన్స్ ఫామేషన్, గ్రామర్, ఇవన్నీ యాక్టివిటీల ద్వారా, ప్రాజెక్టు వర్క్ ద్వారా నేర్పించారు. ప్రతీ పాఠాన్ని డ్రామాలాగా, పిల్లలు ఎలా చెప్తే బ్రెయిన్ లో నిక్షిప్తమవుతుందో అలా స్కిట్స్ వేసి, యాక్టింగ్ చేయించి బోధించారు. బాగా చెప్పిన పిల్లలకు గిఫ్టులు ఇచ్చి ప్రోత్సహించారు.

అలా పిల్లల్లో భయాన్ని పోగొట్టి, ఇంగ్లీషుని అమితంగా ప్రేమించేలా చేశారు. ఇప్పుడు అక్కడ పిల్లలంతా ఇంగ్లీషులోనే మాట్లాడుతారు. వాళ్లు మాట్లాడినవన్న షూట్ చేసి సోషల్ సైట్లలో పోస్టు చేస్తే బీభత్సమైన రెస్పాండ్. అన్నపూర్ణ టీచర్ చేసిన మంచిపనికి దేశవిదేశాల నుంచి ప్రశసంలు వచ్చాయి. ఒక న్యూస్ ఛానల్ వారు టీచర్ పడుతున్న తపనను టెలికాస్ట్ చేయడంతో నిధుల వరద పారింది. దాంతో ఆమె నగలు ఆమెకు వచ్చాయి. మిగిలిన డబ్బుతో పిల్లలకు మరింత మెటీరియల్ తీసుకున్నారు. మిగతా క్లాసు రూములన్నీ స్మార్ట్ రూంలుగా మార్చేశారు.

ప్రైవేటు స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు తక్కువే. కాదనలేని సత్యం. అలాంటి చెడ్డపేరు పోగొట్టాలంటే టీచర్లంతా అన్నపూర్ణ మేడంని ఆదర్శంగా తీసుకోవాలి అలాగని అందరినీ నగలు అమ్మి పుస్తకాలు కొనమని సలహా ఇవ్వడం కాదు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవారంతా పేదపిల్లలే. లక్షల ఫీజులు పోసి ప్రైవేటుకి వెళ్లలేని గరీబుల పిల్లాపాపలే. అలాంటి విద్యార్ధులకు ఎలా చెప్తే అర్ధమవుతుందో, ఆ దిశగా చిన్న చొరవ తీసుకుంటే చాలు. శ్రమ అనిపించొచ్చు. ప్రయాసగా ఫీలవొచ్చు. కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. 

Related Stories

Stories by team ys telugu