ట‌చ్ చేస్తే చాలు.. వ‌చ్చి ఆదుకుంటాం!

ఆపదలో రక్షించేందుకు 24 గంటలు అందుబాటులో రంగంలోకి వన్ టచ్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్

ట‌చ్ చేస్తే చాలు.. వ‌చ్చి ఆదుకుంటాం!

Saturday July 25, 2015,

3 min Read

నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్యతో మీ కారు నిలిచిపోతే? ఆరోగ్య సమస్యతో అత్యవసర వైద్యం అందాల్సి వచ్చినప్పుడు దగ్గరలో ఎవరూ లేకపోతే? అలాంటి అత్యవసర పరిస్థితుల్లో అనుక్షణం మేమున్నామని అంటోంది వన్ టచ్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్.


ఫస్ట్ రెస్పాన్స్ టీం

ఫస్ట్ రెస్పాన్స్ టీం


అత్యవసర సమయాల్లో సహాయం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌లో 911, యూకేలో 999 సర్వీసులు ఉన్న సంగతి తెలిసిందే. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా బాధితులుగానీ, ప్రత్యక్ష సాక్షులుగానీ ఫోన్ చేస్తే స్పందించి సహాయం చేసేందుకు ఈ సర్వీసులు ముందుంటాయి. ఇక భారత్‌లో 100 ఉంది. ఇది అన్ని రకాల అత్యవసర సర్వీసులను అందించదు. ఈ అంతరాన్ని తొలిగించేందుకే అరవింద్ ఖన్నా వినూత్న ఆలోచనతో రంగంలోకి దిగారు. అదే వన్ టచ్ రెస్పాన్స్. అన్ని రకాల అత్యవసర పరిస్థితుల కోసం ఒకే కాంటాక్ట్ నంబరు ఉండాలని ఆయన భావించారు. కార్యాలయంలో, ఇంట్లో ఉన్న సమయంలో భద్రంగా ఉన్నామని చాలామంది భావిస్తారు. అదే ప్రయాణంలో అందుకు భిన్నమైన ఆలోచనతో ఉంటారన్నది ఆయన భావన.


ఇలా పుట్టిందీ ఆలోచన..

అరవింద్ తనకు తానుగా ఢిల్లీ బోయ్‌గా పిలుచుకుంటారు. విదేశాల్లో చదువు. 1999 వరకు కుటుంబ వ్యాపారంలో వున్నారు. ఆ తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీని ప్రారంభించారు. కంపెనీని 2007లో అమ్మేశారు . తర్వాత కొన్ని చిన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. భద్రతపట్ల భారత్‌లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఒకేచోట అన్ని రకాల అత్యవసర సర్వీసులను అందించే వ్యవస్థ ఉండాలని ఆయన భావించారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే వన్ టచ్ రెస్పాన్స్ అని అంటారు అరవింద్. వ్యక్తులను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అనుసంధానించే యాప్స్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ మార్కెట్లో ఇప్పుడు చాలానే ఉన్నాయి. అన్ని సందర్భాల్లోనూ వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. కాబట్టి ఎస్‌ఎంఎస్‌లను చూసేంత తీరిక ఉండకపోవచ్చు. పోనీ వారు బాధితుల దగ్గరికి చేరుకుందామనుకున్నా వాళ్లు సమీప ప్రాంతంలో ఉండకపోవచ్చు. అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ప్రభుత్వ సర్వీసులు ఉన్నాయి. అత్యవసరమని మీరు అనుకున్నప్పటికీ, అంత అవసరం కాదని అవి స్పందించకపోయే అవకాశమూ ఉంది. రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆగిపోతే అప్పుడది మీకు అత్యవసరం. కానీ పెద్ద పెద్ద సవాళ్లతో సతమతమయ్యే పోలీసులకు అదంత పెద్ద సమస్య కాకపోవచ్చంటారు అరవింద్.


ఫస్ట్ రెస్పాన్స్ టీం

ఫస్ట్ రెస్పాన్స్ టీం


ఇలా పనిచేస్తుంది..

వన్ టచ్ రెస్పాన్స్ 24 గంటలు పనిచేస్తుంది. యాప్‌తోపాటు వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది. ఈ సేవలు కావాల్సినవారు ప్యాకేజీని బట్టి ఏడాది చందా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక చందాదారు అత్యవసర సమయంలో తన స్మార్ట్‌ఫోన్ నుంచి ఒక్క టచ్‌తో ఎస్‌వోఎస్ అలర్ట్ పంపితే చాలు. కమాండ్, కంట్రోల్ సెంటర్లో ఉన్న సిబ్బంది బాధితునితో ఫోన్‌లో మాట్లాడతారు. సమస్యను బట్టి సూచనలు చేస్తారు. ఈలోపు అతని దగ్గరకు నిమిషాల్లో ఫస్ట్ రెస్పాన్స్ టీం ప్రత్యక్షమవుతుంది. ఎమర్జెన్సీ ఏదైనా కావొచ్చు. అర్ధరాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఫోన్‌లో ట్రాక్ చేయమని చందాదారు కోరవచ్చు. అందుకు తగ్గట్టుగా ఇంటికి చేరే వరకు ఫోన్ కాల్స్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. సున్నితమైన అత్యవసర పరిస్థితులపై వన్ టచ్ రెస్పాన్స్ టీం దృష్టిసారిస్తుంది. ఎవరైనా చందాదారుకు ముప్పు ఉంటే మాత్రం పోలీసులు, ఇతర సర్వీసుల సహకారాన్ని ఈ టీం తీసుకుంటుంది. అంతేగాక ఫస్ట్ రెస్పాన్స్ టీం సైతం రంగంలోకి దిగి సదరు వ్యక్తులకు రక్షణగా ఉంటుంది.


అరవింద్

అరవింద్



మారిన వ్యూహం..

మొదట డబ్బున్నవారే లక్ష్యంగా సేవలు అందించాలని భావించినప్పటికీ పైలట్ ప్రాజెక్టు అనుభవం దృష్ట్యా కంపెనీ వ్యూహాన్ని మార్చుకుంది. కామన్ పీపులే లక్ష్యంగా రంగంలోకి దిగింది. అందుకు తగ్గట్టుగా సేవల చార్జీలనూ మార్చారు. ఫస్ట్ రెస్పాన్స్ టీం ఎక్కడ ఉండాలో లోతుగా అధ్యయనం చేశాం. సరైన ప్రాంతాల్లో వారిని నియమించాం. తద్వారా వారు కొన్ని నిముషాల్లోనే చందాదారును చేరుకుంటారు’ అని అరవింద్ అంటున్నారు.

లక్ష్యం కోసం పనిచేసే...

ఫస్ట్ రెస్పాన్స్ టీం సభ్యుల ఎంపిక పెద్ద సవాల్‌తో కూడుకున్నదని అరవింద్ వివరించారు. ఉద్యోగం చేసినట్టుగా కాకుండా సేవ చేస్తున్నానన్న భావనతో ఉన్నవారు మాకు కావాలి. బాగా చదువుకున్న యువకులను గుర్తించాం. వీరిలో అత్యధికులు ఎన్‌సీసీ, స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే. ప్రజలకు సహాయం చేయడాన్ని కెరీర్‌గా కోరుకునేవారు ఇప్పుడు ఈ టీంలో ఉన్నారని ఆయన చెప్పారు. కంపెనీ గతేడాది కేవలం కార్పొరేట్లపైనే దృష్టిపెట్టింది. ఈ ఏడాది సాధారణ వినియోగదారుల కోసం సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్లో ఫస్ట్ రెస్పాన్స్ సర్వీసు అందుబాటులో ఉంది. వచ్చే ఆరు నెలల్లో ప్రథమ శ్రేణి నగరాలు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది సంస్థ లక్ష్యం.