2050లో భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే బాహుబలి-2  

నెంబర్ 1 చైనా, మూడో స్థానంలో అమెరికా

1

భవిష్యత్తులో భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే బాహుబలి-2 అవుతుందా? అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా వీరతాడు వేసుకుంటుందా? అవుననే అంటున్నాయి సర్వేలు. 2050 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ అవుతుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ జీడీపీలో 85 శాతంతో అతిపెద్ద ఎకానమీ కలిగివున్న32 దేశాల దీర్ఘకాలిక ఆర్ధిక అభివృద్ధి అంచనాలపై ఆ సంస్థ స్టడీ చేసింది.

లాంగ్ వ్యూ పేరుతో తయారు చేసిన ఈ నివేదికలో 2050 నాటికి గ్లోబల్ ఎకానమీ జాబితా ఎలా వుంటుందనే దానిపై దేశాల వారీగా ఒక ర్యాంకుల పట్టీ విడుదల చేసింది. ఒక నిర్దిష్ట కాలంలో పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి, కొనుగోలు శక్తి, ఆర్ధిక ఉత్పాదకత, ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. ప్రపంచ ఆర్ధిక పరిమాణం 2050 నాటికి రెట్టింపు కంటే అధికమవుతుందని, దీని ఎఫెక్ట్ టెక్నాలజీ డ్రివెన్ ప్రాడక్టివిటీ మీద అధికంగా ఉంటుందని నివేదిక తెలిపింది.

రిపోర్ట్ ప్రకారం 2050 నాటికి ఏడింట ఆరు దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక శక్తులుగా ఎదుగుతాయి. అందులో చైనా అగ్రస్థానంలో ఉండగా, ఇండియా టాప్ టూ లో నిలిచింది. అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ఇండోనేషియా ఫోర్త్ ప్లేస్ దక్కించుకుంది. యూకే పదో స్థానంలో సెటిలైంది. ఫ్రాన్స్ టాప్ టెన్ నుంచి గల్లంతైంది. ఇటలీ మొదటి 20 దేశాల జాబితాలో లేదు. మెక్సికో, టర్కీ, వియాత్నాం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇటలీని ఓవర్ టేక్ చేసి పైకి ఎగబాకాయి.

2050లో ప్రపంచాన్ని శాసించే టాప్ టెన్ దేశాలివే

2016                                      2050

చైనా 1                                   చైనా 1

అమెరికా 2                              ఇండియా 2

ఇండియా 3                             అమెరికా 3

జపాన్ 4                                 ఇండోనేషియా 4

జర్మనీ 5                                 బ్రెజిల్ 5

రష్యా 6                                  రష్యా 6

బ్రెజిల్ 7                                  మెక్సికో 7

ఇండోనేషియా 8                        జపాన్ 8

యూకే 9                                 జర్మనీ 9

ఫ్రాన్స్ 10                                 యూకే 10

రాబోయే కాలం వ్యాపారానికి స్వర్ణయుగం లాంటిది. బీటూబీ బిజినెస్ శరవేగంగా పుంజుకుంటుంది. కాకపోతే ఒక్కటి.. అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలి. స్థానిక అవసరాలను బట్టి ఫ్లెక్సిబుల్ వుండాలి. అప్పుడే లోకల్ మార్కెట్ల మీదా పట్టు సాధించొచ్చు అని రిపోర్ట్ అభిప్రాయ పడింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల వొలటైల్ గుణగణాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అర్ధం చేసుకోవాలి. ఆయా దేశాల్లో స్వల్పకాలిక ఆర్థిక అంశాల పట్ల ఓపికతో వుండాలి. దాంతోపాటు రాజకీయ సుస్థిర, అస్థిరత్వాలనూ ఆకళింపు చేసుకోవాలి.