ముంబై ఇండియన్స్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్

ముంబై ఇండియన్స్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్

Monday May 22, 2017,

2 min Read

క్రికెట్ అంటే అంతే. అందునా టీ-20 అంటే ఇంకా చెప్పలేం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించలేం. ముంబై ఇండియన్స్ విషయంలోనూ అదే జరిగింది. ఏ కోశానా ముంబై వైపు లేని మ్యాచ్ ఒక్కసారిగా సుడి తిరిగింది. గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్న పుణె గెలుపు మీద ఒక్కసారిగా బకీటెడు నీళ్లు చల్లింది. చివరి ఓవర్ దాకా పుణె వైపే ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ గ్యాలరీలో వచ్చి చేరింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరింతగా సాగిన ఫైనల్ అసలు సిసలు టీ-20 మజాని చూపించంది. పుణెమీద సానుభూతా.. లేక ముంబై మీద అభిమానమా.. ఎటు తేల్చుకోలేక సగటు అభిమాని డైలమాలో ఉన్నాడు. మొత్తానికి ముంబై ఇండియన్స్ ముచ్చటగా మూడోసారి ట్రోపీని అందుకుంది.

image


టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. తక్కువ స్కోరుకే ఓపెనర్లు పెవిలియన్ బాటపట్టారు. రాయుడు, రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్ రిపేర్ చేసే పనిలో పడ్డారు. ఇంతలో 8వ ఓవర్లో స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన త్రో రాయుడిని రనౌట్ చేసింది. 11వ ఓవర్లో రోహిత్ శర్మ బౌండరీ లైన్ దగ్గర దొరికిపోయాడు. తర్వాత వచ్చిన పొలార్డ్‌ సిక్సర్‌ బాదినట్టే బాది, వెంటనే క్యాచ్ అవుటయ్యాడు. 14 ఓవర్లో హర్దిక్‌ పాండ్య ఔటయ్యాడు. మరో వైపు కృనాల్‌ పాండ్య ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ అటువైపు బ్యాట్స్ మెన్ వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. మొత్తమ్మీద ముంబై 129 పరుగులు చేసి స్వల్ప లక్ష్యాన్ని పుణె ముందుంచింది.

టీ-20లో 120 స్కోర్ ఏమంత గొప్పది కాదు. అందునా ప్రత్యర్ధి జట్టు పుణె కావడంతో ముంబైకి పెద్దగా గెలుపు మీద కాన్ఫిడెన్స్ లేదు. అయినా సరే ఆట అన్న తర్వాత చివర దాకా పోరాడాలి. స్కోర్ ఎంతన్నది మఖ్యం కాదు.. గెలవడానికి ఏం చేయాలన్నది పాయింట్. ఇదే స్ఫూర్తితో ముంబై చెలరేగింది. ఒక పరుగు తేడాతో పుణెను ఓడించి మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. పుణె కెప్టెన్‌ స్మిత్‌ చేసిన పోరాటం వృథా అయింది. సాధారణంగా ఇలాంటి మ్యాచుల్లో ధోనీ దగ్గరుండి జట్టుని గెలిపిస్తాడు. కానీ బూమ్రా వేసిన బంతి మిస్టర్ కూల్ ని కూలదోసింది. రహానే కాసేపు మెరిసినప్పటికీ లాభం లేకపోయింది. కీలక బ్యాట్స్‌ మన్‌ ఔటవడంతో పుణెపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. జాన్సన్‌ మెరుపు బౌలింగ్‌ ముందు పుణె విలవిల్లాడింది. 47 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ ని గెలపు వాకిట నిలబెట్టిన కృణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.