323 బంతులు... 1009 పరుగులు.. ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసిన ఒక ఆటోవాలా కొడుకు!!

323 బంతులు... 1009 పరుగులు.. ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసిన ఒక ఆటోవాలా కొడుకు!!

Tuesday January 05, 2016,

3 min Read

జనవరి 5, 2016. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు... కాదు, కాదు.. వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే గోల్డెన్ డే అని మురిసిపోయే రోజు. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ, మహా అయితే 500 పరుగులు. ఏ ఫార్మాట్ క్రికెట్ లో అయినా ఓ బ్యాట్స్ మెన్ చేయగలిగిన స్కోరు. కానీ ముంబైకి చెందిన ఓ ఆటోవాలా కొడుకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. పరుగుల సునామి సృష్టించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

image


ప్రణవ్ ధన్వాడే. వయసు 15 ఏళ్లు. ముంబైలోని కల్యాణ్ ఏరియాలో ఉంటాడు. కె.సి. గాంధీ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. తండ్రి ప్రశాంత్ ధన్వాడే ఆటో డ్రైవర్. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాట్ తో సాహవాసం చేసిన ప్రణవ్ తాను ప్రపంచ రికార్డు సృష్టిస్తానని ఏ రోజూ అనుకుని ఉండడు. క్రికెట్ లో సెన్సెషన్ సృష్టించి ఒక్క రోజులోనే హీరో అయిపోతానని కలలో కూడా ఊహించి ఉండడు.

323 బంతులు... 1009 పరుగులు... అదీ నాటౌట్. ఇదీ క్రికెట్ లో ప్రణవ్ సత్తా. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్ టీ భండారీ కప్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ అండర్ 16 మ్యాచ్ లో ప్రణవ్ ఈ రికార్డు సృష్టించాడు. 395 నిమిషాల పాటు క్రీజ్ లో నిలబడి 312.38 స్ట్రైక్ రేట్ తో క్రికెట్ గ్రౌండ్ ను దున్నేశాడు ప్రణవ్. 129 ఫోర్లు, 59 సిక్స్ లతో చెలరేగిపోయి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించాడు. 1899లో ఇంగ్లండ్ లో జరిగిన జూనియర్ హౌజ్ మ్యాచ్ లో 628 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఆర్థూర్ కోలిన్స్ దే ఇప్పటి వరకున్న అత్యధిక పరుగుల రికార్డు. తాజాగా ప్రణవ్ మారథాన్ ఇన్నింగ్స్ తో 116 ఏళ్ల నాటి ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

image


1495 పరుగుల వద్ద కెసి గాంధీ హై స్కూల్ ఇన్సింగ్స్ డిక్లేర్ చేయడంతో ప్రణవ్ పరుగుల వరదకు అడ్డుకట్ట పడింది. ఒక్క వ్యక్తిగత స్కోరు విషయంలోనే కాదు.. టీం స్కోర్ విషయంలోనూ కెసి గాంధీ స్కూల్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు ప్రణవ్ కారణమయ్యాడు . 1926లో న్యూ సౌత్ వేల్స్ పై 1007 పరుగులు చేసి విక్టోరియా సృష్టించిన రికార్డును తాజాగా 1495 పరుగులతో కెసి గాంధీ హై స్కూల్ కొల్లగొట్టింది.

ముంబై క్రికెట్ అసోసియేషన్ కోచ్ మోబిన్ షేక్ శిష్యుడైన ప్రణవ్ తల్లిదండ్రులకు ఏకైక సంతానం. భారత స్కూల్ క్రికెట్ చరిత్రలో 546 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును ప్రణవ్ సునాయాసంగా అధిగమించాడు. 2013లో హ్యారిస్ షీల్డ్ మ్యాచ్ లో పృథ్వీ షా ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు ప్రణవ్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రణవ్ ధన్వాడే, సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని. ఆయన కొడుకు అర్జున్ టెండూల్కర్, ప్రణవ్ మంచి స్నేహితులు. క్రికెట్ లో వండర్స్ క్రియేట్ చేసిన ప్రణవ్ కు అభినందిస్తూ సచిన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రణవ్ రికార్డు వెనుక అపారమైన కృషి దాగి వుందని కొనియాడాడు. ఎలాంటి కండీషన్‌లో అయినా వెయ్యి పరుగులు చేయడం అంటే ఆషామాషీ విషయం కాదని ధోనీ కూడా ట్వీట్ చేశాడు. ప్రణవ్ అద్భుత ఇన్నింగ్స్‌కు ధోనీ జేజేలు పలికాడు.

“ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న ప్రణవ్ ధన్ వాడేకు శుభాకాంక్షలు. శెభాష్.. ఇంకా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.’’ - ట్విట్టర్ లో సచిన్
ట్విటర్‌లో సచిన్ అభినందన

ట్విటర్‌లో సచిన్ అభినందన


శిష్యుడు ప్రణవ్ సాధించిన ఘనతతో కోచ్ మోబిన్ షేక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

“ఆరేళ్ల వయసు నుంచి ధన్వాడే నా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రణవ్ సాధించిన రికార్డుతో క్రికెట్ కు మరింత ఆదరణ పెరుగుతుంది. కల్యాణ్ లో ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే సరైన వసతులు లేక వారి ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ఎంసీఏ అధ్యక్షుడు దిలీప్ వెంగ్ సర్కార్ గ్రౌండ్ కోసం స్థలం లభిస్తే అకాడమీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.’’ -మోబిన్ షేక్, కోచ్

క్రికెట్ లో ప్రణవ్ సాధించిన రికార్డుపై అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నారు.

మట్టిలో మాణిక్యం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రణవ్ ధన్వాడే. సరైన వసతులు కల్పించి ప్రోత్సహిస్తే ప్రణవ్ లాంటి వారు మరెన్నో ఘనతలు సాధించి భారత దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రణవ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని యువర్ స్టోరీ డాట్ కాం మనస్పూర్తిగా కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్ ప్రణవ్ ధన్వాడే.