ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. విజయవంతంగా నింగిలోకి జీశాట్‌-19

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. విజయవంతంగా నింగిలోకి జీశాట్‌-19

Monday June 05, 2017,

1 min Read

అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హై స్పీడ్ ఇంటర్నెట్‌ కోసం రూపొందించిన జీశాట్‌-19 ఉపగ్రహాన్ని జీఎస్‌ ఎల్వీ-3డీ నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంతో సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. పదేళ్లపాటు రోదసి నుంచి సేవలందించనుంది జీశాట్‌ 19.

image


అంతరిక్ష యానంలో విజయవంతమైన పరీక్షలతో దూసుకెళ్తోన్న ఇస్రో.. మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా కక్ష్యలోకి ప్రవేశపెట్టి సత్తా చాటింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్‌వీ-3డీ 1 ప్రయోగం విజయవంతమయ్యింది. శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముతూ జీశాట్‌-19 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది వాహన నౌక. కేవలం 16 నిమిషాల 20 సెకన్లలో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్ష్యలోకి ఈ రాకెట్‌ విజయవంతంగా ప్రవేశపెట్టారు

ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనుల మధ్య తమ ఆనందోత్సాహాలను పంచకున్నారు. ఈ ప్రయోగంలో భాగస్వామ్యం అయిన శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌.. భారత అంతరిక్ష ప్రయోగంలో ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ప్రయోగం ఇస్రో చరిత్రలో కొత్త అధ్యాయమని చెప్పారు.

జీశాట్‌-19 ప్రయోగం సక్సెస్‌ కావడంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. జీశాట్‌-19 శాటిలైట్‌ భవిష్యత్తు ప్రయోగాలకు కొత్త దారీ చూపుతుందన్న మోడీ.. ఇస్రో ప్రయోగాలను దేశం గర్విస్తోందంటూ ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ప్రయోగంతో ఇస్రో మరో మైలు రాయి దాటిందన్నారు

ఈ ఉపప్రహం కోసం శాస్త్రవేత్తలు గత 18 ఏళ్లుగా కృషి చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ బరువైన ఉపగ్రహాల ప్రయోగంలో అగ్రదేశాల సరసన చేరింది.