ఆటగాళ్లకు అవకాశాలు, ఆటకు మార్కెటింగ్ 'ది ఫుట్‌బాల్ మైండ్' ఆలోచన

0

ఫుట్ బాల్... ఈ పేరు వింటేనే... ప్రపంచవ్యాప్తంగా యువత ఊర్రూతలూగిపోతుంది. ప్రతీ దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్న ఏకైక క్రీడ కూడా ఇదేనని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. మన దేశంలో ఈ గేమ్‌కు సరైన ఆదరణ లేకపోయినప్పటికీ... కోల్ కతా, గోవా వంటి ప్రదేశాల్లో పుట్ బాల్ అంటే పడిచచ్చే జనాలు కోకొల్లలు. అందుకే.. ఈ క్రీడకు సరైన గుర్తింపును తీసుకువచ్చేందుకు నడుం బిగించారు ముగ్గురు యువ ఇంజినీర్లు.

క్రికెట్‌తో పోల్చుకుంటే... మన దేశంలో ఫుట్ బాల్ అంతగా పాపులర్ కాకపోయినప్పటికీ... మాంచెస్టర్ యునైటెడ్ వంటి టీమ్స్‌కు అభిమాన గణం బలంగానే ఉండటం విశేషం. సాకర్ మ్యాచెస్ జరిగినప్పుడు పబ్‌లు, క్లబ్బులు తమ అభిమాన టీంకు ఛీర్ చేసే యువతతో నిండిపోతుంటాయి. ఈ ఆటకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకునే ప్రాణేశ్, రోహిత్ నారాయణ్, రాహుల్ రాణే అనే యువ ఇంజినీర్లు పూణే కేంద్రంగా ఫుట్ బాల్ ఔత్సాహికుల కోసం ఓ నెట్వర్కింగ్ పోర్టల్ రూపొందించారు.

'క్రమేణా భారత్‌లోనూ ఫుట్ బాల్‌కు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యమైన పట్టణాల్లో లెక్కకు మిక్కిలి ఫుట్ బాల్ అసోసియేషన్లు ఏర్పడుతున్నాయి. అయితే ప్రతీ అసోసియేషన్ కూడా తన రేంజ్‌లోని ఎన్నో క్లబ్స్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ లెక్కన చిన్న జిల్లాల్లోని 10 క్లబ్‌ల దగ్గర నుంచి పెద్ద జిల్లాల్లోని 300 క్లబ్స్ వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఫుట్ బాల్ మైండ్ ఒక్క మహారాష్ట్రలోనే 200 అకాడమీలను, 600 క్లబ్స్‌నూ నిర్వహిస్తోంద'ని ఫుల్ బాల్ మైండ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రాణేశ్ చెబుతున్నాడు.

స్వతహాగా సాకర్ లవర్స్ అయిన 'ది ఫుట్ బాల్ మైండ్' వ్యవస్థాపకులు తమలాగానే ఈ క్రీడను అమితంగా ఇష్టపడే వారి కోసం ఓ ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ ఫార్మ్‌ను లాంచ్ చేయాలని భావించారు. దీని ద్వారా ఈ ఆటపై జనాల్లో మరింత అవగాహన పెంపొందించాలన్నదే వారి ముఖ్య ఉద్దేశం. దేశంలోని ఫుట్ బాల్‌తో ముడిపడిన ప్రతి ఒక్కరూ అంటే... క్రీడాకారులు, కోచ్‌లు, అభిమానులు, క్లబ్స్, అకాడమీలు, అసోసియేషన్లు కూడా ఈ సైట్లో తమ సొంత వెబ్ పేజ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. 'ప్రతి నెట్వర్కింగ్‌కూ ప్రత్యేకమైన ఫీచర్లులను ఈ సైట్లో అందుబాటులో ఉంచాం. కమ్యూనికేషన్, మానిటరింగ్, నైపుణ్యాలను ప్రదర్శించుకోవడం, ఫుట్ బాల్ టోర్నమెంట్ల ప్రణాళికలు రూపొందించుకోవడం దగ్గర నుంచి స్థానికంగా ఫ్యాన్ బేస్‌ను పటిష్టం చేసుకునే వరకూ అన్నింటికీ ఇదే వేదికగా పనిచేస్తుంద'ని రోహిత్ తమ సైట్ గురించి గర్వంగా వివరిస్తారు.

వివిధ జిల్లాలోని ఫుల్ బాల్ అసోసియేషన్లు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాటికి అనుసంధానంగా పనిచేస్తున్న క్లబ్స్, ఆటగాళ్లు, కోచ్‌ల పనితీరుపై గేమ్ లవర్స్‌కు సమగ్ర సమాచారం అందివ్వడమే 'ది పుట్ బాల్ మైండ్' ప్రధాన లక్ష్యం. క్రీడకు సంబంధించిన వార్తలు, నగరంలో జరుగుతున్న ఈవెంట్లపై జనాలకు పూర్తి సమాచారం దీని ద్వారా లభిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న TFMకు ఇప్పుడు భారత్ లోని ఆర్సెనెల్ FC, చెల్సియా FC వంటి గ్రూపుల మద్దతు కూడా లభిస్తోంది.

ఇంకా కావాల్సిన సదుపాయాలను సమకూర్చుకుంటోన్న ఈ స్టార్టప్ ఇటీవలే లీగల్ బాడీలను, అకాడమీలనూ సమకూర్చుకుంది. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ తరహాలోనే కమ్యూనిటీ పోర్టల్స్‌ను రూపొందించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇప్పటివరకూ ఏదీ మెయిన్ స్ట్రీమ్‌లోకి రాలేకపోయాయి. చౌకా, ప్లేయరీఫై వంటివి ఈ డొమైన్ కు చెందినవే. ఇక మన దేశంలో స్పోర్ట్స్‌కు సంబంధించి కన్జ్యూమర్ వెబ్ కంపెనీలను స్థాపించి దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఇంకా కాస్త సమయం పడుతుంది. కానీ, చిత్తశుద్ధితో వేగంగా చోటుచేసుకుంటోన్న మార్పులను ఆహ్వానిస్తూ ముందుకు సాగితే.... ఈ రంగంలోనూ కొత్త టెక్నాలజీ ప్రాణం పోసుకుంటుంది.

ఇదే లక్ష్యంతో రంగంలోకి దిగిన 'ది ఫుట్ బాల్ మైండ్'... ఔత్సాహిక క్రీడాకారులకు, అభిమానులకు నేరుగా క్లబ్స్‌తో సంప్రదింపులు జరుపుకునే అవకాశం కల్పిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన ఆటగాళ్లు... తమ క్లబ్ అధికారులకు, కోచ్‌లకు, ఆఖరికి అభిమానులకు సైతం తమ ప్రతిభను చాటుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే... ఈ రకమైన ప్లాట్ ఫార్మ్ ఒకటి ఉందని మారుమూల ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు గుర్తించినప్పుడే ది ఫుట్ బాల్ మైండ్ వంటి స్టార్టప్స్ కు అసలైన గుర్తింపు లభిస్తుందనడంలో సందేహమే లేదు. మరి... అందులో వీరు ఎంతవరకూ విజయం సాధిస్తారో చూడాలి.

website