ధైర్యే, సాహసే.. జాహ్నవీ !

ధైర్యే, సాహసే.. జాహ్నవీ !

Saturday October 17, 2015,

3 min Read

సాహసం శాయరా డింభకా! అంటూ ఉంటారు. కానీ చెప్పినంత సులువు కాదు. లైఫ్ ఈజే రిస్క్ అని స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు రిస్క్ చేయకపోవడమే జీవితంలో పెద్ద రిస్క్! ఇవన్నీ పక్కన బెడితే అసలు మౌంటెనీరింగ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినే వుంటారు. ఎక్కడో అమెరికా, అమెజాన్, ఆఫ్రికా అడవుల్లో సాహసాలు చేస్తూ కొండెలెక్కే వాళ్లను మనం ఏ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లోనో.. లేక డిస్కవరీలోనో చూసి ఉంటాం. మౌంటెనీరింగ్ (పర్వతారోహణం) అనేది ఓ సాహసక్రీడ. సాధారణ క్రీడలతో పోలిస్తే దీనికి బాగా గుండె ధైర్యం ఉండాలి. మన దేశంలో ఈ దుస్సాహస క్రీడను ఎంపిక చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే జాహ్నవి అనే ఓ తెలుగమ్మాయి మాత్రం ఈ క్రీడపై ఆసక్తి చూపించడమే కాదు వండర్స్ క్రియేట్ చేస్తోంది.

image


జాహ్నవి శ్రీపెరంబుదూరు... ఏడాది వయసులోనే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన చిన్నారి. వచ్చే ఏడాది మూడో ప్రపంచ రికార్డు సాధిస్తానంటోంది. అంటే ఇప్పటి వరకూ రెండు ప్రపంచ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.

“ మౌంటెనీర్‌గా నా ప్రయాణం మూడేళ్ల వయసు నుంచే మొదలైంది. అది కూడా నాన్నతో పాటు ఎక్కుతూ వెళ్లిపోయా. చిన్నప్పటి ఫోటోలు చూసినప్పుడు అనిపిస్తోంది.. నేను అంత చిన్ననాటి నుంచి మౌంటెయినీరింగ్ చేశానా అని ” - జాహ్నవి.

image


జాహ్నవి ప్రయాణం ఎలా మొదలైంది ?

నెలల వయసు నుంచే జహ్నవి వాళ్ల నాన్న క్రిష్ణ తనతో పాటు ఆ చిన్నారిని కొండలపైకి తనతోపాటు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత రెండేళ్లకే మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. రెండున్నరేళ్ల వయసు నుంచే మౌంటెనీరింగ్ శిక్షణ కొనసాగించారు. మొదటి సారి 16 వేల అడుగుల కొండను సునాయాసంగా ఎక్కేసింది జాహ్నవి. అప్పుడు చిన్నారి వయసు 9 ఏళ్లు. ఉత్తరాఖండ్‌లోని రూప్ ల్యాండ్‌లో జాహ్నవీ ఈ ఫీట్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ సాహస యాత్రలు చేస్తోంది. ఏడు ఖండాల్లోని , అత్యంత ఎత్తైన సెవెన్ సమిత్‌ను అధిరోహించాలనేది జాహ్నవి ప్రస్తుత లక్ష్యం.

image


“ అమ్మా, నాన్నల మద్దతు లేకుండా నేనీ పని చేయలేకపోయేదాన్ని. నాన్నగారి ట్రెయినింగ్‌తో పాటు అమ్మ ప్రోత్సాహంతో నేనీ రికార్డులు సాధించాను” - జాహ్నవి.


పెద్ద కొండ - చిన్న వయస్సు

సాధారణ క్రీడల్లో ప్రత్యర్థులు వేరే జట్టువారు ఉంటారు. కానీ ఇక్కడ పోటీపడాల్సింది మాత్రం ప్రకృతితోనే. వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఈ విషయంలో స్థానికంగా ఉన్న గైడ్స్ చెప్పే సలహాలను పాటించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం అన్నింటి కంటే పెద్ద సమస్య. దాన్ని ఎదుర్కోగలిగితే ఎంత పెద్ద సమస్యనైనా ఎంతో సులభంగా దాటేయొచ్చని జాహ్నవి అంటోంది.


“ రష్యాలో వెళ్లినప్పుడు, అక్కడి స్థానిక భాష రాక చాలా ఇబ్బంది పడ్డాను. మన ఆహారపు అలవాట్లతో పూర్తిగా భిన్నమైన అలవాట్లు వారివి. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోవాలని అక్కడే నేర్చుకున్నా” - జాహ్నవి

image


సాధించిన రికార్డులు

  1. భారతదేశం నుంచి అతి పిన్న వయసులో(12ఏళ్లకే) హిమాలయాలను అధిరోహించిన చిన్నారి.
  2. ఆఫ్రికాలోని కిలిమంజోరా పర్వత శ్రేణులపై 13 ఏళ్లకే ట్రెకింగ్ పూర్తి.
  3. ప్రపంచంలో ఉన్న ఏడు అతి ఎత్తైన శిఖరాల్లో రెండింటిని అధిరోహించిన చిన్నారులందరిలో జాహ్నవీయే అందరికంటే చిన్నది.
  4. మిషన్ సెవెన్ సమిత్‌లో సభ్యత్వం పొందిని అత్యంత పిన్న వయస్కురాలు.  

వీటిలో మనం ప్రస్తావించుకున్నవి కేవలం కొన్నిమాత్రమే. వీటితో పాటు ఎన్నో అవార్డులు , రివార్డులు లెక్క నేనన్ని. తక్కువ సమయంలో పూర్తి చేసిన, చిన్న వయసులో సాధించిన రిక్డులైతే అసలు లెక్కేలేదు. ప్రస్తుతం సెవెన్ సమిత్ పూర్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. 


“ లైఫ్ రిస్క్‌తో కూడుకున్న ఇలాంటి క్రీడను ఎంచుకున్నానని నాకెప్పుడూ అనిపించలేదు. రోజూ స్కూలుకి వెళ్లే పిల్లలను చూసినప్పుడు నేను వాళ్లకంటే డిఫరెంట్ ఏమో అని అనిపిస్తుంది. అందరిలా చదువుకోవడానికి కాకుండా ఇలాంటి అడ్వెంచర్లు చేయడానికే నన్ను దేవుడు పుట్టించాడేమో ! ” అంటుంది - జాహ్నవి.


మార్షల్ ఆర్ట్స్, క్లాసికల్స్ డ్యాన్స్ కూడా..

మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారి జాహ్నవికి క్లాసికల్ డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. భరత నాట్యం నేర్చుకున్న జాహ్నవి ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. బొమ్మలు, స్కెచ్‌లు వేయడంతో పాటు చిన్నారి తమ్ముడితో కలసి ఆడుకోవడం అంటే కూడా మహా ఇష్టం అంటోంది. స్కూళ్లు, కాలేజీల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు కూడా చెబ్తోందంటే.. విని ఆశ్చర్యపోవడం మనందరి వంతు.


భవిష్యత్ లక్ష్యాలు

జీవితంలో మొదటి లక్ష్యం ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు శిఖరాలను అధిరోహించడం. ఆ తర్వాత చదువుని పూర్తి చేసి దేశానికి సేవ చేయడం అంటూ రెండు ముక్కల్లో చెబ్తోంది జాహ్నవి. అయితే ఇవి బాగా ఖర్చుతో కూడుకున్నవి. కొంత మంది స్పాన్సరర్స్ ముందుకు వస్తున్నా.. మరింత మంది మద్దతు అవసరముంది. మరిన్ని వివరాలను తన సైట్లో వివరిస్తోంది జాహ్నవి.

www.jaahnavi.com