సర్జరీకి సంబంధించి ఎలాంటి డౌటైనా అడగండి..! ఉచితంగా సమాధానం ఇస్తుందీ వెబ్ సైట్

సర్జరీకి సంబంధించి ఎలాంటి డౌటైనా అడగండి..! ఉచితంగా సమాధానం ఇస్తుందీ వెబ్ సైట్

Tuesday July 18, 2017,

2 min Read

డౌటొస్తే అడగండి అని లెక్చరర్ మాటవరసకు అంటాడు. కానీ అడిగితే క్లాసులో ఎవరైనా నవ్వుతారేమో అని నామూషీతో అడగలేరు. ఒకవేళ ఆ సందేహం ఇతర సమయాల్లో, ఇతర మార్గాల్లో తీరితే సరే. లేదంటే ఆ ప్రశ్న జీవితాంతం ప్రశ్నగానే మిగిలిపోతుంది. సందేహం వస్తే అడగాలా వద్దా అని సందిగ్దం డిగ్రీ స్థాయిలోనే ఉంటుంది. ఇక ఎంబీబీఎస్ విద్యార్ధుల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి? ఫలానా క్వశ్చన్ అడిగితే ఎదుటి వాళ్లు ఎక్కడ నవ్వుతారో అని భయపడి, ప్రశ్నను ప్రశ్నగానే మిగిలిస్తే.. వాళ్లకొచ్చిన సందేహం ఎన్నటికీ తీరకపోతే.. ఒక డాక్టర్ గా అతని నైపుణ్యం ఎలా మెరుగుపడుతుంది..?

image


దేశవ్యాప్తంగా సుమారు 400 కాలేజీలు ఎంబీబీఎస్, ఎండీ ఆఫర్ చేస్తున్నాయి. ఇంకొన్ని లైసెన్స్ డ్ కాలేజీ డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ సర్టిఫికెట్ ఇస్తున్నాయి. కానీ అన్ని కాలేజీలు విద్యార్ధులకు వచ్చిన అన్ని సందేహాలను నివృత్తి చేయడం లేదు. ఇది పచ్చి నిజం. ప్రశ్న ఉత్పన్నమైనా కాన్ఫరెన్సుల్లోనో, క్లాసురూముల్లోనో అడిగే ఛాన్స్ కూడా ఉండటం లేదు. లక్నోకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్ డా. వీకే కపూర్ అంటున్న మాటలివి. ఎంబీబీఎస్ లో ప్రతీ 200 మందికి కలిపి ఒక ప్రొఫెసర్ మాత్రమే ఉండటం.. విద్యార్ధులకు తలెత్తిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోవడానికి మరో కారణం.

ప్రశ్న ఏనాటికీ ప్రశ్నగా మిగలొద్దు. దానికి సమాధానం తెలియాలి. ముఖ్యంగా మెడికల్ ఫీల్డులో ప్రశ్న అనే మాటకే తావుండొద్దు. పరిష్కారం కచ్చితంగా కావాలి. అందుకే ప్రశ్నకు సమాధానం మేమిస్తాం అంటూ ముందుకొచ్చారు డాక్టర్ కపూర్ దంపతులు. ప్రశ్న ఇండియా అనే వెబ్ సైట్ వేదికగా మెడికోల ప్రతీ సందేహానికి సమాధానం ఇస్తున్నారు. 2015 ఏప్రిల్ లో ఈ వెబ్ సైట్ ప్రారంభించారు.

మెడికల్ విద్యార్ధులు తమకు వచ్చిన ఏ సందేహాన్నయినా వెబ్ సైట్ ద్వారా సమాధానాన్ని రాబట్టుకోవచ్చు. క్లాసురూంలో అడగలేక పోయిన ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. టాపిక్ ఎలాంటిదైనా క్వశ్చన్ వెబ్ సైట్లో పోస్ట్ చేస్తే.. దానికి సంబంధించిన ఎక్స్ పర్ట్ ద్వారా సమాధానాన్ని వీలైనంత త్వరలో అదే పోస్టు చేస్తారు.

image


ప్రశ్న ఇండియా వెబ్ సైట్ ద్వారా 70 మంది నిపుణులైన డాక్టర్లు సమాధానాలిస్తున్నారు. 250 మంది జనరల్ సర్జరీ స్టూడెంట్స్ ఈ సైట్లో రిజిస్టర్ అయివున్నారు. రోజుకి ఒక ప్రశ్న మాత్రమే సమాధానం ఇస్తారు. డైలీ వంద రివ్యూల దాకా వస్తుంటాయి. అంశాల వారీగా ప్రశ్నలు, సమాధానాలను సైట్ ఓపెన్ చేసి ఎవరైనా చదువుకోవచ్చు.

ప్రశ్నలకు సమాధానాలను వెబ్ సైట్లో పోస్ట్ చేసే బాధ్యత డాక్టర్ కపూర్ భార్య డా. లిల్లీ కపూర్ చూసుకుంటారు. ఆమె రౌండ్ ద క్లాక్ ఇదే పనిమీద ఉంటారు. వచ్చిన ప్రశ్నలను చూడటం.. దానికి సంబంధించిన నిపుణులైన డాక్టర్లకు పంపడం.. వాళ్ల ఆన్సర్ ని సైట్లో పోస్ట్ చేయడం.. ఇది ఆమె బాధ్యత.

కేవలం క్వశ్చన్ ఆన్సర్లే కాదు.. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఉంటుంది. నిపుణులతో స్కైప్ ద్వారా లైవ్ లో మాట్లాడి తమ డౌట్లను క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 25 సెషన్స్ కండక్ట్ చేశారు.

image


ఈ వెబ్ సైట్ సేవలు పూర్తిగా ఉచితం. లాభాపేక్ష అస్సల్లేదు. పరిమితమైన సేవల్ని విస్తరించేందుకు డాక్టర్ కపూర్.. ప్రభుత్వ సంస్థలను, ఫార్మా కంపెనీలను, విద్యారంగంపై పనిచేసే ఎన్జీవోలను స్పాన్సర్ షిప్ కోసం సంప్రదించాలని భావిస్తున్నారు. ఎందుకంటే తన ప్యానెల్లో ఉన్న నిపుణులకు ఎంతోకొంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది అతని అభిలాష. దాంతోపాటు ఇతర దేశాలకు కూడా వెబ్ సైట్ సేవలను విస్తరింపజేయాలని భావిస్తున్నారు.

అంతేకాకుండా ఎంబీబీఎస్ విద్యార్ధుల కోసం ఒక ప్రత్యేకమైన సబ్ పోర్టల్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానివల్ల లైవ్ క్లాసులు రోజుకి మూడు నుంచి నాలుగు తీసుకోవచ్చేది అతని ప్లాన్