త్వరలో ఇతర రాష్ట్రాలకు అద్దెకు తెలంగాణ జైళ్లు

త్వరలో ఇతర రాష్ట్రాలకు అద్దెకు తెలంగాణ జైళ్లు

Thursday July 27, 2017,

3 min Read

స్వయంసంవృద్ధి దిశగా తెలంగాణ జైళ్లశాఖ అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్ పంపులతో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా అద్దెకు జైలు అనే అనే కాన్సెప్టు రెడీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న బ్యారెక్‌ లో పక్క రాష్ట్రం ఖైదీలను పెట్టి, కిరాయి వసూలు చేయాలని జైళ్లశాఖ భావిస్తోంది. ఆర్ధిక స్వావలంబన కోసం చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా మారబోతోంది.

image


ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం నార్వే అని తేలింది. క్రైమ్ పూర్తిగా తగ్గుముఖం పట్టేసరికి, అక్కడి జైళ్ల శాఖ వినూత్నంగా ఆలోచించింది. కావాలంటే చెప్పండి మా జైళ్లను అద్దెకిస్తాం అని పక్క దేశాలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి. శిక్షాకాలాన్ని బట్టి ఖైదీకి ఇంత అద్దె చొప్పున వసూలు చేస్తూ, ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.

సరిగ్గా అలాంటి ఆలోచనే చేస్తోంది తెలంగాణ జైళ్ల శాఖ. ఎందుకంటే గత రెండేళ్లుగా చూసుకుంటే నేరాల సంఖ్య చాలా తగ్గింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి ఒకేసారి 6,848 ఖైదీలను పెట్టొచ్చు. అయితే ప్రస్తుతం ప్రిజనర్స్ సంఖ్య 6,063 మాత్రమే ఉంది. అందులో 159 మంది మహిళా ఖైదీలు. మరో 263 మంది రిమాండులో ఉన్నారు. అంటే ఎంతలేదన్నా ఇంకో 800 ఖైదీలు పట్టే బారెక్‌ లు ఖాళీగా వున్నాయి. అయితే ఈ సంఖ్య నిలకడగా ఉండటం లేదు. అటుఇటుగా మారుతోంది. ఇంకో ఏడాది తర్వాత శిక్షాకాలం ముగిసి, ఇతరాత్ర కారణాల వల్ల కొంతమంది ఖైదీలు విడుదలవుతారు. అప్పుడు సంఖ్య 5 వేలు అయ్యే అవకాశం ఉంది. ఆ నంబర్ ఒకసారి ఫిక్సయితే, అచ్చం నార్వేలాగే తెలంగాణ జైళ్లను అద్దెకిచ్చే ప్రతిపాదనను గవర్నమెంటు ముందు పెట్టాలని జైళ్లశాఖ భావిస్తోంది.

ఉత్తర ప్రదేశ్, తీహార్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లోని జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. అక్కడ కనీసం వరండాలో పడుకోడానికి కూడా జాగా లేదు. ఈ పరిస్థితుల్లో, తీవ్రవాదులు, హార్డ్ కోర్ క్రిమినల్స్ ను మినహాయించి- చిన్నాచితకా నేరాలు చేసి ఏడాది, 6 నెలలు జైలు శిక్ష అనుభవించేవాళ్లకు, మన రాష్ట్రంలోని జైళ్లలో అకామిడేషన్ ఇచ్చేలా కాన్సెప్ట్ రూపొందిస్తున్నారు. భోజనం, మెడికల్, స్కిల్ డెవలప్మెంట్, మహాపరివర్తన్ కింద అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నందున, ఖైదీకి పదివేల చొప్పున వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన 2వేల మందికి కలిపి, ఏడాదిలో 24 కోట్ల అదాయం వస్తుంది. ఇదంతా నేరుగా సర్కారు ఖజానాకే వెళ్తుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల జైళ్లలో క్రౌడ్ తగ్గుతుంది. అదనపు సిబ్బంది అవసరం పెద్దగా ఉండదు. వాళ్లకోసం పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. చిన్నచిన్న నేరస్తుల కోసం కూడా సాయుధ బలగాలతో జైళ్లలో డ్యూటీ చేయించడం కంటే, రెండు వేలు ఇచ్చి ఖైదీని వేరే జైలుకి పంపడం మేలు కదా! ఆ రకంగా తెలంగాణ జైళ్ల శాఖ ఆర్ధికంగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది.

image


ఇప్పటికే మహాపరివర్తనలో భాగంగా శిక్ష పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఖైదీలకోసం 50 పెట్రోల్ పంపుల్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 29 సైట్స్ గుర్తించారు. ఆల్రెడీ 12 బంకులు ఏర్పాటు చేశారు. వచ్చే పదిరోజుల్లో మరో రెండు మూడు ప్రారంభించబోతున్నారు. అందులో సగం మహిళలు.. సగం పురుషులకు ఉపాధి కల్పిస్తారు. రాష్ట్రంలోని జైళ్లలో అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి బీహార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రశంసించారు. ఆయన స్వయంగా చర్లపల్లి జైలును సందర్శించి ముచ్చటపడ్డారు.

పరివర్తనతో పాటు సోషల్ సర్వీస్ కూడా లక్ష్యంగా పెట్టుకుంది జైళ్ల శాఖ. అందుకు కారణం- చిన్నవయసులోనే దొంగతనాలకు అలవాటు పడి అనేకమంది యువకులు జైలు పాలవుతున్నారు. ఇలాంటి కేసుల్లో చాలామందికి తల్లిదండ్రులు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్లు పేదవాళ్లు. అనాథాశ్రమంలో సరైన శిక్షణ లేకుండా పెరిగి బయటకొచ్చి, నేరాలు చేసి జైలు పాలవుతున్నారు. ఇలాంటి పెయిన్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుని, ఎక్కడెక్కడ కౌన్సెలింగ్ అవసరమో, సమస్య మూలాలు ఎక్కడ వున్నాయో, అక్కడ నుంచి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ రావాలని జైళ్లశాఖ దృఢ సంకల్పంతో ఉంది.