దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిలీ స్మార్ట్ ఫోన్.. బెంగళూరు స్టార్టప్ ప్రయోగం

దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిలీ స్మార్ట్ ఫోన్.. బెంగళూరు స్టార్టప్ ప్రయోగం

Saturday May 02, 2015,

2 min Read

స్మార్ట్ ఫోన్లొచ్చాక మొబైల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. అన్ని పనులకూ సౌకర్యవంతంగా ఉండేందుకు యాప్స్ వచ్చేశాయి. సాధారణ స్థాయిలో చదువొచ్చిన వారైనా ఉపయోగించుకునేందుకు వీలుగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు డెవలపర్లు. అయితే ఇదే సమయంలో వినికిడి శక్తి లేనివారు, చూపు లేనివారికి వీటితో అంతగా ఉపయోగం ఉండడం లేదు. అంతో ఇంతో వాటిలో అనుబంధ టెక్నాలజీ ఉన్నవారు మాత్రమే స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. అయితే... అది కూడా ఇతరుల మాదిరి పూర్తి స్థాయిలో మాత్రం కాదు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతానంటోంది స్కైరిజ్. రే బ్రాండ్‌తో పూర్తి బ్రెయిలీ లిపి ఆధారిత స్మార్ట్‌ఫోన్ అభివృద్ధి చేస్తోందీ సంస్థ.

image


దృష్టి, శ్రవణలోపం ఉన్నవారి కోసం స్మార్ట్ ఫోన్

వినికిడి, దృష్టి సంబంధిత లోపాలున్నవారు ఎదుర్కునే సాధారణ సమస్యలకు... ఇప్పటికే ఉన్న పరిష్కారాలను ఆధారంగా కొత్త మొబైల్ రూపకల్పన చేస్తున్నారు. ప్రధానంగా ఇతర వ్యక్తులను కాంటాక్ట్ చేయడంలో ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా దీన్ని డిజైన్ చేస్తోంది స్కైరిజ్. సాధారణ స్మార్ట్ ఫోన్‌లో ఉండే అన్ని సదుపాయాలు, రే మొబైల్‌లో ఉంటాయని చెప్పడం విశేషం. వీటికి అదనంగా వినికిడి లోపమున్నవారికి రోజువారీ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేలా... ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఈ ప్రాజెక్ట్ లాభదాయకత ఎంత ?

ఒక సెగ్మెంట్‌నే దృష్టిలో ఉంచుకుని ఓ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదా అని ప్రశ్నిస్తే.. స్కైరిజ్ నుంచి వచ్చిన సమాధానం ఇది -" 2011నాటికి భారత దేశంలోని గుడ్డివారిలో 24 లక్షల మంది బ్రెయిలీ లిపి అర్ధం చేసుకోగలరు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 28.5కోట్ల మంది వినికిడి లోపాలున్నవారుండగా... 3.9 కోట్ల మంది గుడ్డివారున్నారు. మా డివైస్‌ను ఉపయోగించుకోగలగే మార్కెట్ స్థాయి ఎక్కువే. అందులోనూ మాకు పోటీ కూడ ఉండదు కాబట్టి... మా ఫోన్ సక్సెస్ అవడం గ్యారంటీ"


విప్లవాత్మకమైన ఉత్పత్తులతో... రోజువారీ జీవితాన్ని మరింత సులభంగా మార్చడమే లక్ష్యమంటోంది స్కైరిజ్. ప్రపంచంలో మొదటి బ్రెయిలీ స్మార్ట్ ఫోన్ తయారు చేయాలని ప్రయత్నిస్తోందీ కంపెనీ. "మేము తయారు చేయదలచుకున్న మొబైల్ ఫోన్‌కి నమూనా రూపొందించేందుకే నెలలు సమయం పట్టింది. దీన్ని చాలా మంది దృష్టిలోపం ఉన్నవారితో పరీక్షించాం. వారు చాలా సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పుడు ప్రోటోటైప్ స్థాయిలో ఉన్న మా సాధనాన్ని... వాణిజ్య ఉత్పత్తిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామం"టారు ఆనంద్‌ఘన్ వాగ్‌మేర్.

ఆలోచన వెనక అసలు వ్యక్తి ఈయనే

ఆనంద్‌ఘన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. రే స్మార్ట్ ఫోన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఈయనదే. ఒక ఆలోచనను ప్రాజెక్టుగా మార్చి, దాన్ని కార్యాచరణలోకి తేవడంలో ఈయనది కీలకపాత్రగా చెప్పుకోవాలి. కాలేజ్ డేస్ నుంచీ కంప్యూటర్లపై ఈయనకు మక్కువ ఎక్కువే. అప్పట్లో కంప్యూటర్ సైన్స్ క్లబ్ నిర్వహించి... దానికి కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వహించారీయన. బ్రెయిలీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ రూపకల్పన ఆలోచనతో.. TEDxSushantLok సమ్మిట్‌లో తన ప్రాజెక్ట్ వివరాలు పంచుకునేందుకు అవకాశం లభించింది వాగ్‌మేర్‌కి.

తాను స్వాభావికంగానే కొత్త వస్తువుల రూపకల్పనకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తన హృదయంలో వచ్చిన ఆలోచనకు పదునుపెట్టి, ఆచరణలోకి తెచ్చేందుకు ఇంజినీరింగ్ చదువు సహాయపడుతుందని చెప్పడం విశేషం. తనను తాను ఓ ఇన్నోవేటర్‌గా చెప్పడానికి సంకోచించరు ఆనంద్‌ఘన్. టెక్నాలజీ అంటే లివింగ్-నాన్ లివింగ్ మధ్య అనుసంధాన కర్త అంటారీయన. నిజ జీవితంలో మనలను ప్రభావితం చేసేలా టెక్నాలజీ అభివృద్ధికి పాటుపడతానని చెబ్తున్నారు.