63 సార్లు ఛీ.. పొమ్మన్నారు ! పట్టు వదలకుండా విజయం సాధించి చూపించిన విక్రమార్కులు

0

2014 లో ఆర్‌విసిఇ బెంగళూరు నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్‌లో, ఇంజనీరింగ్ పూర్తిచేసారు కౌశిక్ ముద్దా, నవీన్ జైన్‌లు. చివరి సంవత్సరంలో ఉండగానే, ఇద్దరికీ ఉద్యోగాలు లభించాయి. చాలా మందికి కల అయిన కెపిఎంజిలో కౌశిక్‌కి ఉద్యోగం దొరికింది. కానీ ఒక సంవత్సరం ముందు... అంటే ఆరో సెమిస్టర్‌లో ఉండగా, వీరిద్దరూ కలసి తమకిష్టమైన ప్రాజెక్టు మీద పనిచెయ్యడం మొదలుపెట్టారు. అందులోనే పూర్తిగా నిమగ్నమైపోయారు.  

“నవీన్, నేను కాలేజీలో ఉన్నప్పుడు చిన్న చిన్న రోబోలు, హోవర్ క్రాఫ్ట్స్ తయారుచేసేవాళ్లం”, అంటూ తెలియజేసారు కౌశిక్. ఆ మెషిన్ల మీద పనిచేస్తున్నప్పుడే రోబోలను ఇంకా మెరుగ్గా తయారుచేసేందుకు అవసరమైన కోత భాగాల్లో ఖచ్చితత్వం ఉండాలని భావించేవారు. అందుకోసం వారికి సిఎన్‌సి అనే రౌటర్ అవసరముంది. కానీ అతిచవకైన మెషిన్ ఖరీదే ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఉంది. “మేం అంత ఖర్చు భరించలేం కాబట్టి మా స్వంత మెషిన్ తయారు చెేయాలని భావించాం. అప్పటినుండి మేము ఇక వెనుతిరిగి చూడలేదు. మా సొంత సమస్యకే మేము పరిష్కారం కనుగొనే దిశలో మా క్లైంట్లకి కూడా పరిష్కారం అందివ్వడంలో సఫలమయ్యాం”, అంటారు కౌశిక్.

ఈథరల్ మెషీన్ల ఆరంభం ఇలాగే మొదలైంది. కానీ ఈ ప్రయాణంలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి.

ముందుగా, వాళ్ల కలల్ని నెరవేర్చుకోవడానికి ఉద్యోగాలు వదిలేయాల్సి వచ్చింది. కానీ కాలేజీ గ్రాడ్యుయేట్స్ అయినందున వీరు తమ అవసరాలను తీర్చగలరో లేదో అనే సంశయాన్ని వ్యక్తం చేసేవారు క్లైంట్స్.

స్నేహితుడి నుంచి అడిగి తీసుకున్న గ్యారేజిలో తమ మొదటి ఆఫీస్ ప్రారంభించింది ఈథరల్ మెషీన్స్. ఒక ప్రోటోటైప్‌ని తయారుచేసాక, వారి హైపోథసిస్‌ని ధృవీకరిస్తూ, మార్కెట్‌ని సెట్ చేసి ఆర్డర్స్ కోసం ఎదురుచూసారు. తయారీదారులకి మార్కెట్లో సరసమైన ధరకి సిఎన్‌సి రౌటర్లను అందించాలనేది వీళ్లిద్దరి లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా తయారీదారులు తమ నిర్దిష్ట అవసరాలకి అనుగుణంగా మెషీన్లను కస్టమైజ్ చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నారంటూ చెప్తున్నారు ఈ ఇద్దరూ. ఇటువంటి సమస్యలను గుర్తించి వారికి సాంకేతిక సహకారం అందిస్తోంది ఈథరల్. ఈ మెషీన్లతో చెక్క, మార్బుల్, గ్రానైట్, ప్లాస్టిక్ మొదలైన వాటి మీద టూడి లేదా త్రీడి డిజైన్లను చెక్కేందుకు లేదా మలచేందుకు ఉపయోగపడతాయి.

మార్కెట్లోకి వెళ్లేటప్పటికీ తిరస్కరణలు ఎదురయ్యాయి. “మొదటి ఆర్డర్ సంపాదించే ముందు 63 తిరస్కరణలు ఎదుర్కొన్నాను,” అంటారు కౌశిక్. వీళ్లిద్దరూ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారని తెలుసుకున్న క్లైంట్ ఒకరు ఈ మెషీన్లను ఆఫీస్ బయటకి విసిరేసారు కూడా. “ఒక క్లైంట్ మాతో పాటూ మెషీన్‌ని ఉపయోగిస్తూ సరైన ఫలితం లభించలేదని మమ్మల్ని ఛీత్కరించారు,” అంటూ గుర్తుచేసుకుంటారు కౌశిక్. ప్రారంభంలో ఒక క్లైంట్ దొరికేవరకూ నవీన్, కౌశిక్ లు తమ 250 అడుగుల గ్యారేజిని శుభ్రం చేసుకోవడం, సేల్స్ మెన్‌గా పనిచెయ్యడం…ఇలా అన్నీ తామై చేసారు. 64వ మీటింగ్ తర్వాత వాళ్లకి ఒక ఆర్డర్ లభించింది. గత కొన్ని నెలలుగా, వాళ్ల దగ్గర చెప్పుకోదగ్గ పెద్ద క్లైంట్ల జాబితా ఏమీ లేదు.. కానీ వ్యాపారం అయితే బాగానే నడుస్తోంది. “వ్యక్తులు ఆంట్రప్రెన్యూర్లగా ఎదిగేందుకు మా మెషిన్లు వారికి సహకరిస్తున్నందుకు మేం గర్వపడుతున్నాం. మా మెషీన్ కొన్న తర్వాత ఇంటీరియర్ డిజైనర్స్‌కి తగిన విధంగా గ్రానైట్ చెక్కుళ్లు, చెక్కని మలచడం, ఖచ్చితంగా మార్క్ చేసి, కట్ చేసి అందించడం వంటి స్వంత వ్యాపారాలని క్లైంట్లు మొదలుపెట్టుకుంటున్నారు,” అంటున్నారు కౌశిక్.

వీరి మెషీన్ల ఖరీదు 2 నుంచి 4 లక్షల రూపాయల మధ్యలో ఉంటాయి. మార్కెటింగ్ కోసం ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. “ఐటి, సేవల రంగంలో ప్రారంభమైన స్టార్టప్స్ దూసుకుపోతున్న ఈ సమయంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో స్టార్టప్ పెట్టడానికి మేము చాలా కష్టపడాల్సివచ్చింది”, అంటారు కౌశిక్. మొదటినుంచీ ఈ మెషిన్ల తయారీ మీద వారికున్న లోతైన పరిజ్ఞానం మీదే వీరి వ్యాపారం ఆధారపడింది. విదేశాలనుంచి తెప్పించుకునే మెషీన్లకి ఇండియాలో సాంకేతిక సహకారం లభించడం కష్టం కాబట్టి సరిగ్గా ఈ పాయింట్ నే తమకి అనువుగా మలుచుకుంది ఈథరల్ మెషీన్స్. విస్తృతంగా పరిశీలిస్తే, చైనా మెషీన్లకే మంచి మార్కెట్ ఉంది. కాకపోతే వినియోగదారులకి మెషీన్లను ఎలా ఉపయోగించాలో, ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించాలో సరిగ్గా తెలియదు. “మా మెషీన్లు ప్రత్యేకమైన సాంకేతికతో తయారయ్యాయి, డిజైన్లు కూడా మేం రూపొందించినవే. ఇందువల్ల మా మెషీన్లు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మా ఇంజనీర్లు గంటల కొద్దీ కస్టమర్లతో కలసి కూర్చుని వారికి శిక్షణ ఇవ్వడం వల్ల మా మెషీన్ల గురించి బాగా అర్ధం చేసుకుంటారు,” అంటారు కౌశిక్.

బెంగళూరులో ప్రారంభమైన ఈథరెల్‌లో ఇప్పుడు ఆరుగురు ఇంజనీర్లు ఉన్నారు. నమ్మకమే అన్నిటికంటే ముఖ్యం, అది కొంతకాలానికి నోటి ప్రచారం ద్వారా మాత్రమే వస్తుంది. ఫీడ్ బ్యాక్, కంప్లైంట్లకి అనుగుణంగా మెషీన్లను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి కంపెనీ ప్రయత్నిస్తూ ఉంది. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ఈథరెల్ కి నాలుగు మెషీన్లు ఉన్నాయి…నెమ్మదిగా ఎదగాలన్నది వారి ప్రణాళిక. “కనీసం రాష్ట్రానికి ఒకటయినా మెషిన్ ఉండాలని, అటుపై రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో కూడా మొదలుపెట్టాలని మా ఆశ. గల్ఫ్ నుంచి, అలాగే మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ నుండి కూడా కొన్ని ఎంక్వైరీలు వచ్చాయి. వాళ్లు చైనా మెషీన్లను నమ్మలేక మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అక్కడ కూడా మేము త్వరలోనే దూసుకు వెళ్తామని ఆశిస్తున్నాము”, అంటూ సైన్ ఆఫ్ చేస్తున్నారు కౌశిక్.

website