ఏ విషయాన్నైనా నాలుగు ముక్కల్లో అర్థమయ్యేలా చెప్పేసే 'ఆసమ్‌లీ'

ఏ విషయాన్నైనా నాలుగు ముక్కల్లో అర్థమయ్యేలా చెప్పేసే 'ఆసమ్‌లీ'

Tuesday September 22, 2015,

4 min Read

ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి ? ఏ విభాగంలో లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు ? ఇలాంటి విషయాలపై పెద్దగా అవగాహన లేకుండా.. నితిన్, అంకిత్, దీపక్‌లు ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి చక్కర్లు కొట్టేవారు. ఈ ముగ్గురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఒక టీంగా ఏర్పడడం యాదృచ్ఛికంగా జరిగిన విషయమే. వీరు ముగ్గురికి పరిచయం ఏర్పడక ముందు.. విడివిడిగా పలు స్టార్టప్‌ ఆలోచనలతో కుస్తీ పట్టారు. అయితే ఆయా టీంలలో స్ఫూర్తి లేకపోవడం, సరైన సలహాలు అందకపోవడంతోపాటు ఇతర పరిస్థితుల కారణంగా.. ముగ్గురికీ చెందిన వెంచర్లన్నీ విఫలమయ్యాయి.

నితిన్, అంకిత్, దీపక్

నితిన్, అంకిత్, దీపక్


పెట్టుబడి నష్టపోతుండడం, కుటుంబం నుంచి ఎదురయ్యే ఒత్తిడి, బాధ్యతల కారణంగా.. జీవితంలో ఓ స్థాయి తర్వాత ఆంట్రప్రెన్యూర్‌లుగా మారేందుకు ప్రయత్నించడం కష్టంగా మారుతుంది.

ఆలోచనకు మూలం

గుర్‌గావ్‌‌లోని యు బ్లాక్‌లో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయం అది. కొన్ని కొత్త ఆలోచనలకు ఆరంభం పలికిన క్షణాలవి. ఇంట్లో కూర్చుని విసుగు చెంది, చల్లని గాలి కోసం ఇంట్లోంచి బయటకు వచ్చాడు దీపక్. ఆ సమయంలో బయట కూర్చుని ఉన్న పొరుగింటి వ్యక్తి నితిన్‌ని చూశాడు. ఆ రాత్రి వాళ్లిద్దరూ నాలుగు గంటలపాటు పాటు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఈ సమయంలో తమ ఆలోచనలు ఒకలాగే ఉన్నాయని, లక్ష్యాలు కూడా ఏకరూపమనే విషయాన్ని తెలుసుకున్నారు దీపక్, నితిన్‌లు. తను పని చేసిన ప్రతీ ప్రాజెక్ట్, టెక్నాలజీ గురించి వివరించాడు నితిన్. ఆ సమయంలో ఈ ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు. అనేక ఆలోచనలను పరస్పరం పంచుకున్నారు. ఎన్‌ఎల్‌పీ(న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం) నుంచి సోషల్ నెట్వర్కింగ్ వరకూ అనేక ప్రాజెక్టులు వారి మాటల్లో దొర్లాయి. 'ఆసమ్‌లీ' (awesummly) ఆలోచన.. గుర్‌గావ్‌లోని ఓ పబ్‌లో డ్రింక్స్ తీసుకుంటున్న సమయంలో తట్టింది దీపక్, నితిన్‌లకు.

ఏమిటీ ఆసమ్‌లీ ?

అనేక ప్రాంతాల (సోర్సెస్) నుంచి వార్తలను సేకరించి.. వాటిని క్లుప్తంగా ఐదారు లైన్లకు కుదించి.. లిస్టింగ్‌ చేసే టూల్ ఆసమ్‌లీ. కేవలం న్యూస్ ఒక్కటే ఈ టూల్ లక్ష్యం కాదు. ప్రతీ లిస్టింగ్‌కు సంబంధించిన అంశాలను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయడం వీళ్ల ప్రధాన లక్ష్యం. అవి వార్తలైనా, ఈ కామర్స్‌ పోర్టల్స్‌లో లిస్ట్ అయ్యే ప్రోడక్ట్‌లయినా, పుస్తకాలు, పర్యాటక ప్రాంతాలు, గూగుల్ సెర్చ్.. ఇలా ఏ లిస్టింగ్‌నైనా సమరీగా (summary) మార్చాలన్నది వీరి ఆలోచన.

"ఇలా కుప్లంగా డీటైల్స్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ మా పోటీ సంస్థలన్నీ వ్యక్తిగతంగా ఆర్టికల్స్‌ను, డీటైల్స్‌ను సమ్మరీ రూపంలోకి మార్చుతున్నారు. ప్రస్తుతం మనమున్న మొబైల్ ప్రపంచంలో ఆన్‌లైన్‌లో చదువుతున్నపుడు.. ఏదైనా ఆర్టికల్ పెద్దగా అనిపిస్తే, వాటిని చదవడం మానేస్తున్నాం. దీంతో అనేక మంచి విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉండడం లేదు. ఏదైనా పెద్ద ఆర్టికల్ చదవాలంటే.. చదవాలని అనిపించేలా క్లుప్తంగా ఉండడం కంపల్సరీ అయిపోయింది"అంటున్నారు నితిన్.

సమ్మరీ ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేజ్)ద్వారా ఈ ప్లాట్‌ఫాంను నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నితిన్ చెబ్తున్నారు.

నితిన్ గురించి నాలుగు మాటలు

కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్ పూర్తి చేశారు నితిన్. టీసీఎస్ రీసెర్చ్ ల్యాబ్స్‌లో రెండున్నరేళ్ల పాటు విధులు కూడా నిర్వహించారు. పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు, ప్రొడక్ట్ డిజైనింగ్, మెషీన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పీ టెక్నాలజీస్, రీసెర్చ్ విభాగాలలో పని చేశారు నితిన్. అయితే.. వీటికి మించి ఇంకా ఏదో సాధించాలని నిరంతరం తపన పడేవాడినని అంటారాయన.

అప్పటికే విజయవంతంగా సంస్థలను నిర్వహిస్తున్న ఆంట్రప్రెన్యూర్స్‌ని నితిన్ స్ఫూర్తిగా తీసుకున్నారు. స్టార్టప్‌పై అనేక ఆలోచనలు చేసినా.. సరైన టీం లేని కారణంగా.. దేన్నీ ఆచరణలోకి తేవడం సాధ్యపడలేదు. దీంతో తన రోజువారీ బోరింగ్ ఉద్యోగం చేస్తూనే.. తనలాంటి ఆలోచనలున్న వ్యక్తుల కోసం ఎదురుచూడసాగారు.

ఎవరీ దీపక్ ?

ఎన్ఐటీ రూర్కెలా నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు దీపక్. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి చెందక తరచుగా ప్రొఫెషన్ మారుతుండేవాడీయన. కెరీర్ ఐదో ఏడాదిలో ఐదో కంపెనీ సీవెంట్‌లో ఉద్యోగం చేసేవారు దీపక్. దీనికి ముందు మూడు స్టార్టప్‌లలో పని చేసిన అనుభవం ఉండగా... ఆంట్రప్రెన్యూర్‌గానూ ఓ ప్రయత్నం చేశారు. ఇదే కాక 10కిపైగా ఆలోచనలు చేసినా.. వాటిని అభివృద్ధి దశలోనే వాటిని వదిలిపెట్టేయాల్సి వచ్చింది.

టీం పై నమ్మకం కుదరక.. ఒంటరిగానే కొన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలం అయ్యాయి. ఉద్యోగం వదిలేసి సొంతగా స్టార్టప్ వెంచర్ ప్రారంభించేందుకు కుటుంబం నుంచి కూడా ఈయనకు మద్దతు లేదు. తను పని చేసిన వెంచర్ హూపోస్‌కి సీఈఓ విజయ్ జుమాని దీపక్‌కు స్ఫూర్తి. తను కూడా అలా ఉద్యోగులకు సన్నిహితంగా ఉండేలా వెంచర్ నిర్వహించాలని కలలు కన్నారు దీపక్.

ప్రారంభ కష్టాలు

దీపక్, నితిన్‌లు ఉమ్మడిగా అయినా వెంచర్‌ని ప్రారంభించడం.. అంత సులువుగా జరగలేదు. ఆ సమయంలో ట్రైపోటో అనే స్టార్టప్‌లో నితిన్ జాయిన్ అవ్వగా.. దీపక్‌కు అది ఇష్టం లేదు. వీరిద్దరూ ప్రతీ రోజు రాత్రి వేళల్లో కలుసుకుని, కనీసం పది నిమిషాలపాటైనా స్టార్టప్ గురించిన ఆలోచనలు చేసేవారు.

ఇద్దరూ కలిసి ఓ వారాంతంలో జరిగిన స్టార్టప్ వర్క్‌షాప్‌కి వెళ్లారు. అక్కడ కొంతమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతా బాగానే ఉంది, ఇక వెంచర్ ప్రారంభించడమే తరువాయి అనుకున్న సమయంలో.. నితిన్ నోయిడాకి వెళ్లిపోయి, అక్కడ న్యూరాన్ అనే కంపెనీలో జాయిన్ అయిపోయారు.

కుటంబ సమస్యలు, ఒత్తిడి కారణంగా.. ముంబైకి మారాల్సి వచ్చింది దీపక్‌కి. తన ఆరో ఉద్యోగంగా హౌసింగ్‌లో చేరారు. చేరిన నెల రోజుల వ్యవధిలోనే న్యూరాన్ సంస్థలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా నితిన్ పదోన్నతి సాధించడంతో.. తను బిజీగా మారిపోయారు. టెక్నాలజీ టీంని అభివృద్ధి చేసుకుంటున్న సమయంలో కోడర్ అంకిత్ పరిచయమయ్యారు.

నితిన్-అంకిత్‌లు కలిసిన వేళ

మొదటిసారి అంకిత్‌ని చూసినపుడే.. తను వెతుకుతున్న కరెక్ట్ కేండిడేట్ ఇతనే అనిపించింది నితిన్‌కి. గుర్‌గావ్‌లోని జీఐటీఎం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు అంకిత్. కాలేజ్‌ రోజుల నుంచే ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై మక్కువ పెంచుకున్న వ్యక్తి అంకిత్.

ఒక కంపెనీ ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించేందుకు.. అంకిత్ అప్పటికే మూడు స్టార్టప్‌లతో కలిసి పనిచేశారు. పూర్తి స్థాయి టీం సెట్ కాకపోవడంతో.. అప్పటివరకూ ఏ వెంచర్‌నీ ప్రారంభించలేదు. పర్ఫెక్ట్ డెవలపర్‌గా గుర్తింపు సాధించడంతోపాటే... ఐఈఈఈ సొసైటీలో మార్కెటింగ్, ఆపరేషన్స్‌ విభాగాలకు హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు అంకిత్.

ఆసమ్‌లీ ప్రారంభం

దీపక్ మరోసారి ఢిల్లీ వెళ్లి.. ఓ రాత్రంతా నితిన్‌తో భేటీ అయి.. ఆసమ్‌లీ గురించిన ఆలోచనను సంపూర్ణంగా వివరించారు. ఐదు రోజుల పాటు వరుసగా దీనిపై పనిచేసి, కార్యాచరణ రూపొందించాక.. వెంచర్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది. తాము ఇంత లేట్ ఎందుకు చేశాం.. ఇప్పటికే ఎందుకు ఈ వెంచర్‌ను ప్రారంభించలేదు అని అనుకుంటూ ఉంటారు దీపక్. వందల కొద్దీ అవరోధాలు, నిరుత్సాహపరచే వ్యక్తులు, కుటుంబం-స్నేహితుల నుంచి అడ్డంకులను దాటుకుని.. చివరకు సొంత వెంచర్‌ని ఏర్పాటు చేయగలగడం విశేషం.

Website