ఇది ఎక్కితే బెంగళూరు నుంచి చెన్నైకి అరగంటలో వెళ్లొచ్చు..!!  

 వాయువేగంతో దూసుకెళ్లే హైపర్ లూప్ వన్

0

టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు కదా. బెంగళూరు నుంచి చెన్నైకి విమానంలో వెళ్లినా ఎంతలేదన్నా అటఇటుగా గంట పడుతుంది. ట్రైన్ అయితే పక్కా ఐదు గంటల జర్నీ. బస్సులో వెళ్తే 7-8 గంటలు ఖాయం. అలాంటిది అరగంటలో దాదాపు 350 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎలా సాధ్యం పడుతుందబ్బా అని అబ్బురపడుతున్నారా? అదంతా టెల్సా మోటార్స్ అధినేత చేసిన టెక్నాలజీ మహిమ.

ఇలాన్ రీవ్ మస్క్. వరల్డ్ టెక్నాలజీ బిజినెస్ లో పరిచయం అక్కర్లేని పేరు. స్పేస్ఎక్స్, పేపాల్, టెల్సా మోటార్స్ తో పాటు అనేక ప్రముఖ కంపెనీలను స్థాపించిన బిజినెస్ టైకూన్. టెల్సా తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో మనముందుకు వస్తున్నాడు. హైపర్ లూప్ పేరుతో ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టబోతున్నాడు. త్వరలో ఆ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు మనదగ్గరికి కూడా రాబోతోంది. కేంద్ర రవాణా శాఖకు ఆల్రెడీ ప్రపోజల్ కూడా పంపారట.

హైపర్ లూప్ వన్. ఒక్కమాటలో చెప్పాలంటే దూరభారాన్ని, సమయాభావాన్ని గణనీయంగా తగ్గించే ప్రయాణ సాధనం. బుల్లెట్ రైలుకు బాబులాంటిది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అధునాతన టెక్నాలజీ సాయంతో రూపొందించిన ట్రావెల్ పాడ్స్.. పెద్దపెద్ద టన్నెల్స్ ద్వారా.. తుపాకీ తూటాల మాదిరిగా దూసుకెళ్తాయి. మెట్రో రైలు లాగా టన్నెల్స్ ను కాంక్రీట్ పిల్లర్ల మీద అమరుస్తారు. వాక్యూమ్ ట్యూబుల ఆధారంగా ట్రావెల్ పాడ్స్ వాయువేగంతో దూసుకుపోతాయి. సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.

దేశంలో మొదటగా చెన్నై, బెంగళూరు మధ్య ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. చెన్నై-ముంబై, బెంగళూరు-ట్రివేండ్రం, ముంబై-ఢిల్లీ కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

వచ్చే ఐదేళ్లలో హైపర్ లూప్ రైల్వే లైన్ ను దుబాయ్-అబుదాబి మధ్య కూడా వేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అది సక్సెస్ అయితే రెండు లోకేషన్ల మధ్య దూరం మరింత తగ్గిపోతుంది. గంటన్నర జర్నీ 12 నిమిషాలే అవుతుంది.

అంతా బానే వుంది కానీ, అంత దూరం టన్నెల్స్, పిల్లర్స్ అమర్చడం ఇంత షార్ట్ గ్యాప్ లో సాధ్యమేనా? రైల్వే అధికారులు కూడా ఇదే సందేహం వెలిబుచ్చుతున్నారు. మన దగ్గరున్న ప్రాంతాలు, ప్రతికూలించే అంశాలు, భూసేకరణ, ఇవన్నీ లెక్కలేసుకుంటే మినమం పదేళ్లయినా పడుతుందని ఓ సీనియర్ రైల్వే అధికారి అభిప్రాయ పడ్డారు. గవర్నమెంటు నుంచి అప్రూవల్ రావడానికే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాలంటారాయన. పైగా టికెట్ ధర అందుబాటులో లేదు.

చెన్నై నుంచి బెంగళూరుకు హైపర్ లూప్ లో వెళ్లాలంటే, ఎంతలేదన్నా మనిషికి ఆరు వేలు అవుతుంది. అంత రేటంటే కేంద్రం ససేమిరా ఒప్పుకోదు. బెంగళూరు నుంచి చెన్నై ఫ్లయిట్ టికెటే రూ. 2వేల నుంచి 3వేల మధ్యలో ఉంటుంది. హైపర్ లూప్ కాస్ట్ ఆరు వేలు అంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వం తగ్గించుకోమని చెప్తుంది.

అదే అబుదాబిలో అంటారా.. అక్కడ బోలెడంత లాండ్. ఇండియాలో అయితే అడుగడుగునా భూసేకరణ సమస్య ఎదురవుతుంది. ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కడమే కాదు.. జనం కూడా ఉత్సాహంతో ఎక్కుతారు. మన దగ్గర సాకారం కావాలంటే ఇంకో ఐదారేళ్లు పట్టడం గ్యారెంటీ.

ఏదేమైనప్పటికీ హైపర్ లూప్ వన్ అనే అధునాతన ప్రయాణ సాధనం ఇండియాలో అడుగు పెట్టడం అనేది స్వాగతించాల్సిన విషయం. ఎట్ ద సేమ్ టైమ్.. అది సామాన్య ప్రజలకు అందుబాటులో వుండకపోవడం విచారకరం.  

Related Stories

Stories by team ys telugu