బ‌ట‌న్ క్లిక్‌తో బండి రిపేర్‌ ! ఇద్ద‌రు కుర్రాళ్ల వినూత్న ఆలోచ‌న‌ !!

0

ఫ్రెండ్స్‌తో అద్భుత‌మైన రోడ్ ట్రిప్ మ‌ధ్య‌లో కారు టైరు పంక్చ‌ర్ అయితే? ఫ‌్యామిలీతో హాలిడే జాలీగా ఎంజాయ్ చేస్తుంటే బండి బ్రేక్‌డౌన్ అయితే? మూడ్ పాడ‌వ‌డం సంగ‌తి త‌ర్వాత‌.. ముందు ప్రొఫెష‌న‌ల్ మెకానిక్ ఎక్క‌డ దొరుకుతాడో అర్ధంకాక జుట్టు పీక్కుంటాం. అదీ కొత్త ప్లేస్ అయితే చుక్కలు చూస్తాం . రోడ్‌సైడ్ మెకానిక్‌తో అడ్జ‌స్ట్ అవ్వాలి. వాడు స‌రిగా రిపేర్ చేస్తాడో లేదో అనుమానం! ఇలాంటి స‌మ‌స్యే అంద‌రూ దాదాపు ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కొని ఉంటారు. ఇలాంటి ప్రాబ్ల‌మ్స్‌కి టెక్నాల‌జీతో ప‌రిష్కారం క‌నుక్కున్నాడు ఓ కుర్రాడు!

కార్తీక్ వెంక‌టేశ్వ‌ర‌న్‌. ఆఫీస్ నుంచి ఒక‌రోజు ఇంటికి వెళుతుంటే కారు టైరు పంక్చ‌ర్ అయింది. ఎక్క‌డ పంక్చ‌ర్ వేస్తారో తెలియ‌క గంట‌సేపు అటూ ఇటూ తిరిగాడు. ఆఖ‌రుకు ఒక మెకానిక్‌ని ప‌ట్టుకుని రిపేర్ చేయించుకున్నాడు. అదే స‌మ‌యంలో అవ‌స‌రానికి చేతిలో మెకానిక్‌ల డేటా ఉండాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. త‌న‌లా ఇదే స‌మ‌స్య ఎదుర్కొన్న‌వాళ్ల‌కు ప‌రిష్కారంగా గోబంప‌ర్ అనే యాప్‌ని త‌యారుచేశాడు.

ఆచ‌ర‌ణ‌లోకి ఆలోచ‌న‌

ఐఐఎం షిల్లాంగ్‌లో చ‌ద‌వుకునే స‌మ‌యంలో కార్తీక్ మిత్రుడు నంద‌కుమార్‌కు ఒక అల‌వాటు ఉండేది. త‌న బైక్ రిపేరింగ్‌కి ఏయే స‌ర్వీస్ సెంట‌ర్ ఎంత చార్జ్ చేస్తోందో క‌నుక్కునేవాడు. స్పేర్‌పార్ట్‌ రేట్ల‌లో తేడా కూడా గ‌మ‌నించేవాడు. ఖ‌ర్చుల‌ను బ్యాలెన్స్ చేయ‌డానికి డీల‌ర్లు ఎక్కువ రేట్లు తీసుకోవ‌డాన్ని గుర్తించాడు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నిటినీ అధిగ‌మిస్తూ యాప్ చేయాల‌న్న ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టారు. ఆ ఐడియాల ఫ‌లితంగానే చెన్నైలో గోబంప‌ర్ యాప్ లాంచ్ అయింది. కార్తీక్‌, నంద, గ‌తంలో స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించేందుకు www.northerly.in, అనే బిజినెస్ క‌న్స‌ల్టింగ్ ఫ‌ర్మ్‌ను స్టార్ట్ చేశారు. ఆ అనుభ‌వం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. ఆరునెల‌ల పాటు మార్కెట్‌పై రీసెర్చ్ చేసి గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో గోబంప‌ర్‌ను రిలీజ్ చేశారు. కార్తీక్ చిన్న‌నాటి స్నేహితుడు సుంద‌ర్ వాళ్ల టీమ్‌తో జాయిన్ అయి.. డిజిట‌ల్ మార్కెటింగ్‌, అన‌లిటిక్స్‌లో సాయప‌డుతున్నాడు.


గోబంప‌ర్ ఎలా ప‌నిచేస్తుంది?

ఏ ప్రాంతంలో ఉన్నా.. అక్క‌డ ఆటోమొబైల్ స‌ర్వీసులు అందించే వాళ్ల లిస్ట్‌ని అందిస్తుంది గోబంప‌ర్‌. ఓఈఎమ్‌ ఆధ‌రైజ్డ్ ఫ్రీ స‌ర్వీసుల ద‌గ్గ‌ర్నుంచి రెగ్యుల‌ర్‌, పెయిడ్ స‌ర్వీసెస్‌, చిన్న రిపెయిర్లు, 27గంట‌ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌, వెహిక‌ల్ ఇన్‌సూరెన్స్ రెన్యువ‌ల్‌, ద‌గ్గ‌ర్లోని పెట్రోల్ బంక్‌ల వివ‌రాలు.. యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ స‌ర్వీసులు అందించే వాళ్లు ఎవ‌రైనా.. గోబంప‌ర్ ద్వారా త‌మ కంపెనీని లిస్ట్ చేసుకోవ‌చ్చు. యాప్ ద్వారా స‌ర్వీసు వినియోగించుకుంటే.. క్ష‌ణ‌క్ష‌ణం స‌ర్వీస్ వివ‌రాలు అటు క‌స్ట‌మ‌ర్‌కి, ఇటు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌కి అందుబాటు ఉంటాయి.

రియ‌ల్‌ టైం చాట్ ప్లాట్‌ఫాం.. ఈ యాప్‌లో మ‌రో మంచి పాయింట్‌. క‌స్ట‌మ‌ర్ ఇచ్చే ఆడియో, ఫోటోలను బేస్ చేసుకుని స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ద‌గ్గ‌ర్నుంచి రిపేర్‌కి ఎంత అవుతుందో ఇన్‌స్టంట్ కోట్ వ‌చ్చేస్తుంది. ఒక‌సారి స‌ర్వీస్ చేయించుకుంటే మ‌ళ్లీ నిర్ణీత స‌మ‌యానికి రిమైండ‌ర్లు, ఆఫ‌ర్లు క‌స్ట‌మ‌ర్ల‌కు చేరిపోతాయి.

క‌స్ట‌మ‌ర్ల‌తో పాటు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు అవ‌స‌న‌మైన డేటాను అందిస్తుంది గోబంప‌ర్‌. క‌స్ట‌మ‌ర్ల బుకింగ్, ఏయే స‌ర్వీసులు వాడుతున్నారు? ఏవి ఎక్కువగా వాడుతున్నారు? వ‌ంటి అన‌లిటిక‌ల్ డేటా.. ప్రొవైడ‌ర్లు మ‌రింత సుల‌భంగా స‌ర్వీసులు అందించ‌డానికి వీలుప‌డేలా చేస్తోంది. యాప్‌ మార్కెట్‌లో ఇలాంటి యాప్స్ చాలా ఉన్నా.. కార్ లేదా బైక్‌ని కొన్న తేదీ నుంచి పూర్తిస్థాయి డేటాను అందుబాటులో పెట్ట‌డం త‌మ యాప్ స్పెషాలిటీ అంటారు కార్తీక్‌.

బిజినెస్ ఐడియా

యాప్ లాంచ్ చేసిన రెండు నెల‌ల్లోనే 700 మంది క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించి.. రూ.15 ల‌క్ష‌ల విలువ‌గ‌ల 100 ట్రాన్సాక్ష‌న్ల‌ను స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశామ‌ని గోబంప‌ర్ టీమ్ చెబుతోంది. ఇక ప్ర‌స్తుతానికి గోబంప‌ర్‌లో 260మంది స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు రిజిస్ట‌ర్ అయి ఉన్నారు. అందులో 50 ఫోర్‌వీల‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్లు కాగా.. 120 టూవీల‌ర్ సెంట‌ర్లు, 90 టైర్ పంక్చ‌ర్ షాపులు ఉన్నాయి.

ఫండింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈ కంపెనీ.. రాబోయే నెల‌ల్లో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను పెంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోంది. రెండునెల‌ల కాలంలో చెన్న‌య్ మొత్తం స‌ర్వీసులు అందించ‌డంతో పాటు చుట్టుప‌క్క‌ల జిల్లాల‌ను కూడా క‌లుపుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ టార్గెట్ రీచ్ అయిన త‌ర్వాత బెంగ‌ళూరు, మిగ‌తా మెట్రోల్లో కూడా స‌ర్వీస్ లాంచ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉందీ గోబంప‌ర్ టీమ్‌.

“చిన్న‌చిన్న ప‌ట్ట‌ణాల్లో లోక‌ల్ భాష‌లో ఇంట‌ర్‌ఫేస్ త‌యారుచేసి స‌ర్వీసులు అందిచ‌బోతున్నాం. చెన్న‌య్‌లో దీన్ని టెస్ట్ చేస్తున్నాం ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్‌తో పాటు..క‌మ్యూనికేష‌న్ అంతా త‌మిళంలోనే ఉంచాం. ఎందుకంటే లోక‌ల్ మెకానిక్‌లు స్ధానిక భాష‌లో ఉండ‌టానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు- కార్తీక్

IndiaProperty.com సీఈవో గ‌ణేష్ టీ వాసుదేవన్‌.. ప్ర‌స్తుతం గోబంప‌ర్‌ను గైడ్ చేస్తున్నారు. అలాగే ఆటోమొబైల్ రంగంలో 25 ఏళ్ల ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న రాఘ‌వేంద్ర‌.. ఈ కంపెనీకి మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.